Abn logo
Oct 1 2020 @ 00:20AM

మరో అహింసా పోరాటం అవసరం

Kaakateeya

బ్రిటిష్ కాలం నాటి చట్టం కింద దేశద్రోహం నేరం మోపి గత ఏడాది అనేకమంది ప్రముఖ మేధావులను జైళ్లలోకి నెట్టారు. భారత పౌరుల మానవ హక్కులను, ప్రత్యేకించి మైనారిటీల హక్కులను కాలరాసే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు. ఉచిత నిర్బంధ విద్యకు బదులు అన్ని స్థాయిల్లో విద్యను ప్రైవేట్‌పరం చేశారు. ఇటీవల ప్రకటించిన కొత్త విద్యావిధానంలో విద్యాహక్కు గురించి ప్రస్తావనే లేదు. బాలకార్మిక నిషేధ చట్టం అమల్లో ఉన్నా, ఈనాటికీ కోటిమందికి పైగా బాలకార్మికులు పని చేస్తున్నారు. విశ్వవాప్తంగా పోషకాహారలోపం ఉన్న బాలల్లో మూడోవంతు, అనగా దాదాపు ఐదు కోట్ల మంది మనదేశంలోనే ఉన్నారు. ప్రపంచంలో మూడో వంతు బాల్యవివాహాలు మన దేశంలోనే జరుగుతున్నాయనేది మరో కఠిన వాస్తవం.


ఇరాన్‌కి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత షిరిన్ ఎబాది 2004 జనవరిలో ముంబయిలో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరంలో పాల్గొన్నప్పుడు అంతర్జాతీయ అహింసాదినోత్సవాన్ని జరపాలని మొదటిసారిగా ప్రతిపాదించారు. మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ 2007 జనవరిలో ఢిల్లీలో సత్యాగ్రహంపై నిర్వహించిన సదస్సులో ఒక తీర్మానం చేస్తూ, గాంధీజీ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా పాటించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. అదే సంవత్సరం జూన్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశం అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసాదినంగా ఆమోదించింది.

విఖ్యాత రచయిత లియో టాల్‌స్టాయ్ భారతదేశ స్వాతంత్ర్యానికి మద్దతునిస్తూ తారక్‌నాథ్‌దాస్‌కు 1908లో రాసిన ఉత్తరంలో ప్రస్తావించిన అహింసాయుత పోరాట మార్గం గాంధీజీపై గొప్ప ప్రభావం చూపించింది. ఆయన ఆ సూచనను ఆచరణలో పెట్టి స్వాతంత్రోద్యమాన్ని నడిపించి విజయం సాధించాడు. అయితే గాంధీజీ ఏ లక్ష్యాలతో ఆ ఉద్యమాన్ని నడిపారో అవి ఇంకా నెరవేరలేదని మన దేశ పురోగతిని పరిశీలించిన వారందరికీ అర్థమవుతుంది. ఆ లక్ష్యాలు ఏమిటి, అవి నెరవేరడానికి మనం ఏ మార్గంలో పయనించాలి అనే ప్రశ్నలను అందరం వేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

నెహ్రూ అధ్యక్షతన లాహోర్‌లో 1929 డిసెంబర్‌లో జరిగిన కాంగ్రెస్ సదస్సు సంపూర్ణ స్వరాజ్య నినాదాన్ని ఇచ్చింది. ‘‘విముక్తి కోసం జరిగే ఏ ఉద్యమమైనా తప్పనిసరిగా ప్రజా ఉద్యమమై ఉండాలని, ఆ ఉద్యమాలు ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప శాంతియుతంగా జరగాల’’ని నెహ్రూ తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. ఆ సదస్సులోనే మువ్వన్నెల జెండాను ఎగురవేసి ప్రతి సంవత్సరం జనవరి 26న జెండా పండుగ జరపాలని, స్వాతంత్ర్య ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. ‘ఏ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాసి, వారిని అణచివేతకు గురిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మార్చే హక్కు ప్రజలకు ఉంటుంద’ని ఆ ప్రతిజ్ఞలో స్పష్టం చేశారు. ఆ తరువాత 1931లో జరిగిన కరాచీ కాంగ్రెస్ సదస్సు ఎంతో కీలకమైంది. ఆ సదస్సులో జాతీయ ఆర్థిక కార్యక్రమం, ప్రజల ప్రాథమిక హక్కులపై తీర్మానాలు ఆమోదించారు. స్వరాజ్యం అంటే కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కాదని ఆకలితో అలమటించే కోట్లాది ప్రజల ఆర్ధిక స్వాతంత్ర్యం అని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రకటించింది. ఆనాటి తీర్మానంలోని కొన్ని ముఖ్యాంశాలు నేటికీ ఎంతో విలువైనవి. తదనంతరకాలంలో మన రాజ్యాంగంలో పొందుపరచిన అనేక అంశాలకు మూలాధారం ఆ తీర్మానంలోని అంశాలే. 

