మీడియా ప్రీమియర్ లీగ్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆంధ్రజ్యోతి విజయం

ABN , First Publish Date - 2021-03-06T23:09:40+05:30 IST

వార్తా సంస్థల మధ్య జరుగుతున్న మీడియా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆంధ్రజ్యోతి ఘన విజయం సాధించింది. దిశ వార్తా సంస్థతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రజ్యోతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో..

మీడియా ప్రీమియర్ లీగ్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆంధ్రజ్యోతి విజయం

హైదరాబాద్: వార్తా సంస్థల మధ్య జరుగుతున్న మీడియా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆంధ్రజ్యోతి ఘన విజయం సాధించింది. దిశ వార్తా సంస్థతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రజ్యోతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆంధ్రజ్యోతి తరపున రమేశ్(52: 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థసెంచరీతో మెరిశాడు. చివర్లో వెంకట్ దినేశ్(43: 32 బంతుల్లో 6 ఫోర్లు) నాటౌట్‌గా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. దిశ జట్టు బౌలర్లలో కే మహేశ్, మధు, శ్రీకాంత్, వెంకటేశ్, స్వామిలకు తలో వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దిశ జట్టు దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అనే తేడా లేకుండా అంతా తక్కువ స్కోర్లకే పెవివిలియన్ చేరారు. దీంతో 12.1 ఓవర్లలో కేవలం 71 పరుగులకే ఆలౌటైంది. 


దిశ జట్టు తరపున సతీశ్(19: 8 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆంధ్రజ్యోతి బౌలర్లలో వెంకట్ దినేశ్ 5 వికెట్లతో అదరగొట్టగా.. రాజు 3 వికెట్లతో రాణించాడు. రమేశ్, హనుమంత ప్రసాద్‌లకు చెరో వికెట్ దక్కింది. అటు బ్యాటింగ్‌లో అర్థ సెంచరీ చేయడంతో పాటు ఇటు బౌలింగ్‌లోనూ 5 వికెట్లతో అదరగొట్టిన వెంటర్ దినేశ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 


ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ విజయంతో ఆంధ్రజ్యోతి జట్టు టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మార్చి 8వ తేదీన దుండిగల్‌లో జరగబోయే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీవీ9 జట్టుతో ఆంధ్రజ్యోతి జట్టు తలపడనుంది. కాగా.. తొలి సెమీఫైనల్‌లో నమస్తే తెలంగాణ, 10టీవీ జట్లు తలపడనున్నాయి.

Updated Date - 2021-03-06T23:09:40+05:30 IST