Abn logo
Oct 19 2021 @ 02:22AM

గంజాయి రాజ్‌

 • ఏజెన్సీలో ‘దమ్ము’ చూపుతున్న స్మగ్లర్లు
 • బయటి రాష్ట్రాల నుంచి మత్తు ముఠాలు
 • ఎకరా సాగుకు లక్ష.. ఆదాయం 10 లక్షలు
 • దీంతో అండగా నిలుస్తున్న గిరిజనం
 • స్మగ్లర్ల కోసం వచ్చే పోలీసులపై దాడులు
 • మావోయిస్టు ఖిల్లాలో వేల ఎకరాల పంట
 • ఏటా కోటి కిలోల గంజాయి రవాణా
 • దూరాన్నిబట్టి వెయ్యి నుంచి లక్ష చెల్లింపు
 • లారీల్లోని రహస్య అరల్లో అమర్చి తరలింపు
 • చిన్న ప్యాకెట్లుగా విద్యార్థులతో అమ్మకం
 • హైదరాబాద్‌లో కిలో రూ.15 వేలు


ఆంధ్రా- ఒడిసా బోర్డర్‌ అనగానే గుర్తుకొచ్చేది మావోయిస్టు ఉద్యమం. ఆ తర్వాత ఉద్యానవనాలను తలపించే గంజాయి సాగు. మావోయిస్టులను గాలిస్తూనో, గంజాయి స్మగ్లర్లను వేటాడుతూనో పోలీసులు తరచూ మన్యంలోకి వస్తుంటారు. ఆదివారం అలా స్మగ్లర్లను వెతుకుతూ వచ్చిన నల్లగొండ పోలీసులను గిరిజనులు అడ్డుకోవడం..ఈ క్రమంలో పేలిన తుపాకులు... మన్యంలోని గంజాయి రాజ్‌ని మరోసారి తెరపైకి తెచ్చాయి. అటు బయటి రాష్ట్రాల నుంచి స్మగ్లర్ల తాకిడి, ఇటు మావోయిస్టుల కదలికలతో ఏజెన్సీలో గంజాయి సాగు రానురాను పెరిగిపోతున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

మన్యంలో గంజాయి గుప్పుమంటోంది. స్మగ్లర్ల ‘పంట’ పండుతోంది.  ప్రాచీన పోడు పద్ధతిలో వ్యవసాయం సాగే కొండ కోనల్లో... ఆధునిక పద్ధతుల్లో గంజాయి పండుతోంది. బలిమెల రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న భూముల్లో స్ర్పింక్లర్లు, డ్రిప్‌ పరికరాలను వినియోగిస్తున్నారు. గంజాయి సాగుకు నీరు ప్రధానం. అందువల్ల గెడ్డలు, వాగులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. రబీ సీజన్‌లో సమీపంలోని గెడ్డల నుంచి నీటిని పంటలకు మళ్లిస్తున్నారు. గంజాయి సాగుకు పంట భూముల మాదిరిగానే దుక్కి దున్నుతారు. చివరి దుక్కిలో పశువుల గుత్తం, సేంద్రియ ఎరువులు వేస్తారు. మొక్క దశలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో 500 పాదులు తీస్తారు. ఒక్కో పాదులో 15 నుంచి 20 విత్తనాలు నాటతారు. వారంరోజుల్లో విత్తనం మొలకెత్తి, నెలరోజుల్లో మొక్క దశకు చే రుకుంటుంది. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు...అంటే సుమారు ఐదు నెలలపాటు గంజాయి మొక్కలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. చీడపీడలు ఆశించినట్టు గుర్తిస్తే, వెంటనే ఆయా ఆకులను, పురుగులను తొలగిస్తారు. పురుగుల నివారణకు మందులను పిచికారీ చేస్తారు. మొక్కలు బలంగా, ఏపుగా పెరిగేందుకు ఎరువులను వినియోగిస్తున్నారు. విత్తిన ఐదు నెలలకు పంట చేతికి వ స్తుంది. 


 అటు మావోయిస్టులు..

