Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసును ఆలస్యం చేయడానికి అది గేమ్‌ప్లాన్‌

  • ఏపీ సీఎం జగన్‌కు మినహాయింపు వద్దు: సీబీఐ


హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు విచారణకు హాజరుకాకుండా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ అధికారులు హైకోర్టును కోరారు. కేసును ఆలస్యం చేయడానికి జగన్‌ ఆడుతున్న గేమ్‌ప్లాన్‌లో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు విజ్ఞప్తులని వివరించారు. క్విడ్‌ప్రోకో కేసుల్లో దిగువ కోర్టు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ కేసుల్లో ఏ1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది. సీబీఐ న్యాయవాది సురేందర్‌ వాదనలు వినిపిస్తూ.. దిగువ కోర్టులో విచారణను ఆలస్యం చేయడానికి ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు.  సీబీఐ కేసులు నమోదై పదేళ్లవుతుందని.. ఇంకా డిశ్చార్జి పిటిషన్ల దశ కూడా దాటలేదని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ఉద్దేశపూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తున్నారని వివరించారు. అభియోగాల నమోదు ప్రారంభం అయిన తర్వాత మినహాయింపు తీసుకోవడం వేరని.. అభియోగాలకు ముందే మినహాయింపు ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు.


వ్యక్తిగత మినహాయింపుపై గతంలో పిటిషనర్‌ దాఖలు చేసిన పిటిషన్లను దిగువ కోర్టు, ఇదే హైకోర్టు కొట్టేశాయని గుర్తుచేశారు. ప్రస్తుతం పిటిషనర్‌ ఇంకా పెద్ద హోదాలో ఉన్నారని.. ఇప్పుడు ఇంకా ఎక్కువగా సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదముంటుందని తెలిపారు. వ్యక్తిగత మినహాయింపుపై ఇప్పటికే తీర్పు ఇచ్చినందున మళ్లీ దానిని సమీక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. వివిధ కారణాలతో హాజరు నుంచి మినహాయింపు అడిగిన ప్రతిసారీ దిగువ కోర్టు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఒక్కసారి అభియోగాలు నమోదు చేయడం పూర్తయితే ఒక ఏడాది లోపు ట్రయల్‌ పూర్తి కావాల్సి ఉంటుందని తెలిపారు. కేసులు నమోదయి పదేళ్లు అవుతుందని.. చాలా ఆలస్యం అయిందని పేరొన్నారు. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సీబీఐ కోర్టులోగానీ, హైకోర్టులోగానీ తాము ఎప్పుడూ వాయిదాలు తీసుకోలేదని.. ఆలస్యానికి తాము కారణం కాదని పేర్కొన్నారు. సీబీఐ కేసులు ముందు విచారించాలా? లేదా ఈడీ కేసులా? అన్న అంశంపై విచారణ కొనసాగిందని తెలిపారు. పిటిషనర్‌ ఎంపీగా ఉన్నారని, హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు కాబట్టి.. వారంలో ఒక్క రోజు కోర్టుకు వస్తే ఇబ్బందేమీ లేదని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని.. పిటిషనర్‌ ఏపీ సీఎం అయ్యారని.. అక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు.  కాబట్టి వ్యక్తిగతంగా మినహాయిపు ఇచ్చే అంశంపై తాజా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


గతంలో క్విడ్‌ప్రోకో కేసులపై దిగువ కోర్టులో వారంలో ఒక్కసారి విచారణ జరిగేదని.. ఇప్పుడు ఐదురోజులు విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఒక సీఎం వారంలో 5 రోజులు కోర్టుకు హాజరుకాలేరని, పాలన వ్యవహారాలు గాడితప్పుతాయని చెప్పారు. ప్రత్యక్ష హాజరు తప్పనిసరి అనుకున్నప్పుడు పిటిషనర్‌ హాజరవుతారని పేర్కొన్నారు. అభియోగాలకు ముందు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వరాదని ఎక్కడా లేదని.. ఈ అంశం కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుందని వాదించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement