Advertisement
Advertisement
Abn logo
Advertisement

గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం

రోశయ్య మృతిపై గవర్నర్‌, సీఎం, చంద్రబాబు సంతాపం


 (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నాటి తరం నాయకునిగా, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారని గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు. రోశయ్య మృతిపట్ల గవర్నర్‌తోపాటు సీఎం జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా, రోశయ్య మరణ వార్త తననెంతో బాధించిందని సీఎం జగన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, రాజకీయాల్లో నైతిక విలువలు కలిగిన నాయకుడు రోశయ్య అని చంద్రబాబు కొనియాడారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో రోశయ్య సంతాప సభ నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. రాజకీయంగా తమతో విభేదించినా, ఆత్మీయంగా, స్నేహపూర్వకంగా మెలిగేవారని చంద్ర బాబు తెలిపారు. రోశయ్య మృతితో రాష్ట్రం ఒక ఆర్థిక నిపుణుడిని కోల్పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  రోశయ్య మరణంతో రాష్ట్రం గొప్ప అనుభవశాలిని కోల్పోయిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.


రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి రోశయ్య అని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కొనియాడారు. కాగా, రోశయ్య అకాల మృతి బాధించిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. రోశయ్య మృతి రాష్ట్రానికి తీరని లోటని మంత్రి బొత్స సత్సన్నారాయణ అన్నారు. రోశయ్య రాజకీయాల్లో విలువలు పాటించి ఆదర్శంగా నిలిచారని హోం మంత్రి మేకతోటి సుచరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ దురంధరుడు రోశయ్య మృతి తెలుగురాష్ట్రాలకు తీరనిలోటని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో రోశయ్య రాష్ర్టానికి చేసిన ఎనలేని సేవలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుంటాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రోశయ్య రాజకీయ దిగ్గజమని టీడీపీ సీనియర్‌ నేతలు యడ్లపాటి వెంకట్రావు, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నా రు. రాష్ర్టానికి రోశయ్య అందించిన సేవలు నిరుపమానమని జనసేన పీఏసీ చైర్మన్‌ నాందెడ్ల మనోహర్‌ కొనియాడారు. రోశయ్య మరణంతో పెద్దన్నయ్యను కోల్పోయానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. 


రఘువీరా కన్నీటి పర్యంతం

రోశయ్య మరణ వార్త వినగానే మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలో ఆయన మాట్లాడుతూ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తానని చెప్పారు. ‘వింటే రోశయ్య ఉపన్యాసం వినాలి.. తింటే గారెలే తినాలి’ అన్న చర్చ ఉండేదన్నారు. ఇక, రోశయ్య రాజకీయాల్లో 60 ఏళ్ల పాటు ఎన్నో పదవులు అధిరోహించి వాటికి వన్నెతెచ్చారని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. రోశయ్య మరణంతో కాంగ్రెస్‌ పార్టీ పెద్దదిక్కును కోల్పోయిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. తిరుపతిలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు.


విలువలు కలిగిన నాయకుడు: సీపీఐ రామకృష్ణ 

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రగాఢ  సంతాపం తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమితి తరఫున ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య మరణం రాష్ట్రానికి తీరని లోటు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. 


ఉద్యోగుల సమస్యలను రోశయ్య పరిష్కరించారు: ఏపీజేఏసీ

అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య ఆకస్మిక మృతి పట్ల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంతాపం తెలిపాయి. ఆయన కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. ఉద్యోగ సంఘాలుగా తమకు రోశయ్యతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ చైర్మన్లు బండి  శ్రీనివాసరావు, బొప్పురాజు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.


 పరిపాలనా దక్షుడు రోశయ్య: తమిళనాడు గవర్నర్‌ రవి

చెన్నై, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల మాజీ గవర్నర్‌, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతివార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని  తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. రోశయ్య మృతిపై తమిళనాడు గవర్నర్‌ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్‌, మాజీ సీఎంలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోశయ్య సీనియర్‌ రాజనీతిజ్ఞుడని, ఉత్తమ పార్లమెం టేరియన్‌గాను, పరిపాలనా దక్షుడిగాను పేరుగడించారని రవి కొనియాడారు. 

Advertisement
Advertisement