Advertisement
Advertisement
Abn logo
Advertisement

రక్షణ కల్పించండి: వైఎస్‌ వివేకా కుమార్తె సునీత

  • మా కుటుంబ భద్రతపై ఆందోళనగా ఉంది 
  • ప్రస్తుత పరిస్థితులు చూస్తే భయమేస్తోంది
  • ఇంటి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగారు
  • ఆ వ్యక్తి మా నాన్న హత్య కేసులో 
  • అనుమానితుడికి అత్యంత సన్నిహితుడు 
  • కడప ఎస్పీకి వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు
  • నా పోరాటంలో కుటుంబ సభ్యుల సహకారం 
  • దోషులకు శిక్ష పడాల్సిందే: ఏబీఎన్‌ చర్చలో సునీత 


ప్రస్తుత పరిస్థితులు చూస్తే భయమేస్తోంది. పులివెందులలోని మా ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరిగారు. ఆ వ్యక్తి మా నాన్న హత్యకేసులో అనుమానితుడికి అత్యంత సన్నిహితుడు. మా కుటుంబ భద్రతపై ఆందోళనగా ఉంది. మాకు రక్షణ కావాలి.

- వైఎస్‌ వివేకా కుమార్తె సునీత 


కడప(ఆంధ్రజ్యోతి)/పులివెందుల/కడప(క్రైం), ఆగస్టు 13: ‘‘పులివెందులలోని మా ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారు. ఈ నెల 10న కూడా ఓ వ్యక్తి అనునామాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వారి ఉద్దేశం ఏమిటో మాకు తెలియదు. మా కుటుంబానికి రక్షణ కల్పించండి’’ అంటూ కడప ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌కు సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత శుక్రవారం విన్నవించారు. ‘మా కుటుంబ భద్రతపై ఆందోళనగా ఉంది. ఈనెల 10న సాయంత్రం 5.20గంటల సమయంలో ఓ వ్యక్తి మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా నేను పేర్కొన్న వ్యక్తుల్లో డి.శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుతున్న వ్యక్తి ఫొటో ఉన్నట్లు గుర్తించాం. ఇదే విషయాన్ని 12న సీఐ భాస్కరరెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన మా ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, కేటరింగ్‌ వ్యాపారం చేసుకునే మణికంఠరెడ్డి అనే వ్యక్తి తన వ్యాపారం కోసం అద్దె స్థలం కోసం అన్వేషిస్తున్నాడని వివరించారు. శివశంకరరెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడు. శివశంకరరెడ్డి అనుచరులు మా ఇంటిచుట్టూ అనుమానాస్పదంగా తిరగడం ఆందోళన కలిగిస్తోంది’ అని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. తక్షణమే వారి ఇంటివద్ద శాశ్వత ప్రాతిపదికన పోలీసు పికెట్‌ ఏర్పాటు చేయాలని, లేఖలో పేర్కొన్న అంశాలపై విచారణ చేపట్టాలని డీఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు వివేకా ఇంటివద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసినట్లు సీఐ చెప్పారు.

శంకర్‌రెడ్డిని విచారించిన సీబీఐ 

వివేకా హత్యకేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కన్వీనర్‌ దేవిరెడ్డి శంకర్‌రెడ్డితో పాటు కొమ్మా పరమేశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, మున్నాను పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారించారు. కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్‌తో పాటు వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందులకు చెందిన భరత్‌యాదవ్‌, ఉమాశంకర్‌ను సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారం ఆవరణలోని అతిథి గృహంలో శుక్రవారం ఏడు గంటల పాటు విచారించారు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది

‘‘వైఎస్‌ కుటుంబం మొత్తం 700మందికి పైగా ఉంటారు. అందరూ కలిస్తే ఓ చిన్న గ్రామం అవుతుంది. మా నాన్న హత్యకేసుకు సంబంధించి న్యాయపోరాటంలో మా కుటుంబసభ్యుల సహకారం ఉంది’’ అని వివేకా కుమార్తె సునీత పేర్కొన్నారు. శుక్రవారం ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ‘‘మా నాన్న హత్యకు గురైనప్పుడు గుండెపోటుతో మరణించారని జరిగిన ప్రచారం నాకు తెలియదు. ఆలస్యంగానే నా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం సీబీఐ విచారణ నేపథ్యంలో ఈ కేసు గురించి మాట్లాడటం మంచిది కాదేమో. పోలీసు, సీబీఐ వంటి వ్యవస్థలపై నాకు నమ్మకం ఉంది. హైకోర్టులో పలువురి అనుమానితుల పేర్లు వెల్లడించిన మాట నిజమే. ఇప్పుడిప్పుడే సీబీఐ ఆ దిశగా విచారణ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భయమేస్తోంది. మా నాన్న చనిపోయాక ప్రాణహాని ఉంటుందని, సెక్యూరిటీ గార్డులను పెట్టుకోమని శ్రేయోభిలాషులు సూచించారు. డాక్టర్‌గా ఆస్పత్రికి వెళ్లినప్పుడు పక్కనే సెక్యూరిటీ ఉండటం మంచిది కాదేమో అనిపిస్తోంది. ఫ్యాక్షన్‌ పూర్తిగా ఉండకూడదని నాన్న అనేవారు. ఫ్యాక్షన్‌ పూర్తిగా పోవాలంటే అసలైన నిందితులకు శిక్ష పడాల్సిందే. ఆ దిశగా సీబీఐ విచారణ చేస్తుందని, తప్పక న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. మా ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఈ కేసును త్వరగా క్లియర్‌ చేయాలని మా అన్న, సీఎం జగన్‌ను కలిసిన మాట నిజమే. షర్మిల ఒక్కటే కాదు కుటుంబసభ్యుల మద్దతు కూడా ఉంది’’ అని సునీత పేర్కొన్నారు.

Advertisement
Advertisement