విపత్తులపై చోద్యం చూస్తారేం?

ABN , First Publish Date - 2020-11-28T09:02:35+05:30 IST

పంటలు చేతికి అందివచ్చే సమయంలో తుఫాను బీభత్సంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

విపత్తులపై చోద్యం చూస్తారేం?

దిక్కుతోచని స్థితిలో వేల మంది అన్నదాతలు

తక్షణమే ఆదుకోవాలి.. చంద్రబాబు డిమాండ్‌

విపత్తులపై చోద్యమేల?

బాధితుల పట్ల నిర్లక్ష్యం క్షమార్హం కాదు: చంద్రబాబు


అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘పంటలు చేతికి అందివచ్చే సమయంలో తుఫాను బీభత్సంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు, కౌలు రైతులు, కూలీలు, పేదలు తీవ్రంగా నష్టపోయారు. వరుస విపత్తులతో రైతాంగం తల్లిడిల్లిపోతోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పాలకుల నిష్ర్కియాపరత్వం ప్రజలకు శాపంగా మారింది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం తుఫాను ప్రభావిత జిల్లాల టీడీపీ నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది వరుసగా ఇది నాలుగో విపత్తు. ఆగస్టులో 1, అక్టోబరులో 2, ఇప్పుడు నివర్‌ తుఫాను. మళ్లీ మూడు రోజుల్లో ఇంకో విపత్తు అంటున్నారు. రైతులు, పేదలు భయాందోళనల్లో ఉన్నారు. అయినా ముందస్తు హెచ్చరికలు లేవు. ప్రజలను అప్రమత్తం చేయడం లేదు. సమీక్షించడమూ లేదు. మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. బాధితుల పట్ల నిర్లక్ష్యం క్షమార్హం కాదు.  రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తక్షణమే విపత్తు సాయం అందిస్తే, రబీలో పెట్టుబడులకు అంది వస్తుంది. ఫిబ్రవరి దాకా ఇవ్వలేనని, పరిహారం కోసం 3 నెలలు ఆగాలని సీఎం, మంత్రులు మాట్లాడటం రైతుల పట్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.


సొంత మీడియాకు యాడ్స్‌ ఇవ్వడానికి డబ్బులున్నాయిగానీ, రైతులకు ఇవ్వడానికి చేతులు రావా’ అని మండిపడ్డారు. ‘విపత్తులతో నష్టపోయిన రైతుల్ని, పేదల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందున, ప్రజాపక్షంగా మన బాధ్యత నిర్వర్తించాలి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. బాధితుల్ని ఆదుకోవాలి.


తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలి. వారిలో మనో నిబ్బరం పెంచాలి. జరిగిన నష్టంపై వివరాలు సేకరించాలి. నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్లను వీడియో తీయాలి. ఫోటో ఆధారాలతో నివేదికలను అధికారులకు అందజేయాలి. తక్షణమే ఎన్యూమరేషన్‌ చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’ అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా.. తుఫాను నష్టం దారుణంగా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఉదారంగా ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎంకు లేఖ రాశారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. 

Updated Date - 2020-11-28T09:02:35+05:30 IST