ఏవోబీ ప్రాంతం మావోయిస్టుల కదలికలకే కాకుండా గంజాయి సాగుకూ ప్రసిద్ధిచెందింది. అధికారులు ఏవోబీని గంజాయి రాజధానిగా పిలుస్తుంటారు. ఒడిశాను ఆనుకుని ఉన్న విశాఖ జిల్లా ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి మండలాల్లో అధికంగా.. కొయ్యూరు, అనంతగిరి మండలాల్లో అక్కడక్కడా గంజాయి సాగు చేస్తున్నారు. అయితే 99ు సాగు ఒడిశాను ఆనుకుని ఉన్న మారుమూల గ్రామాల్లోనే జరుగుతోంది. ఇవి మావోయిస్టు ప్రభావిత గ్రామాలు కావడం, పోలీసులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉండడం సాగుదారులకు కలిసొచ్చే అంశం. వారికి మావోయిస్టులు అండగా నిలుస్తున్నట్టు ఎటువంటి ఆధారాలూ లేవు. అయితే సాగును వ్యతిరేకించడం లేదు. సాగును నిర్మూలిస్తామన్న అధికారుల ప్రకటనలు కార్యరూపం దాల్చడంలేదు. 


 ఇటు స్మగ్లర్లు..

తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాలకు చెందిన గంజాయి స్మగ్లర్లు, ఏజెన్సీలో గంజాయి సాగు చేసే రైతులకు పెట్టుబడి పెడుతున్నారు. స్వల్ప పెట్టుబడితో విపరీతమైన లాభాలు వస్తుండడంతో గిరిజనులు కూడా ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఖర్చును వ్యాపారులే పెట్టుబడిగా పెట్టి, గంజాయి పంట చేతికి వచ్చిన తరువాత నిర్ణీత ధరకు తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. కాగా, దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా...అది కచ్చితంగా విశాఖ ఏజెన్సీ నుంచే రవాణా అయినట్టు వార్తలు వస్తుంటాయి. ఇక్కడి నుంచే విదేశాలకు కూడా తరలిపోతోంది. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులతో సాగు చేయిస్తున్న స్మగ్లర్లు.. రవాణాకు పోలీస్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ, అటవీ శాఖల్లో కొందరు సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారు.


  25 వేల ఎకరాలు.. వేల కోట్ల వ్యాపారం

ఏజెన్సీలో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, చింతపల్లి మండలాల్లో 30 పంచాయతీల పరిధిలో 151 గ్రామాల్లో సుమారు పది వేల ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.  వాస్తవంగా వందకుపైగా పంచాయతీల్లో వెయ్యి గ్రామాల్లో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారనేది ఒక అంచనా. మొత్తం మీద రూ.2 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఇది మన్యంలో మాత్రమే! ఇదే గంజాయి నర్సీపట్నంలో కిలో రూ.6 వేలు, అనకాపల్లిలో కిలో రూ.5 వేలు, హైదరాబాద్‌లో అయితే కిలో రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ధర ఉంది. ఇతర రాష్ట్రాల్లో మరింత పెరుగుతుంది. 


 భారీ నెట్‌వర్క్‌

విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగుకు ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లే పూర్తి అండదండలు అందిస్తున్నారు. గంజాయి సాగు, రవాణా విషయంలో స్మగ్లర్లకు భారీ నెట్‌వర్క్‌ ఉంది. వారికి సంబంధించిన కొందరు వ్యక్తులు మండల, పంచాయతీ కేంద్రాల్లో ఎవరికీ అనుమానం రాకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ.. తమ ముఠా వ్యక్తులను మారుమూల ప్రాంతాల్లో ఉంచుతారు. ప్రధానంగా పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఎస్‌.కోట, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో స్మగ్లర్లకు చెందినవారు పలు రకాల దుకాణాలను నిర్వహిస్తున్నారు. గంజాయి సాగు చేసే రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, అడ్వాన్సులు ఇవ్వడం వంటివి మండల, పంచాయతీ కేంద్రాల్లో ఉన్న వ్యక్తులు చేస్తారు. మరికొందరు గంజాయి పండించే గ్రామాల్లో నివాసముంటూ సాగు, కోత, ప్యాకింగ్‌తోపాటు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతంలో విశాఖ, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, కొత్తకోట, ఎలమంచిలి, తుని, తదితర ప్రాంతాల్లో గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత తీసుకుంటారు. ఇలా చేర్చిన గంజాయిని కొన్నిసార్లు వెంటనే రాష్ట్రం, దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. లేకపోతే స్థానికంగా ట్రాన్సిట్‌ బ్రోకర్లను నియమించుకుని, వారి వద్ద నిల్వ ఉంచి, అదను చూసుకుని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ఏవోబీ నుంచి ఏటా సుమారు కోటి కిలోల గంజాయి ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుండగా, పట్టుకుంటున్నది అందులో ఐదు శాతం కూడా ఉండదని అధికారులే అంగీకరిస్తున్నారు.