వాక్ స్వాతంత్ర్యం, పత్రికా సమావేశ స్వేచ్ఛలతో పాటు కుల, మత, లింగ భేదాల కతీతంగా చట్టం ముందు ప్రతి ఒక్కరికీ సమానత్వం, అన్ని మతాల పట్ల రాజ్యం తటస్థత, సార్వజనీన వయోజన ఓటు హక్కు, ఉచిత నిర్బంధ విద్య, గిట్టుబాటు కాని భూకమతాలకు పన్ను మినహాయింపు, రైతులకు వ్యవసాయ రుణాల వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి, కార్మికులకు పని గంటల తగ్గింపు, ఆరోగ్యకరమైన పని వాతావరణం కల్పించడం ఆ తీర్మానంలోని కొన్ని అంశాలు. ముసలితనంతోనూ, అనారోగ్యంతోనూ, నిరుద్యోగంతోనూ ఉన్న వారికి ఆర్థిక భారం నుంచి రక్షణ, వెట్టిచాకిరీ నుంచి విముక్తి, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులతో పాటు పూర్తి రక్షణ, బాలకార్మికుల నియామకంపై నిషేధం, కార్మికులు యూనియన్‌లు పెట్టుకొనే హక్కు, ఒక పరిమితికి మించి ఉన్న వ్యవసాయ ఆదాయంపై క్రమానుగత పన్ను, వారసత్వ ఆస్తులపై పన్ను, మిలటరీ వ్యయాన్ని సగానికి తగ్గించడం, కీలకమైన పరిశ్రమలు, ఖనిజ వనరులపై ప్రభుత్వాధిపత్యం గురించి కూడ ఆ తీర్మానాలు స్పష్టంగా పేర్కొన్నాయి. వీటితో పాటు మత్తెక్కించే పానీయాలు, డ్రగ్స్‌పై నిషేధాన్ని కూడా వాటిలో చేర్చారు. ఈ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరినప్పుడే మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు సరైన విలువ ఉంటుంది. కరాచీ తీర్మానం ఆమోదించి 90 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ వాటిని ఏ మేరకు సాధించుకోగలిగామో సింహావలోకనం చేసుకోవలసి ఉంది.

పౌరహక్కులు, వాక్ స్వాతంత్ర్యం, పత్రికాస్వేచ్ఛ ఏ రీతిలో ఉన్నాయో ఇటీవలి సంఘటనలు తెలియజేస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ 124–ఏ సెక్షన్ కింద దేశద్రోహం నేరం మోపి గత ఏడాది అనేకమంది ప్రముఖ మేధావులను జైళ్లలోకి నెట్టారు. అంతకు ముందు 2018లో యుఏపిఎ చట్టం కింద ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. వీళ్లందరూ తమ జీవిత కాలమంతా ప్రజల కోసం పాటుపడినవారే. అలాగే ఢిల్లీ మత ఘర్షణల సందర్భంగా సామరస్యం కోసం కృషి చేసిన లౌకికవాద నేతలపై కూడా అనేక రకాల కేసులు పెట్టారు. ఇక పత్రికా స్వేచ్ఛ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా పత్రికలు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అనుకూలంగా మారలేదు. పత్రికాధిపతులు ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరించి మనగలిగే పరిస్థితులు లేవు.

అంతకంటే దారుణమైన విషయం, కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం. అది బాహాటంగా భారత పౌరుల మానవ హక్కులను, ప్రత్యేకించి మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా ఉంది. ఇక మతాల పట్ల తటస్థత అనే వైఖరికి ఇటీవలి ప్రభుత్వాలు తిలోదకాలిచ్చాయి. మతవేడుకలను ప్రభుత్వ కార్యక్రమాలుగానే నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉన్నప్పటికీ ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బు తదితర ప్రలోభాల ద్వారా ఆ హక్కుని హరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఉచిత నిర్బంధ విద్యకు బదులు అన్ని స్థాయిల్లో విద్యను ప్రైవేట్ పరం చేయడంతో చదువును కొనుక్కునే స్తోమత లేని కోట్లాది మంది బడుగుజీవుల పిల్లలు విద్యాలయాలకు దూరమవుతున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన కొత్త విద్యావిధానం విద్యాహక్కు గురించి ప్రస్తావించకపోవడం ఆ ధోరణిని బలపరిచేదిగా ఉంది. ఇక అన్నదాతలైన రైతుల దుస్థితి చెప్పనలవి కాదు. ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్లు బడా కార్పొరేట్ల చేతుల్లో చిక్కుకునేలా ఉన్నాయి.

