ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా జగన్ పరిస్థితి..!

ABN , First Publish Date - 2020-10-28T18:33:52+05:30 IST

ముందు నుయ్యి- వెనుక గొయ్యి అన్న చందంగా మారింది జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పరిస్థితి. పోలవరంపై కేంద్రాన్ని నిలదీద్దామంటే.. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ఒకవైపు. పోనీ నిధులు సర్దుబాటు చేసుకుందామంటే వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 30 వేల కోట్లు కావాలి.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా జగన్ పరిస్థితి..!

ముందు నుయ్యి- వెనుక గొయ్యి అన్న చందంగా మారింది జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పరిస్థితి. పోలవరంపై కేంద్రాన్ని నిలదీద్దామంటే.. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ఒకవైపు. పోనీ నిధులు సర్దుబాటు చేసుకుందామంటే వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 30 వేల కోట్లు కావాలి. దీంతో జగన్ సర్కారుకి ఏమి చేయాలో తోచడం లేదు. దీనిపై చివరకు ప్రధానికి, కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖల మంత్రులకు లేఖ రాయాలని నిర్ణయించుకుంది. అయితే ఆ లేఖకు కేంద్రం స్పందించకపోతే.. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటనే భయం అధికార పార్టీని వెంటాడుతోంది. ఇంతకీ ఆ పార్టీ నేతలు ఎందుకంతగా భయపడుతున్నారు?


పాత ప్రతిపాదనలకే ఆమోదం...

ఏదైనా తనదాకా వస్తే గానీ తెలియదని అంటారు. ప్రస్తుతం ఇదే స్థితిలో జగన్ సర్కారు ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు పేరుగాంచింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్‌ను మార్చడంతో.. ఈ కలల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఏపీ ప్రభుత్వానికి పిడుగులాంటి వార్తను అందించింది. 2013-2014 నాటి అంచనా వ్యయం 20వేల 398.61 కోట్లను ఆమోదిస్తున్నామని.. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం ముంపు గ్రామాల్లో భూసేకరణ, పునరావాసం కలిపి 55 వేల కోట్లకు ప్రతిపాదనలు పంపగా.. సాంకేతిక సలహామండలి 47 వేల కోట్ల రూపాయలకు కుదించి ఆమోదించింది. ఆర్థికశాఖ కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించింది. తాజాగా కేంద్రం 2013-2014 ప్రతిపాదనలు ఆమోదించడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కంగారెత్తుకుంది.


ఆరోపణలకు తగ్గట్లుగానే కేంద్రం కూడా..

నిజానికి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. డబ్బులు తినేందుకే అంచనా వ్యయం పెంచుతున్నారంటూ.. ఆయన పాదయాత్రలో ప్రతి బహిరంగసభలోనూ ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే 2013-2014 అంచనాలను ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ఈ విషయంలో కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వే పరిస్థితిలో వైసీపీ సర్కారు లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే తెలుగుదేశం, వామపక్షాలు పోలవరం విషయంగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడే పరిస్థితి లేదనీ, ఎందుకంటే కేసులు భయం వారిని వెంటాడుతోందనీ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. నేరుగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైనప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. 


జగన్ ప్రభుత్వంలో టెన్షన్..

పోలవరం ప్రాజెక్టు అంచనాలు, నిధుల విడుదలపై కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. భూసేకరణ, పునరావాసం చేయాల్సిఉందన్నారు. ఇందుకోసం పెరిగిన ధరల ప్రకారం 30 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని తేల్చారు. దీనిపై అనేక తర్జనభర్జనల అనంతరం.. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అలాగే కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖల మంత్రులకు విడివిడిగా లేఖలు రాయాలని నిర్ణయించారు. అయితే ఆ లేఖలకు కేంద్రం ఎలా స్పందిస్తుందోననే టెన్షన్. జగన్ ప్రభుత్వంలో నెలకొందట. ఒకవైపు కేంద్రాన్ని గట్టిగా అడగలేని పరిస్థితి.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆమోదిద్దామంటే 30 వేల కోట్లు ఎలా సర్దుబాటు చేసుకోవడం? అనే ప్రశ్న జగన్ సర్కారుని టెన్షన్ పెడుతోందట.


తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన..

వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ముందుకు సాగని పక్షంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది అధికార వైసీపీ నేతల ఆందోళనగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అనే అంశాన్ని తెరపైకి తేవడంతో.. ప్రస్తుతం రాజధాని అమరావతి పడకేసింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆ ఖాతాలో చేరితే తమ ప్రతిష్ట మరింత సన్నగిల్లుతుందని అధికార పార్టీ నేత ఒకరు ఆఫ్ ద రికార్డుగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అంచనా తగ్గించడం తమ సర్కారుకి ఇబ్బందికరమైన పరిణామమని ఆయన స్పష్టంచేశారు. మొత్తంమీద పోలవరం అంశం జగన్ ప్రభుత్వంలో తీవ్ర గందరగోళం సృష్టించిందనే చర్చ జరుగుతోంది.



Updated Date - 2020-10-28T18:33:52+05:30 IST