 ఏడాది పొడవునా రవాణా

ఏజెన్సీ నుంచి ఏడాది పొడవునా గంజాయి రవాణా అవుతుంది. గిరిజనులు పండించిన పంటను స్మగ్లర్లు కొనుగోలు చేసి, సాగుదారుల ఇళ్లలో లేదా రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తారు. మార్గమధ్యంలో జరిగే తనిఖీలను దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వివిధ మార్గాల ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ఎప్పటికప్పుడు పద్ధతులను మార్చుతూ సరుకును గమ్యం చేరుస్తున్నారు. పోలీసులు లారీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తే తప్ప పట్టుబడే అవకాశం లేదు. 


 సీలేరు మీదుగా తెలంగాణకు

జీకే వీధి, చింతపల్లి మండలాల్లో మారుమూల గ్రామాల్లో పండిస్తున్న గంజాయిని సీలేరు, డొంకరాయి మీదుగా తెలంగాణకు రవాణా చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 28న ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు 4,383 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో 3,653 కేజీల గంజాయిని, ఖమ్మం రూరల్‌ మండలంలో 730 కిలోల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. అదే నెల ఆరో తేదీన తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీసులు సీలేరు వైపు నుంచి వస్తున్న వ్యాన్‌ను తనిఖీ చేసి 2,160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 


  యువత, విద్యార్థులు, పేదలే కీలకం

గంజాయి స్మగ్లర్లు ఏజెన్సీతోపాటు మైదాన ప్రాంత నిరుద్యోగ యువకులు, కళాశాలల విద్యార్థులను, నిరుపేద కుటుంబాలకు చెందినవారిని గంజాయి రవాణాలో పావులుగా వాడుకుంటున్నారు. రెండు కిలోల నుంచి ఐదు కిలోల వరకు ప్యాకింగ్‌ చేసి, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగుల్లో గమ్యస్థానానికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీలో నిర్ణీత ప్రదేశం నుంచి మైదాన ప్రాంతంలో గమ్యస్థానానికి గంజాయి చేరవేసినందుకు కిలోకు రూ.1,000 వరకు ఇస్తున్నారు. ఆదాయం బాగుండటంతో నిరుద్యోగ యువత... స్మగ్లర్లకు సహకరిస్తోంది. పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు పట్టుకున్న గంజాయి కేసుల్లో నూటికి 90 శాతం మంది వీరే ఉంటున్నారు. సరుకు ఎంత అనేదేకాకుండా.. ఇందుకు వాడే వాహనాన్ని బట్టీ చెల్లింపులు ఉంటున్నాయి. ఏజెన్సీ నుంచి అనకాపల్లి లేదా నర్సీపట్నం ప్రాంతానికి కారు, జీపులో రవాణా చేస్తే రూ.లక్ష వరకు, బైక్‌పై 20 కిలోల గంజాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తే రూ.25 వేలు చెల్లిస్తారు. ప్రయాణికుల ముసుగులో మహిళలు, వృద్ధులు, విద్యార్థులను గంజాయి  రవాణాకు వినియోగించుకుంటున్నారు.


 అన్ని దారులూ అటే..

గూడెంకొత్తవీధి, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో పండించే గంజాయిని చింతపల్లి మీదుగా నర్సీపట్నం చేర్చి, అక్కడి నుంచి జాతీయ రహదారిపై ఎంపిక చేసిన ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. 

ముంచంగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో పండించిన గంజాయిని అటు ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌, ఇటు అరకులోయ, కొత్తవలస మీదుగా విశాఖపట్నం రవాణా చేస్తున్నారు. 

పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండలాల్లో పండిస్తున్న గంజాయిని చోడవరం మీదుగా అనకాపల్లి చేర్చుతున్నారు. వాహనాల ద్వారానే గంజాయి రవాణా చేస్తున్నారు. 

అనంతగిరి, దేవరాపల్లి మండలాల సరిహద్దు గ్రామాల నుంచి దేవరాపల్లి వరకు, జి.మాడుగుల మండలాన్ని ఆనుకుని ఉన్న వి.మాడుగుల, రావికమతం, రోలుగుంట మండలాల్లోకి అడవిగుండా కాలిబాటన తరలిస్తున్నారు.


 ఇలా కట్టడి చేయొచ్చు..

