తేల్చాల్సినవి చాలా ఉన్నాయ్‌

ABN , First Publish Date - 2020-08-09T07:37:56+05:30 IST

అపెక్స్‌ కౌన్సిల్‌ అజెండాను తామే ఖరారు చేశామని, సాధ్యమైనంత వరకూ ఈ నెలలోనే సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్...

తేల్చాల్సినవి చాలా ఉన్నాయ్‌

  • అజెండా ఖరారు చేశాం.. ఈ నెల్లోనే కలుద్దాం
  • అపెక్స్‌ కౌన్సిల్‌, బోర్డుల అనుమతులు 
  • లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించొద్దు
  • ఇద్దరు సీఎంలకు కేంద్ర మంత్రి షెకావత్‌ లేఖ
  • రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ఆపేయాలి
  • అనుమతిచ్చే వరకూ పనులు అప్పగించొద్దు
  • పలు ప్రాజెక్టులకు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదు
  • నిర్మాణాలను ఆపాలన్నా పట్టించుకోవడం లేదు
  • వాటి డీపీఆర్‌లనూ బోర్డులకు సమర్పించలేదు
  • మేం అడిగినా అజెండా అంశాలను పంపలేదు
  • దేవాదుల - 3, సీతారామ, తుపాకులగూడెం, 
  • లోయర్‌ పెన్‌గంగ, రామప్ప- పాకాల లేక్‌ 
  • డైవర్షన్‌ పథకాలకు అనుమతుల్లేవ్‌
  • రెండు తెలుగు  రాష్ట్రాలనూ తప్పుపట్టిన కేంద్రం

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): అపెక్స్‌ కౌన్సిల్‌ అజెండాను తామే ఖరారు చేశామని, సాధ్యమైనంత వరకూ ఈ నెలలోనే సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. పెండింగ్‌ సమస్యలను సామరస్యంగా పరిష్కరిద్దామని ప్రతిపాదించారు. అపెక్స్‌ కౌన్సిల్‌, బోర్డుల అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మించవద్దని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన అనుమతులను తీసుకోవాలని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టు, అనుబంధ పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచిందని తన దృష్టికి వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో డీపీఆర్‌లు సమర్పించే వరకూ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి ఇచ్చే వరకూ టెండర్లు పిలవరాదని, పనులు అప్పగించరాదని తేల్చి చెప్పారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌ రెడ్డిలకు శనివారం రెండు పేజీల లేఖ రాశారు. రెండు ప్రభుత్వాల తీరును సుతిమెత్తగా తప్పుబడుతూనే.. రెండు రాష్ట్రాలూ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదని తేల్చి చెప్పారు. సంబంధిత డీపీఆర్‌లను రెండు రాష్ట్రాలూ తమకు సమర్పించలేదని పునరుద్ఘాటించారు.


పోతిరెడ్డిపాడుపై రాయలసీమ ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇక, తెలంగాణలోని పలు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దాంతో, కృష్ణా, గోదావరి బోర్డులు వేర్వేరుగా సమావేశమై రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించాయి. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని సూచించాయి. అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించవద్దని తెలిపాయి. దానిని ఇరు రాష్ట్రాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. దాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. ఇరువురు సీఎంలు కుమ్మక్కయ్యారని, ఏపీలో టెండర్లు పూర్తి కావడానికే సమావేశం వాయిదా కోరారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఇరువురు సీఎంలకు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


అజెండాపై మీరు స్పందించలేదు

‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశాన్ని ఆగస్టు 5న ప్రతిపాదించాం. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అయితే, ముందస్తుగానే నిర్ణయమైన కార్యక్రమాల కారణంగా ప్రతిపాదిత సమావేశానికి హాజరు కాలేమని మీరు చెప్పినట్లు మా శాఖాధికారులు నాకు తెలిపారు. ఈనెల 20 తర్వాత సమావేశాన్ని నిర్వహించాలని మీరు కోరినట్లు చెప్పారు. మీ వినతి మేరకు భేటీని వాయిదా వేస్తున్నాం. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే తెలియజేస్తాం’’ అని లేఖలో కేంద్ర మంత్రి షెకావత్‌ పేర్కొన్నారు. అదే సమయంలో, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు పనితీరును పర్యవేక్షించడం అపెక్స్‌ కౌన్సిల్‌ విధుల్లో ఒకటని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశమైందన్నారు. ‘‘ఇటీవలే రెండు రాష్ట్రాల సీనియర్‌ అధికారులతో కలిసి బోర్డుల పనితీరును కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి సమీక్షించారు. కొన్ని అపరిష్కృత అంశాలను గుర్తించారు. వాటి పరిష్కారమే ధ్యేయంగా అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశానికి అజెండా అంశాలు పంపించాలని గత సెప్టెంబరులో రెండు ప్రభుత్వాలను కోరాం. మేలో మా శాఖ మరోసారి కోరింది. అయినా, స్పందనలేదు. అందుకే, అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశానికి మా శాఖ 4 అజెండా అంశాలను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు బోర్డులు ఇచ్చిన సూచన మేరకు అజెండాను ఖరారు చేశాం’’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య సాగుతున్న ‘లేఖల యుద్ధాన్ని’ ప్రస్తావించారు.


కాళేశ్వరం, దేవాదుల మూడో దశ, సీతారామ, తుపాకులగూడెం, తెలంగాణ మంచినీటి సరఫరా పథకం, లోయర్‌ పెన్‌గంగపై బ్యారేజీ, రామప్ప నుంచి పాకాల వరకూ డైవర్షన్‌ స్కీంలను ఏపీ వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు. వాటికి అనుమతులను తీసుకోవాలని గోదావరి బోర్డు స్పష్టం చేసిందన్నారు. సంబంధిత డీపీఆర్‌లను సమర్పించాలని బోర్డు కోరినా, ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ తరలింపునకూ అనుమతులు తీసుకోవాలని బోర్డు ఇప్పటికే సూచించిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌, బోర్డు అనుమతులు వచ్చే వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని, టెండర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఇప్పటికే బోర్డు స్పష్టం చేసిందని తెలిపారు. రాయలసీమ లిప్టును ఆపాలంటూ మే 20న కృష్ణా బోర్డు ఏపీకి లేఖ రాసిందని కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. 

Updated Date - 2020-08-09T07:37:56+05:30 IST