లక్కీ డ్రా స్కీంలపై చర్యలేవీ?

ABN , First Publish Date - 2021-07-29T06:55:20+05:30 IST

జిల్లాలో లక్కీ డ్రా స్కీంల నిర్వహణపై నిఘా కరువైంది... అధికారుల పట్టింపూ లేకుండా పోయింది. ప్రజాప్రతినిధుల అండదండలతో యథేచ్ఛగా స్కీంల నిర్వహణ కొనసాగు తోంది. నిర్వాహకులు నెలనెలా సభ్యుల నుంచి స్కీంల పేరిట డబ్బులను

లక్కీ డ్రా స్కీంలపై చర్యలేవీ?
డ్రా తీస్తున్నలక్కీ డ్రా స్కీం నిర్వాహకులు(ఫైల్‌)

- జిల్లాలో యథేచ్ఛగా లక్కీ డ్రా స్కీంల నిర్వహణ

- టీవీలు, ఫ్రిజ్‌లు వస్తాయంటూ బురిడి

- నెలనెలా వసూళ్ల పర్వం

- రూ.వెయ్యి నుంచి రూ.1500 చొప్పున వంద మంది సభ్యులు

- పది, పదకొండు నెలలు కాగానే ఉడాయిస్తున్న వైనం 

- నిన్న జిల్లాకేంద్రంలో.. మొన్న ఆర్మూర్‌లో బోర్డు తిప్పేసిన నిర్వాహకులు

- అధికార, ప్రతిపక్ష పార్టీల అండదండలు

- ‘మామూళ్లు’గానే తీసుకుంటున్న స్థానిక అధికారులు

- లబోదిబోమంటున్న బాధితులు

- మండలాల పరిధిలో దృష్టి సారించిన పోలీసు శాఖ

- ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే న్యాయం జరిగే అవకాశం

నిజామాబాద్‌, జూలైౖ 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో లక్కీ డ్రా స్కీంల నిర్వహణపై నిఘా కరువైంది... అధికారుల పట్టింపూ లేకుండా పోయింది. ప్రజాప్రతినిధుల అండదండలతో యథేచ్ఛగా స్కీంల నిర్వహణ కొనసాగు తోంది. నిర్వాహకులు నెలనెలా సభ్యుల నుంచి స్కీంల పేరిట డబ్బులను వసూ లు చేస్తున్నారు. భారీ మొత్తం వసూలు కాగానే కార్యాలయాలు ఎత్తివేయడం పరిపాటిగా మారింది. స్కీంల పేరున వస్తువులు వస్తాయనే ఆశతో డబ్బులు కట్టినవారు చివరకు నష్టపోయి లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో భారీ మొత్తంలో ఈ స్కీంలను ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నా.. పట్టించుకోకపోవడం వల్లనే ఎక్కువ మంది సభ్యులు మోసపోతున్నారు. గుర్తింపులేని ఈ సంస్థలపైన ఆదిలోనే చర్యలు చేపడితే వేలాది మందికి నష్టం జరిగే పరిస్థితి ఉండేది కాదంటున్నారు. 

