ప్రశ్నిస్తే చంపేస్తారా?

ABN , First Publish Date - 2021-03-08T09:51:38+05:30 IST

జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు, పోలీసుల వైఖరిపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ‘కుండబద్దలు’ సుబ్బారావుపై తాజాగా జరిగిన దాడి

ప్రశ్నిస్తే చంపేస్తారా?

అది ప్రమాదం కాదు.. నాపై హత్యాయత్నమే

కుండబద్దలు సుబ్బారావు స్పష్టీకరణ

న ఆయన కారును ఢీకొన్న లారీ.. ఆయనకు, డ్రైవర్‌కు గాయాలు


గుంటూరు, మార్చి 7: జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు, పోలీసుల వైఖరిపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ‘కుండబద్దలు’ సుబ్బారావుపై తాజాగా జరిగిన దాడి అనుమానాలకు తావిస్తోంది. ఆయన కారు ను ఓ లారీ ఇటీవల ఢీకొట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని.. తనను చంపేందుకే కారును ఢీకొట్టారని ఆయన ఆరోపించారు. తన ‘కుండబద్దలు’ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఆయన ఇటీవలి కాలంలో అనేక సంచలన కథనాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలోని ఓ ఆశ్రమం డీల్‌లో రూ.30 కోట్లు చేతులు మారిన వ్యవహారంలో బీజేపీ నేతల పాత్రపై కొద్దిరోజుల కింద ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై కూడా సుబ్బారావు తన చానల్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆయన అసలు పేరు కాటా సుబ్బారావు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామానికి చెందినవారు. ఈ నెల 3న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ కోసం తన కారులో గుంటూరు వస్తుండగా.. యనమదల సమీపంలో ఆయన కారును నిమ్మకాయల లోడు లారీ(ఏపీ 26 టీడీ 5067).. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు 4 రౌండ్లు బొంగరంలా తిరిగి పూర్తిగా దెబ్బతింది.


అయినప్పటికీ లారీ ఆగకుండా కారును మళ్లీ ఢీకొడుతూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సుబ్బారావుకు, డ్రైవర్‌ బాజీకి గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఆ లారీని కాజ టోల్‌గేటు వద్ద నిలిపివేశారు. ఆస్పత్రికి డయాలసి్‌సకు వెళ్లిన సుబ్బారావు.. నల్లపాడు పోలీసులకు ఫోన్‌ చేసి ఆస్పత్రికి వచ్చి తన నుంచి ఫిర్యాదు తీసుకోవాలని చెప్పగా.. సిబ్బంది అంతా గుడారాల పండుగ బందోబస్తులో ఉన్నారని, మీరే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో ఈ నెల 6న ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీలో నిమ్మకాయలు ఉన్నాయని, లారీని నిలిపివేస్తే కాయలు పాడైపోతాయని చెప్పి పోలీసులు లారీని పంపించివేశారని సుబ్బారావు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లో వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, తనపై కక్షకట్టి చంపడం కోసం జరిగిన అజ్ఞాత దాడి అని ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఇది హత్యాయత్నమేనని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా అని నిలదీశారు.

Updated Date - 2021-03-08T09:51:38+05:30 IST