అన్నదాతకు ఆపద

ABN , First Publish Date - 2021-11-15T09:12:18+05:30 IST

అన్నదాతకు ఆపద

అన్నదాతకు ఆపద

అధిక వర్షాలతో కష్టం.. భారీగా పంట నష్టం

ముంపులో 3,31,732 ఎకరాల్లో పంటలు

నేలకొరిగిన లక్ష ఎకరాల వరి

మర్చి, ఇతర పంటలకూ చేటు

దిగుబడిపై ప్రభావం.. ఇప్పట్లో కోతలు లేనట్లే

తరుముకొస్తున్న వాయుగుండంతో మరింత ఆందోళన


అమరావతి, కడప, ఏలూరు సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అధిక వర్షాలతో అన్నదాతకు ఆపదొచ్చింది. అక్టోబరు, నవంబరు నెలలు రాష్ట్ర రైతాంగం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిరుడు ఇదే సమయంలో నివర్‌ తుఫాన్‌తో చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. రైతుల్ని తీవ్రంగా నష్టపర్చాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ పంట ముగింపు దశకు రాగా, రబీ పంట ప్రారంభ దశలో ఉంది. మళ్లీ ఇప్పుడు వాయుగుండాలతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన పంటలకు నష్టం వాటిల్లుతోంది. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్‌ పంట, రబీపైర్లు పాడైపోయి రైతులు కన్నీరుమున్నీరవుతుండగా.. మరో వాయుగుండం రాష్ట్రానికి తరుముకొస్తుండటంతో రైతాంగం మరింత ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా డెల్టాల్లో వరి కోతలు సాగుతుండగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో పత్తి సగంలో ఉంది. రబీ పంటగా వేసిన శనగ ఇప్పటి వర్షాలకు దెబ్బతిన్నది. మిర్చి, ఇతర పంటలకు అధిక వర్షాలు చేటు చేస్తున్నాయి. ఈ నెల 18న వాయుగుండం కోస్తాంధ్రను తాకే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రైతులు కలవరం చెందుతున్నారు. పంట చేతికొచ్చే తరుణంలో, పైరు వేసే దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 


గుంటూరు మినహా.. 

రాష్ట్రంలో భారీ వర్షాలు, గాలులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. గత నెల, ఈ నెలలో కురిసిన కుండపోత వర్షాల వల్ల ముంపు బారిన పడిన పంటల ప్రాథమిక అంచనాలను వ్యవసాయశాఖ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,31,732 ఎకరాల్లో వివిధ పంటలు ముంపుబారిన పడ్డాయి. గుంటూరు మినహా మిగిలిన జిల్లాల్లో వరి, శనగ, పత్తి, మినుము, వేరుశనగ, చెరకు, జొన్న, మొక్కజొన్న, కంది, ఉలవ, సన్‌ఫ్లవర్‌ పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా గుర్తించింది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రస్తుతం 1.65లక్షల  ఎకరాల్లో కోసి ఉన్న వరి నీట మునిగింది. అందులో చాలా చోట్ల ధాన్యం తడిసి, మొలకలొస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో దాళ్వా వరి నాట్లు ముంపు బారిన పడ్డాయి. కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో 1.57లక్షల ఎకరాల్లో శనగ(బెంగాల్‌ గ్రామ్‌) దెబ్బతిన్నది. కడప జిల్లాలో రెండు, మూడు తీతల దశలో పత్తి తడిసిపోవడంతో పత్తి రంగుమారింది. భారీ వర్షాలకు లోతట్టు పొలాల్లోని పత్తి పైరు ఉరకెత్తి, దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, కడప, నెల్లూరు జిల్లాలో ఎడతెరిపివ్వని వర్షాలకు మినుము పంట దెబ్బతిన్నది. కడప జిల్లాలో ఇతర పంటలకూ నష్టం వాటిల్లింది. 


కడప, పశ్చిమలో వేలాది ఎకరాల ముంపు 

కడప జిల్లాలో వాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. 170 గ్రామాల్లో 17,838 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. అందులో వరి ఒక్కటే 16,335 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. రూ.10.51 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే.. ఉద్యాన పంటలు 4,616.5 హెక్టార్లలో నష్టం జరిగింది. ఇందుకోసం రూ.7.35 కోట్లు పరిహారం చెల్లించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్ల అంచనా మేరకు 312.66 కి.మీల రోడ్లు దెబ్బతిన్నాయి. 22 చోట్ల కోతకు గురయ్యాయి. 77 ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహించింది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.18.49 కోట్లు, శాశ్వత మరమ్మతుల కోసం రూ.200.92 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు. పంచాయతీ రాజ్‌ పరిధిలో దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులకు రూ.40 లక్షలు, శాశ్వత మరమ్మతులకు రూ.6.66 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 18 వేల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. చేలు నీట మునగటంతో ఆ పంటను కోసే పరిస్థితులు ఇప్పట్లో లేవని రైతులు చెబుతున్నారు. మరో అల్పపీడనం.. వాయుగుండం నేపథ్యంలో వీరి ఆందోళన మరింత అధికమైంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా భీమడోలు మండలంలో 70.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2021-11-15T09:12:18+05:30 IST