హైదరాబాద్‌ నుంచి మరో కరోనా వ్యాక్సిన్‌!

ABN , First Publish Date - 2021-03-27T08:03:22+05:30 IST

కరోనా వ్యాక్సిన్ల తయారీలో కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్‌ నుంచి మరో టీకా త్వరలో అందుబాటులోకి రానుంది.

హైదరాబాద్‌ నుంచి మరో కరోనా వ్యాక్సిన్‌!

  • నోరు, ముక్కు ద్వారా అందించే ‘నియోకోవ్‌’.. ఒకే డోసుతో వైరస్‌కు చెక్‌
  • ధర కేవలం రూ.140.. వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తికి ప్రణాళికలు
  • 2023 నాటికి 600 కోట్ల డోసులు.. ట్రాన్స్‌జెన్‌ బయోటెక్‌తో ఒప్పందం 
  • నియోడెల్‌ ఫార్మా సారథి డాక్టర్‌ కె. కోటేశ్వరరావు

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాక్సిన్ల తయారీలో కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్‌ నుంచి మరో టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. నోరు, ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందించే వీలున్న ఆ టీకా పేరు ‘నియోకోవ్‌’. దీన్ని ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన నియోడెల్‌ ఫార్మా కంపెనీ, అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఎమోరి విశ్వవిద్యాలయం నుంచి పేటెంట్స్‌ పొందింది. మశూచీ టీకాల తయారీకి ఉపయోగిస్తున్న మాడిఫైడ్‌ వ్యాక్సినా అంకారా సాంకేతిక పరిజ్ఞానంతో నియోకోవ్‌ తయారుకానుంది. మిగిలిన టీకాలకు భిన్నంగా ఇది వైర్‌సను ఎక్కువకాలం పాటు సమర్ధంగా అడ్డుకుంటుందని నియోడెల్‌ కంపెనీ సారథి డాక్టర్‌ కె. కోటేశ్వరరావు తెలిపారు. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లను దారికి తెచ్చేందుకు వీలుగా హెల్పర్‌ సెల్స్‌గా పిలిచే ‘సీడీ 4’, కిల్లర్‌ సెల్స్‌గా పిలిచే ‘సీడీ 8’ రక్షకాలు నియోకోవ్‌ టీకాకే ప్రత్యేకమని పేర్కొన్నారు. వైరస్‌ ఏ రూపంలో దాడి చేసినా ఈ కిల్లర్‌ టీ సెల్స్‌ అడ్డుకుంటాయని, వైరస్‌ మరోసారి దాడి చేయకుండా కూడా రక్షణ కల్పిస్తాయన్నారు. 


ఈ వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడు 7 నుంచి 10 రెట్లు అధికంగా ప్రతిరక్షకాలు విడుదలవుతున్నట్లు జంతువులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో నిర్ధారణ అయిందని తెలిపారు. అమెరికా-భారత్‌ ఉమ్మడి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా, డాక్టర్‌ కె. కోటేశ్వరరావు ఏలూరు సమీపంలోని దెందులూరు వాస్తవ్యులు. బ్రిటన్‌లో విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ఆ దేశ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన ఆయన, జన్యుమార్పిడి చేసిన హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈయనతో ఎమోరి విశ్వవిద్యాలయంలోని మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ అమర రామారావు జత కలిశారు. డాక్టర్‌ రామారావు ఎయిడ్స్‌, ఎబోలా, సార్స్‌ వ్యాధులపై రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో నిర్వహించిన పరిశోధనల నుంచి నియోకోవ్‌ టీకా రూపుదిద్దుకుంది. 


నూరుశాతం మనదేశ ప్రజలకే 

2022 మే నాటికి మా వ్యాక్సిన్‌ వస్తుంది. ఆ ఏడాది 5.6  కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2023 నాటికి 600 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. ఈ మేరకు ట్రాన్స్‌జెన్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. మా వాక్సిన్‌ ముక్కు ద్వారా అయితే ఒక చుక్క, నోటి ద్వారా అయితే రెండు మూడు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. మేం ఉత్పత్తి చేసిన టీకాలన్నింటినీ నూరుశాతం మన దేశ ప్రజల అవసరాలకే అందిస్తాం. దీని ధర 140 రూపాయలే. 

 డాక్టర్‌ కె. కోటేశ్వరరావు, నియోడెల్‌ ఫార్మా  , స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2021-03-27T08:03:22+05:30 IST