Advertisement
Advertisement
Abn logo
Advertisement

మన్యంలో రంగురాళ్ల వేట

గుట్టుచప్పుడు కాకుండా 3 నెలలుగా అన్వేషణ

కొండవాలుల్లో భారీ సొరంగాలే తవ్వేశారు

అధికారుల అండదండలున్నట్టు ఆరోపణలు

మట్టి పెళ్లలు పడి ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన

తవ్వకాలు ఆపించాలని అధికారులకు సర్పంచ్‌ వినతులు


పాడేరు/జి.మాడుగుల, నవంబరు 28: విశాఖ ఏజెన్సీలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ నిట్టమామిడి గ్రామ సమీప కూటికొండలు ప్రాంతంలో రెండేళ్ల క్రితం తొలిసారి రంగురాళ్ల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే మీడియాలో వార్తలు రావడంతో అటవీ, పోలీసు అధికారులు స్పందించి తవ్వకాలను నిలుపుదల చేయించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతోపాటు కొవిడ్‌తో ఏడాదిగా అధికారులు మారుమూల గ్రామాలకు వెళ్లడంలేదు. ఇదే అదనుగా రంగురాళ్ల వ్యాపారులు మూడు నెలల నుంచి స్థానిక గిరిజనులతో మళ్లీ అక్కడ తవ్వకాలు జరిపిస్తున్నట్టు తెలిసింది. నర్సీపట్నానికి చెందిన రంగురాళ్ల వ్యాపారులు ఇక్కడ లభ్యమైన రంగురాళ్ల విలువను బట్టి గిరిజనులకు డబ్బులు చెల్లిస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులను మేనేజ్‌ చేస్తూ తవ్వకాల వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. విషయం ఇటీవల గడుతూరు సర్పంచ్‌ అప్పలమ్మ దృష్టికి రావడంతో తవ్వకాలను నిలిపివేయించాలని అధికారులను కోరుతున్నారు. కొండవాలు ప్రాంతంలో భారీ సొరంగాలు తీస్తుండడంతో మట్టిపెళ్లలు విరిగిపడితే భారీ ప్రాణనష్టం వాటిల్లుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement