నిర్బంధ వ్యతిరేక ధర్నా

ABN , First Publish Date - 2020-02-25T07:52:07+05:30 IST

రాజ్య అధికారం చట్టానికి కట్టుబడి ఉండాలి. నాగరిక పరిపాలన అంటే రాజ్యం, చట్టాలని గౌరవించాలి. ప్రభుత్వాలు తప్పుడు విధానాలు అమలు పరిచినప్పుడు దానిని ప్రతిఘటించే హక్కు ప్రజలకుంటుంది.

నిర్బంధ వ్యతిరేక ధర్నా

రాజ్య అధికారం చట్టానికి కట్టుబడి ఉండాలి. నాగరిక పరిపాలన అంటే రాజ్యం, చట్టాలని గౌరవించాలి. ప్రభుత్వాలు తప్పుడు విధానాలు అమలు పరిచినప్పుడు దానిని ప్రతిఘటించే హక్కు ప్రజలకుంటుంది. చట్టబద్ధ పాలన అంటే చట్ట నిరంకుశత్వం కాదు, ఉన్నత ప్రమాణాల ప్రకారం పాలన చేయడం. రాజ్యాంగ విలువలు ప్రజలు చేసిన పోరాటాల నుంచి వికసించిన ఉదాత్త విలువలు. స్వాతంత్ర్యానంతరం దేశంలో స్వేచ్ఛ పరిధి నిరంతరం పెరిగే బదులు అణచివేత చట్టాలను ఒకదాని తరువాత ఒక దానిని ప్రజల మీద రుద్దుతున్నారు. వలస పాలన కాలంలోని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌, సెడిషన్‌ లాంటి చట్టాలను రద్దు చేసే బదులు, వాటిని కొనసాగిస్తూ 1950లో సైన్యానికి ప్రత్యేక అధికారాలనిస్తూ ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌’ తెచ్చారు. 


ఇదే విధంగా ప్రతి రాష్ట్రంలో ప్రజా పోరాటాలను అణచడానికి చట్టాలను రూపొందించారు. ఈ చట్టాల్లో అతి క్రూరమైనది ‘ఉపా’ చట్టం. ఇది చాలా నిరంకుశమైన చట్టం. ఎవరినైనా ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఈ చట్టం కింది ఆరు నెలలు జైల్లో నిర్బంధించవచ్చు. బెయిల్‌కు కూడా అవకాశం తక్కువ. ఇది పోలీసుల చేతిలో ఒక తిరుగులేని ఆయుధంగా మారింది. గతంలో టాడా, పోటాకు వ్యతిరేకంగా తీవ్ర ప్రతిఘటన రావడంతో ఈ చట్టాలు రద్దయ్యాయి. ఈ రెండు చట్టాలలో ఉండే దుర్మార్గ అంశాలను ఉపా చట్టంలో చేర్చారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడటం ఇప్పుడు ప్రజల బాధ్యత.


భారతీయ జనతా పార్టీ భావజాలంలోనే అణచివేత ఒక అంతర్భాగం. జాతీయత, దేశభక్తి పేర ఎంత నిర్బంధం విధించినా దానికి సమ్మతమే. ఆరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక వైపు రాజ్యం, పోలీసులు మరో వైపు జ్యాంగేతర శక్తులు ప్రజల స్వేచ్ఛపై దాడులు చేస్తూ భయాన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ల రాజకీయాలతో విభేదించే వారిపై దేశద్రోహ నేరం కేసులు పెడుతున్నారు. దానికి తోడు అర్బన్‌ నక్సల్‌ అనే ఒక వినూత్న పదాన్ని సృష్టించి తమ విధానాలను తప్పుపట్టే ఎవరిమీదనైనా కేసులు పెట్టి జైళ్లల్లో తోస్తున్నారు. చివరకు ప్రియాంక గాంధీని కూడా అర్బన్‌ నక్సల్‌ అనేదాకా వెళుతున్నారు. దేశంలో పదిమంది ప్రజాస్వామ్య వాదులను ప్రధానమంత్రి హత్యకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టు చేసి ఏడాది కాలంగా జైల్లో పెట్టారు. ప్రజల తరఫున మాట్లాడే గొంతుకలు వీరు. వీళ్లు, వీళ్లలాగే ప్రజల పక్షాన నిలబడే వారు సమాజానికి గొప్ప నైతిక వనరులు. ఈ నైతిక వనరులను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. 


ప్రజాపోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుకలు చాలా ఉన్నాయి. ప్రజాసంఘాలు పుట్టాయి. ఉద్యమ ఫలితంగా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ, ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమాలు కొనసాగించవలసే ఉంది. ఈ ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షను కాపాడుతున్న వారి మీద రాజ్యం నిర్బంధాన్ని పెంచుతున్నది. దేశంలో ఏ ప్రాంతంలో కూడా దాదాపు 50 మంది ప్రజాస్వామిక వాదుల మీద, ప్రజాసంఘాల బాధ్యుల మీద ఉపా చట్టాన్ని ప్రయోగించడం జరగలేదు. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొడుతూ ప్రవేశించిన ఇది అరుణోదయ విమలక్క కార్యాలయంలోకి ప్రవేశించింది. ఆచార్య చింతకింది కాశీం ఇంట్లోకి ప్రవేశించింది. గత ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలను బాసటగా నిలిచిన వి.వి. మీద పడింది. ప్రజాస్వామ్య సంస్థలైన కొన్ని ప్రజాసంఘాల బాధ్యులమీద కూడా ఉపా చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ నిర్బంధాలను ప్రతిఘటించాలి. ఈ సామాజిక అవసరం మేరకు ‘నిర్బంధ వ్యతిరేక వేదిక’ ఏర్పడింది. నేడు ఈ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా జరుగుతుంది.


నిర్బంధ వ్యతిరేక వేదిక

Updated Date - 2020-02-25T07:52:07+05:30 IST