చరిత్రపుటల్లో.. అమరావతి!

ABN , First Publish Date - 2020-08-01T09:16:38+05:30 IST

ఏపీ రాజధాని అమరావతి కథ పరిసమాప్తమైంది! కనీసం వెయ్యేళ్లపాటు తెలుగు జాతి గుండెచప్పుడుగా నిలుస్తుందని భావించిన ఈ నగరం ఇంతలోనే కేవలం ‘శాసన రాజధాని’గా మారిపోనుంది.

చరిత్రపుటల్లో.. అమరావతి!

ప్రపంచస్థాయి నగరం అవబోయి.. కేవలం శాసన రాజధానిగా మిగిలి

పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని గతిని మార్చిన జగన్‌ సర్కార్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏపీ రాజధాని అమరావతి కథ పరిసమాప్తమైంది! కనీసం వెయ్యేళ్లపాటు తెలుగు జాతి గుండెచప్పుడుగా నిలుస్తుందని భావించిన ఈ నగరం ఇంతలోనే కేవలం ‘శాసన రాజధాని’గా మారిపోనుంది. రాజధాని రైతులు సహా చాలా మంది మేధావులు ఇప్పటి వరకు ఏదో ఒక అద్భుతం జరగకపోదా, అమరావతిని రక్షించకపోదా అని ఎదురు చూశారు. అయితే, శుక్రవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీసుకున్న నిర్ణయం.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో అమరావతి పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం..


2014

జూన్‌ 2: ఉమ్మడి ఏపీ విభజన చట్టం-2014 అమల్లోకి వచ్చిన రోజు.

జూలై 28: ఏపీకి రాజధానిని ఎంపిక చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక రాష్ట్రానికి చేరింది.

సెప్టెంబరు 3: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని(అమరావతి)ని విజయవాడ-గుంటూరుకు మధ్య కృష్ణా నదీతీరాన నిర్మించేలా అప్పటి శాసనసభ తీర్మానం.

సెప్టెంబరు 22: రాజధాని ప్రాంతంగా 8,352.69 చదరపు కిలోమీటర్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.

అక్టోబరు 25: అమరావతికి కావాల్సిన భూమిని సమీకరణ(పూలింగ్‌) విధానంలో తీసుకునేందుకు నవంబరు వరకు గ్రామసభల నిర్వహణ. 

డిసెంబరు 8: అమరావతి భూసమీకరణ పథకం(ఎల్పీఎస్‌) ప్యాకేజీ ప్రకటన. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ కోసం సింగపూర్‌ ప్రభుత్వంతో ఎంవోయూ.

డిసెంబరు 22: అమరావతి ప్లానింగ్‌, సమన్వయం, పర్యవేక్షణ కోసం ‘ఏపీసీఆర్డీయే చట్టం-2014’ ఆమోదం. 


2015

జనవరి 13: రాజధాని నిర్మాణంపై ఏర్పాటైన హై లెవెల్‌ కమిటీ తొలి భేటీలో చంద్రబాబు, సింగపూర్‌ మంత్రుల చర్చలు. 

ఫిబ్రవరి 28: భూసమీకరణ కింద 32,469 ఎకరాలను ఇచ్చేందుకు సమ్మతి పత్రాలిచ్చిన 20,510 మంది రైతులు. 

ఏప్రిల్‌ 22: రాజధాని మాస్టర్‌ డెవలపర్‌ను ‘స్విస్‌ ఛాలెంజ్‌’ విధానంలో ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం.

మే 25: రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ అందజేసిన సింగపూర్‌ ప్రభుత్వం.

అక్టోబరు 22: ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అమరావతికి శంకుస్థాపన. 


2016

ఫిబ్రవరి 17: తాత్కాలిక సచివాలయానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.

జూన్‌ 25: రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం ప్రారంభం. 

అక్టోబరు 28: అమరావతిలో గవర్న్‌మెంట్‌ కాంప్లెక్స్‌కు అప్పటి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ శంకుస్థాపన.


