పరోక్ష వడ్డన!

ABN , First Publish Date - 2020-12-01T09:10:27+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులపై పరోక్షంగా చార్జీల భారం పడే అవకాశం కనిపిస్తోంది. వినియోగదారుల కేటగిరీల సవరణ ద్వారా

పరోక్ష వడ్డన!

1,285 కోట్ల విద్యుత్‌ ‘భారం’.. డిస్కమ్‌ల ప్రతిపాదనలు

కేటగిరీల మార్పుతో అదనపు వసూళ్లు

హేచరీలు పారిశ్రామిక కేటగిరీలోకి

పెరగనున్న దాణా, పిల్లల ధరలు

ఆక్వా, పౌలీ్ట్ర రైతులపై పరోక్ష భారం

కనీస చార్జీ బదులు లోడ్‌ ఆధారిత చార్జీ

డిస్కమ్‌లకు 11,911 కోట్ల ఆర్థిక లోటు


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులపై పరోక్షంగా చార్జీల భారం పడే అవకాశం కనిపిస్తోంది. వినియోగదారుల కేటగిరీల సవరణ ద్వారా అదనంగా రూ.1,285 కోట్లు రాబట్టుకోవాలని ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ప్రతిపాదించాయి. అయితే, కేటగిరీల మార్పును పరిశీలిస్తే అంతకంటే ఎక్కువ వడ్డనే ఉండే అవకాశం కనిపిస్తోంది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి డిస్కమ్‌లు 2021-22 సంవత్సరం  వార్షిక ఆదాయ అవసర ప్రణాళిక (ఏఆర్‌ఆర్‌)ను  సమర్పించాయి.  ప్రస్తుతం డిస్కమ్‌లకు రూ.30,834 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రతిపాదిత చార్జీల ద్వారా రూ.32,119 కోట్లు ఆర్జించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. అంటే... అదనపు భారం రూ.1285 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తే వినియోగదారులపై భారం పడదు. లేదంటే... వడ్డన తప్పదు. డిస్కమ్‌లు మొత్తం రూ.11,911 కోట్లు ఆర్థిక లోటు చూపించాయి. 


ఇవీ డిస్కమ్‌ల ప్రతిపాదనలు...

గృహ వినియోగదారులు ఇళ్లలో లేనప్పుడు కనీస చార్జీ(నెలకు రూ.25)లు చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై కనీస చార్జీ స్థానంలో కాంట్రాక్ట్‌ లోడ్‌ను పరిగణనలోకి తీసుకొని కిలోవాట్‌కు రూ.10ల చొప్పున స్థిర చార్జీని నిర్ణయించాయి. అపార్ట్‌మెంట్‌లతోపాటు చాలా ఇళ్లలో త్రీఫేజ్‌ విద్యుత్‌ వాడుతున్నారు. త్రీ ఫేజ్‌ వాడే విద్యుత్‌ వినియోగదారుల కాంట్రాక్ట్‌ లోడు మూడు కేవీఏ లేదా ఐదు కేవీఏ ఉంటుంది. ఐదు కేవీఏ ఉన్నవాళ్లు నెలకు రూ.50 దాకా చెల్లించాల్సి వస్తుంది. ఈ ఒక్క సవరణతోనే రూ.వెయ్యి కోట్లు అదనంగా సమకూరే అవకాశముంది. 

ఫంక్షన్‌ హాళ్లలో డీజిల్‌ జనరేటర్ల వినియోగాన్ని తగ్గించడానికి నెలకు ఉన్న రూ.100 స్థిర చార్జీలను రద్దు చేయాలని ప్రతిపాదించారు. 

గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ల నుంచి యూనిట్‌కు రూ.5.95 వసూలు చేసి, హెచ్‌టీ-1 కేటగిరిలో వీటిని ప్రతిపాదించారు.

వ్యవసాయ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పీక్‌ డిమాండ్‌ సమయాన్ని మార్చారు.  ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా పీక్‌ డిమాండ్‌ ఉంటుంది. ఆఫ్‌పీక్‌ డిమాండ్‌ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల దాకా  ఉంది. 

హెచ్‌టీ(3) పారిశ్రామిక కేటగిరీకి ఇచ్చే లోడ్‌ ఫ్యాక్టర్‌ ఇన్సెంటివ్‌ రద్దు.ఙ


ఆక్వాపై భారం.. 

పౌలీ్ట్ర రైతులు, ఆక్వా రైతులపై పరోక్షంగా విద్యుత్‌ భారం పడనుంది. ప్రస్తుతం పౌలీ్ట్ర హేచరీస్‌, ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు, ఆక్వా హేచరీలు ప్లాంట్లు ఎల్‌టీ కేటగిరీ (5సీ)లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని పారిశ్రామిక కేటగిరీలోకి మార్చాలని ప్రతిపాదించారు. అదే జరిగితే... హేచరీలపై విద్యుత్‌ బిల్లుల భారం పెరుగుతుంది. ఆయా కంపెనీలు తమ భారాన్ని రైతులపైనే మోపుతాయి. దీనివల్ల... పౌలీ్ట్ర, ఆక్వా రైతులపై భారం పడటం ఖాయం. 


2021-2022 ఏఆర్‌ఆర్‌ వివరాలు

వివరం కేటగిరీ

విద్యుత్‌ కొనుగోలు(మిలియన్‌ యూనిట్లు) 68,369 

విద్యుత్‌ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.30,206 కోట్లు

యూనిట్‌కు అయ్యే ఖర్చు రూ.4.42

వార్షిక ఆదాయ అవసరం(ఏఆర్‌ఆర్‌) రూ.44,030 కోట్లు

ప్రస్తుతం వచ్చే ఆదాయం(అన్నిరకాలు కలిపి) రూ.30,834 కోట్లు

ప్రతిపాదిత చార్జీల(క్రాస్‌ సబ్సిడీ కూడా)తో కలిపి రూ.32,119 కోట్లు

యూనిట్‌కు వచ్చే ఆదాయం రూ.5.26

యూనిట్‌ సరఫరాకు అయ్యే ఖర్చు రూ.7.21

ఆర్థిక లోటు (ప్రభుత్వ ఇవ్వబోయే సబ్సిడీ కాకుండా) రూ.11,911 కోట్లు

Updated Date - 2020-12-01T09:10:27+05:30 IST