ఫ గత కొన్నేళ్లుగా స్కీంల నిర్వహణ

జిల్లాలో గత కొన్నేళ్లుగా భారీ మొత్తంలో స్కీంల పేరిట లక్కీ డ్రాలను నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌, నవీపేట, నందిపేట, బోధన్‌, ఆర్మూర్‌, ఇందల్‌వా యి, డిచ్‌పల్లి, మోర్తాడ్‌, ఆయా మండలాల్లో అనధికారికంగా ఈ స్కీంలను నడిపిస్తున్నారు. నలుగురు నుంచి పది మంది వరకు సభ్యులుగా సంస్థలను ఏర్పా టు చేసి నెలనెలా వందల మంది నుంచి గొలుసుకట్టుగా డబ్బులను వసూలు చేస్తున్నారు. స్కీంల పేరుమీద 10నుంచి 15 నెలల వరకు నడిపిస్తున్నారు. ప్రతీ నెల ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నా రు. డ్రాలో నెంబరు వచ్చిన వారికి కార్లు, మోటార్‌ సైకిళ్ల పేరుమీద ప్రచారం నిర్వహిస్తూ సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఆ తర్వాత నెలనెలా ఫంక్షన్‌ హాళ్లు, తమకు సంబంధించిన కార్యాలయాల్లో ఈ డ్రాలను నిర్వహిస్తున్నారు. అయితే,  పది, పదకొండు నెలలుకాగానే తీరా సంస్థలను ఎత్తివేస్తున్నారు. కొంతమందికి చివరన టీవీలు, ఫ్రిడ్జ్‌లను అందజేస్తున్నారు. పది నుంచి 15నెలలు కట్టిన వారి కి తప్పనిసరిగా ఏదో ఒక వస్తువును అందజేస్తామని చెప్పి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. కొద్ది మందికి బల్క్‌గా నాసిరకం వస్తువులను అందిస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు కాగానే ఆ ప్రాంతాలను విడిచి వెళ్తున్నారు.  

ఫ బోర్డు తిప్పేసిన సైన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌

నిజామాబాద్‌ నగరంలో గత 15 రోజుల క్రితం సైన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు తిప్పివేయడం తో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వన్‌టౌన్‌ పరిధిలో కేసు నమోదు చేసి నిర్వాహకులు ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా  ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతకాకుండా, ఈ మధ్యనే ఆర్మూర్‌లో కూడా ఒక డ్రా నిర్వాహకులు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి పరారైనట్లు అక్కడి పోలీసులకు స్థానిక బాధితులు సమాచారం ఇచ్చారు. అయితే, ఆ నిర్వాహకులు కొంతమందికి వస్తువులను అందించి, మిగతా వారికి అందించనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, నిర్మల్‌ జిల్లాకు చెందిన నిర్వాహకుడు గత కొన్నేళ్లుగా ఆర్మూర్‌లో ఉంటూ లక్కీ డ్రా స్కీంలతో పాటు చిట్టీల నిర్వహణ చేస్తున్నట్లు తెలిసింది. 

ఫ అధికార, ప్రతిపక్ష పార్టీలతో సంబంధం

ఇందల్‌వాయి, నవీపేటలో కూడా భారీ మొత్తంలో ఈ డ్రాలను నిర్వహిస్తున్నారు. ఈ డ్రా నిర్వాహకుల్లో కొంతమంది అధికార, ప్రతిపక్ష పార్టీలతో సంబంధాలు ఉండడం వల్ల స్థానిక అధికారులు సహకరిస్తున్నారు. నెలనెలా వారికి మామూళ్లు అందడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏ అధికారి అయినా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అయితే.. పైస్థాయి నుంచి ఫోన్‌లు చేయిస్తుండడంతో వారు వెనకడుగు వేస్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో చెయిన్‌ నిర్వాహకులపై మాత్రం కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారి బ్యాంక్‌ అకౌంట్‌లన్‌ సీజ్‌ చేయాలని బ్యాంక్‌ ఉన్నతాధికారులను కోరారు. అంతేకాకుండా నిర్వాహకులు వసూలు చేసిన డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు, వారు కొన్న భూములు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి సీజ్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ డ్రాల వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో అన్ని మండాలల పరిధిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరికొన్ని సంస్థలపైన కేసులు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, నిజామాబాద్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మండలాల్లో జరిగే డ్రాలపైన దృష్టి పెట్టామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. అంతేకాకుండా నగరం పరిధిలో కేసులు నమోదు చేయడంతో పాటు వారి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. డ్రాల్లో మోసపోయిన వారు తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా పరిధిలోని ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే లక్కీ డ్రా స్కీంల నిర్వహణ ఆగిపోవడంతో పాటు సభ్యులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2021-07-29T06:55:20+05:30 IST