2017

జనవరి 3: 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ఆర్‌ఎ్‌ఫక్యూ జారీ.

మార్చి 2: అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

మార్చి 6: తొలిసారిగా బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై, 28వ తేదీ వరకు జరిగాయి. 

మే 15: స్టార్టప్‌ ఏరియాకు శంకుస్థాపన.

జూలై 15: అమరావతిలో ‘ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ’ని ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చంద్రబాబు. 

డిసెంబరు 27: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అమరావతి సందర్శన.


2018

జనవరి 10-12: ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధి బృందం పర్యటన 

ఆగస్టు 14: అమరావతి-2018 బాండ్ల పేరిట రూ.2,000 కోట్ల సమీకరణకు బిడ్డింగ్‌ ప్రక్రియ.

సెప్టెంబరు 16: కొండవీటి వాగు ముంపు నివారణ పంపింగ్‌ పనులు ప్రారంభం.

అక్టోబరు 26: అమరావతి-2018 బాండ్ల దిగ్విజయాన్ని పురస్కరించుకుని కేంద్రం రూ.26 కోట్ల ప్రోత్సాహకం ప్రకటన. 

డిసెంబరు 27: హెచ్‌వోడీ టవర్లలోని 2వ దానికి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రక్రియ ప్రారంభం. దీనిని 65 గంటల్లో పూర్తి చేయడం రికార్డ్‌!


2019

జనవరి 10: స్టార్టప్‌ ఏరియాలో సింగపూర్‌ కన్సార్షియం ఏర్పాటు చేయనున్న వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన.

జనవరి 12: అమరావతిని పవిత్ర సంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన. 

ఫిబ్రవరి 3: హైకోర్టు శాశ్వత భవనానికి సుప్రీం కోర్టు అప్పటి సీజే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శంకుస్థాపన. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం. 


2019 ప్రథమార్ధం నుంచి..

గతేడాది ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల వెల్లడి నుంచి అమరావతికి కష్టకాలం ప్రారంభమైంది. తొలుత అందులోని ప్రాజెక్టులను ఒక్కొక్క దానిని వేర్వేరు కారణాలతో ఆపివేస్తూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత అమరావతిపై పూర్తిగా శీతకన్నేసింది. దీంతో ఎన్నికల వరకు సుమారు 15,000-20,000 మందితో రేయింబవళ్లు నిర్మాణ పనులు సాగుతూ కోలాహలంగా కనిపించిన అమరావతిలో చీకట్లు అలుముకున్నాయి. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసేలా సూచనల కోసం జీఎన్‌రావు, బీసీజీ వంటి కమిటీల ఏర్పాటు. 

ఆయా నివేదికల ఆధారంగా 2019 డిసెంబరు 17న శాసనసభలో సీఎం జగన్‌ 3 రాజధానుల ప్రకటన.

సీఎం జగన్‌ ప్రకటనపై భగ్గుమన్న అమరావతి ప్రజలు. రాష్ట్ర, దేశ విదేశాల్లోని తెలుగువారి ఆందోళనలు.


2020

జనవరి 20: పాలన వికేంద్రీకరణ, ఏపీసీఆర్డీయే చట్టం రద్దు బిల్లులకు శాసనసభ ఆమోదం. 

జనవరి 22: సెలక్ట్‌ కమిటీకి పంపుతూ.. శాసనమండలి చైర్మన్‌ నిర్ణయం. 

జూన్‌ 16: రెండవసారి ఈ బిల్లులను ఆమోదించిన శాసనసభ, ఆ మరుసటి రోజే మండలికి.

జూలై 31: ఈ 2 బిల్లులను పరిశీలించిన అనంతరం ఆమోదిస్తూ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతకం. దీంతో ఏకైక రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానులకు అవకాశం. 

Updated Date - 2020-08-01T09:16:38+05:30 IST