ఇతర రాష్ట్రాల నుంచి ఏజెన్సీకి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి. గంజాయి సాగుదారులకు, స్మగ్లర్లకు నడుమ మధ్యవర్తులుగా ఉన్న ముఠాలను అరికట్టాలి. గంజాయి సాగుకు అలవాటుపడిన గిరిజన రైతులు ప్రత్యామ్నాయ పంట వేసేలా ప్రభుత్వ శాఖలు కృషిచేయాలి. నిరుద్యోగ యువతను గంజాయి రవాణాకు దూరం చేయాలి. పట్టాభూముల్లో గంజాయి సాగు చేస్తున్న వారి పట్టాలు రద్దు చేయాలి. మరింత లోతుగా దర్యాప్తు జరిపి, తెరవెనుక పెద్దలను గుర్తించి శిక్షలు పడేలా చేయాలి. ఎర్రచందనం తరహాలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలి. పోలీస్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా, సమన్వయంతో కనీసం మూడేళ్లపాటు దాడులు నిర్వహిస్తేనే ఫలితం ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.


 • ఎకరా విస్తీర్ణంలో సుమారు 500 కిలోల గంజాయి దిగుబడి వస్తుంది. స్మగ్లర్లు ఇళ్ల వద్దకే వచ్చి కిలో రూ.రెండు వేల చొప్పున కొంటారు. అంటే ఎకరానికి ఏకంగా రూ.పది లక్షల ఆదాయం! ఇందుకు గిరిజన రైతు చేసే ఖర్చు రూ.లక్ష లోపే! ఏజెన్సీలో ఏ పంటకూ ఇలా పదింతల ఆదాయం రాదు.
 • మన్యంలో రాజహంస, కళాపత్రి, శీలవతి రకాలను సాగు చేస్తున్నారు. శీలవతి రకానికి ఎక్కువ డిమాండ్‌. 
 • ఏవోబీ పరిధిలోని గూడెంకొత్తవీధి, చింతపల్లి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలు మావోయిస్టు ఖిల్లాలు. ఇక్కడే గంజాయి సాగు అధికం. వీరికి భయపడి పోలీసులు తోటలను ధ్వంసం చేయడానికి  వెనుకాడుతున్నారు. 
 • గంజాయి రవాణాకు స్మగ్లర్లు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. గతంలో గోనె సంచుల్లో తరలించేవారు. కొంతకాలం నుంచి లారీలో రహస్య అరలు ఏర్పాటుచేసి.. చిన్నచిన్న ప్యాకెట్లను వాటిలో అమర్చి రవాణా చేస్తున్నారు. ఓ మినీవ్యాన్‌లో ప్లైఉడ్‌ షీట్లను కత్తిరించి, మధ్యలో గంజాయి ప్యాకెట్లను ఉంచి, తరలిస్తున్న లారీని నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. 

విడిచిపెట్టడానికి పోలీసులు డబ్బడిగారు

భీమరాజు ఆరోపణ.. 3రోజుల తర్వాత విడుదల

చింతపల్లి, అక్టోబరు 18: గంజాయి కేసులో నిందితులుగా భావిస్తూ అదుపులోకి తీసుకున్న ముగ్గురు గిరిజనుల్లో కిల్లో భీమరాజును నల్లగొండ పోలీసులు సోమవారం ఉదయం విడిచిపెట్టారు. భీమరాజుని స్థానిక పోలీసులు వెంట పెట్టుకువెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ రోజు ఏమి జరిగిందనేది భీమరాజు మీడియాకు తెలిపారు. ‘‘దసరా రోజున పోలీసులు గ్రామానికి వచ్చారు. ‘కిల్లో భీమరాజు ఎక్కడుంటా’డని అడిగారు. నేనే భీమరాజునని చెప్పాను. కారు ఎక్కమంటూ లాక్కొంటూ తీసుకువెళ్లారు. ఎందుకు తీసుకువెళుతున్నారని అడిగితే...తల, కాళ్లు, చేతులపై కొట్టారు. మూడు రోజులు నర్సీపట్నంలోని ఒక లాడ్జిలో ఉంచారు. 150 ప్యాకెట్ల (300 కిలోలు) గంజాయి లేదా రూ.5 లక్షల నగదు ఇస్తే విడిచిపెడతామని చెప్పారు. నాకు గంజాయితో సంబంధం లేదని చెప్పినా వినలేదు. సోమవారం ఉదయం అన్నవరం ఎస్‌ఐ వచ్చారు. నన్ను ఇంటికి వెళ్లిపోమని చెప్పి ఆయనకు అప్పగించారు’’ అని వెల్లడించారు. కాగా, నల్లగొండ పోలీసుల కాల్పుల్లో గాయపడి, నర్సీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు గిరిజనులను ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా, కాల్పుల ఘటన గాలిపాడు గ్రామ గిరిజనులను కలవరపెడుతోంది. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...