ఆ బిల్లులతో పాటు పార్లమెంటులో ఆమోదించిన కార్మిక కోడ్ బిల్లులు రోజువారి పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం, యాజమాన్యాలకు ఇష్టం వచ్చిన విధంగా కార్మికులను తొలగించే స్వేచ్ఛను కల్పించడం ఎంత తిరోగమన చర్యలో గమనించాలి. అసంఘటితరంగంలో పని చేసే కోట్లాదిమంది కార్మికులకు ఏ రక్షణా లేదు. ఇక వృద్ధాప్యంలో ఉన్న వారిని, వికలాంగులను పట్టించుకునే నాథులే లేరు. నేటి కొవిడ్ సందర్భంలో అనారోగ్య పీడితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కునారిల్లుతున్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుత దుస్థితికి అద్దం పట్టే విధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఉపాధి లేని కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు దేశ నలుమూలలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొవిడ్ నేపథ్యంలో వాళ్లందరూ ఖాళీ కడుపులతో కాలినడకన తమ స్వస్థలాలకు ప్రయాణాలు సాగించడం స్వతంత్ర భారతావనిలో కనీవినీ ఎరుగని విషాద ఘట్టం.

బాలకార్మిక నిషేధ చట్టం అమల్లో ఉన్నా, ఈనాటికీ కోటిమందికి పైగా బాలకార్మికులు పని చేస్తుండటం దేశానికే సిగ్గుచేటు. ప్రపంచంలో పోషకాహారలోపం ఉన్న బాలల్లో మూడోవంతు, అనగా దాదాపు ఐదు కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారనే నగ్నసత్యాన్ని తెలుసుకుంటే పాలకులు విదేశాలలో ఉపన్యాసాలిస్తూ ఎలా తలెత్తుకు తిరుగగలుగుతున్నారనే భావన కలుగకమానదు. అంతేకాదు ప్రపంచంలో మూడో వంతు బాల్యవివాహాలు మన దేశంలోనే జరుగుతున్నాయనేది మరో కఠిన వాస్తవం.

ఇక మహిళల పరిస్థితిని పరిశీలిస్తే, ప్రపంచ లింగసూచికలో భారతదేశం 112వ స్థానంలో ఉంది. మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. ప్రతి రోజూ సగటున ఎనిమిది మంది ఎస్సీ మహిళలపైన, ముగ్గురు ఎస్టీ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి గంటకు 600 మందికి పైగా మహిళలు అక్రమ రవాణా అవుతున్నారు. బాలింత మరణాల్లోనూ మనదేశం ముందు స్థానంలోనే ఉంది. నేటికీ సాంఘిక దురాచారాలకు, గృహహింసకు గురవుతున్న మహిళల సంఖ్య గణనీయంగానే ఉంది. మరోవైపు మద్యనిషేధం మాట అటుంచి మద్యం అమ్మకాలపై రాష్ట్రప్రభుత్వాల ఆదాయాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

స్వాతంత్రానంతరం ప్రభుత్వం మిలటరీపైన పోలీసులపైన పెట్టే ఖర్చు ప్రజల సంక్షేమంపై పెట్టే ఖర్చు కంటే ఎంతో ఎక్కువగా ఉంది. ఇక కీలక రంగాల్లో పరిశ్రమలు, ముఖ్యమైన గనులు క్రమేణా ప్రైవేటుపరమవుతున్నాయి. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ అన్నింటి కంటే కొట్టొచ్చినట్లు కనపడేది రోజురోజుకీ పెరుగుతున్న ఆదాయ అంతరాలు. ఈ అంతరాల అగాధం మన దేశంలోనే ఎక్కువగా ఉందని మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది.

ఇదేనా మన స్వాతంత్ర సమరయోధులు కోరుకున్న స్వర్ణ భారతం? ఇదేనా గాంధీజీ కలలు కన్న రామరాజ్యం? ఈ దుస్థితి నుంచి బయటపడేయడానికి ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మనమే రెండో స్వాతంత్ర్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. గాంధీజీ చూపిన, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా అనుసరించిన అహింసాపథంలో ప్రగతిశీలశక్తులు స్వాతంత్రోద్యమ లక్ష్యాల సాధనకు ప్రజా సమీకరణ చేయాల్సి ఉంది. అదే గాంధీజీకి మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి.

డా. పి. నారాయణరావు

సామాజిక విశ్లేషకులుAdvertisement
Advertisement
Advertisement