మరో నలుగురికి

ABN , First Publish Date - 2020-03-27T09:37:06+05:30 IST

రాష్ట్రంలో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు వైద్యులు ఉన్నారు. వారు భార్యాభర్తలు. దోమలగూడకు చెందిన వారు ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లలేదు.

మరో నలుగురికి

వైద్య దంపతులకు సోకిన కరోనా

వారికి ఎలా సోకిందోనని ఆరా

విదేశాలకు వెళ్లొచ్చినవారు కాదు

కుత్బుల్లాపూర్‌, బౌద్ధనగర్‌కు  చెందిన వ్యక్తులకు కూడా..

రాష్ట్రంలో 45కు చేరిన కేసుల సంఖ్య


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు వైద్యులు ఉన్నారు. వారు భార్యాభర్తలు. దోమలగూడకు చెందిన వారు ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లలేదు. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకింది. వీరిద్దరితో పాటు వైద్యుడికి కరోనా ఎలా సోకిందన్న దానిపై స్పష్టత లేదు.


వైద్య దంపతుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలింది. వారిలో భర్త (41) ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి హెడ్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తిరుపతి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఆయన భార్య (36) కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు భర్త నుంచి వైరస్‌ సోకినట్లు గుర్తించినా, భర్తకు ఎవరి వల్ల వైరస్‌ సోకిందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై ఆరా తీస్తున్నారు. ఆయన ఇంటి వద్ద, ఆస్పత్రిలో ఎవరెవరిని కలిశారన్న సమాచారం సేకరిస్తున్నారు. ఆయన కేవలం ఆస్పత్రి యూనిట్‌ వ్యవహారాలు మాత్రమే పర్యవేక్షించేవారని, రోగులకు వైద్యం అందించలేదని సమాచారం.


కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తికి తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో ఆస్పత్రికి తరలించి, ల్యాబ్‌ పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగింది. ఇతనితో పాటు బౌద్ధనగర్‌ వాసికి కూడా ఫారిన్‌ ట్రావెల్‌  హిస్టరీ లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగింటితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 45కు చేరుకుంది. ఈ నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. వైద్య దంపతులను కలిసిన వారందర్నీ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. కాగా, 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ హెల్ప్‌ లైన్‌ నుంచి 18,868 కాల్స్‌ చేయగా, హెల్ప్‌ లైన్‌కు 16,063 కాల్స్‌ వచ్చాయి.


ఆ ముగ్గురికి కరోనా ఎలా వచ్చింది?

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో.. ఇప్పటి వరకు రెండే కేటగిరీలను గుర్తించారు. మొదటిది విదేశాల నుంచి వచ్చిన వారికి ఆ వ్యాధి సోకగా.. రెండోది వారి నుంచి కుటుంబ సభ్యులు, ఇతరులకు సోకడం. సాధారణంగా మూలం తెలియకుండా వచ్చే కేసులను మూడో దశగా వ్యవహరిస్తారు. గురువారం నమోదైన నాలుగు కేసుల్లో మూడింటి విషయంలో మాత్రం.. ఎవరి ద్వారా కరోనా వ్యాపించిందో చెప్పలేని పరిస్థితి.  


కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవ్వగా.. అతడిని 42వ పేషెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అతడి ఈ నెల 14న సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రె్‌సలో ఢిల్లీ వెళ్లారు. 18న తెలంగాణ ఎక్స్‌ప్రె్‌సలో తిరిగి వచ్చారు. ఆయన సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరగానే.. అతడికి జ్వరం, జలుబు వచ్చాయి. డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడినా.. తగ్గకపోవడంతో బుధవారం గాంధీలో పరీక్షలు చేయించుకున్నారు. గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.


దోమలగూడకు చెందిన 41 ఏళ్ల డాక్టర్‌ (పేషెంట్‌ నంబరు 44) పరిస్థితి కూడా ఇంతే. ఆయన కరోనా రోగులకు ఎలాంటి చికిత్స అందించలేదు. ఆయనకు ఎవరిద్వారా కరోనా సోకిందే నిర్ధారణ కాలేదు. ఈ నెల 17న ఆయన విమానంలో తిరుపతి వెళ్లారు. అక్కడ స్విమ్స్‌లో కొందరు వైద్యులను కలిసి.. సాయంత్రానికి హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఈ నెల 20న సోమాజిగూడలోని ఓ ఆస్పత్రికి వెళ్లి, గంటపాటు తనకు పరిచయమున్న వైద్యులతో మాట్లాడారు. ఈ నెల 21న కరోనా లక్షణాలు కనిపించడంతో.. సొంతంగా మందులు వేసుకున్నారు. 24న తన భార్య, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ డాక్టర్‌కు, ఆయన భార్య (పేషెంట్‌ నంబరు 43)కు కరోనా పాజిటివ్‌ తేలగా.. తండ్రికి నెగటివ్‌ వచ్చింది. ఆయన తల్లి, ఇద్దరు పిల్లల ఫలితాలు రావాల్సి ఉంది.


సికింద్రాబాద్‌ బుద్ధానగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి (పేషెంట్‌ నంబరు 45) పరిస్థితీ అంతే. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? అనే వివరాలను ఇంకా సేకరించాల్సి ఉంది.


విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పరీక్షలు

విదేశాలకు వెళ్లొచ్చిన వారాసిగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరిపై స్ధానికులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దర్నీ గురువారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ ఇద్దరిలో ఒకరు మహిళ. ఆమె ఆస్ట్రేలియాలో ఉంటున్న భర్త వద్దకు వెళ్లి 20 రోజుల క్రితం వచ్చారు. మరో వ్యక్తి స్టాఫ్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయన పది రోజుల క్రితం లండన్‌ నుంచి తిరిగొచ్చారు. ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిపోవచ్చని, బయటకు రావద్దని వైద్యులు సూచించారు. ఇంటికెళితే ఇబ్బందులు వస్తున్నాయని, కొన్ని రోజులు గాంధీ ఆసుపత్రిలోనే ఉంటానని ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వైద్యులను కోరాడు. రంగారెడ్డి జిల్లా మల్కాపహాడ్‌ తండాకు చెందిన ఓ యువకుడికి కరోనా సోకిందన్న అనుమానంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.


165 మందికి హోం క్వారంటైన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా కుమ్రం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 165 మందికి హోం క్వారంటైన్‌ విధించారు. వీరిలో గురువారం హైదరాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌కు చేరుకున్న విద్యార్థులు 65 మంది ఉన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన మరో 80 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

Updated Date - 2020-03-27T09:37:06+05:30 IST