ఆదుకోండి సారూ..కేంద్ర బృందాలకు రైతుల మొర

ABN , First Publish Date - 2021-11-29T08:12:39+05:30 IST

ఆదుకోండి సారూ..కేంద్ర బృందాలకు రైతుల మొర

ఆదుకోండి సారూ..కేంద్ర బృందాలకు రైతుల మొర

మూడోరోజు నెల్లూరు జిల్లాలో పర్యటన

ఇసుక మేటవేసిన పొలాల పరిశీలన

సోమశిల జలాశయం సందర్శన

నేడు సీఎంతో కేంద్ర బృందం భేటీ


నెల్లూరు, అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న తమను ఆదుకోవాలని రైతులు కేంద్ర బృందాలను వేడుకున్నారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలు ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించాయి. ఒక బృందం తిరుపతి నుంచి, మరో బృందం కడప పర్యటన ముగించుకొని నెల్లూరు జిల్లాకు వచ్చాయి. దెబ్బతిన్న నిర్మాణాలు, రోడ్లు, పంటలు, ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నాయి. ఒక బృందంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్‌ సెక్రటరీ అనీల్‌కుమార్‌సింగ్‌, కేంద్ర రోడ్డు రవాణా  మంత్రిత్వశాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌సింగ్‌, ఆర్థిక శాఖ డైరెక్టర్‌ అభయ్‌కుమార్‌ ఉండగా, మరో బృందంలో ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్‌ సత్యార్థి, కేంద్ర వ్యవసాయ శాఖ డీజేడీ డైరెక్టర్‌ మనోహరన్‌, కేంద్ర విద్యుత్‌శాఖ డైరెక్టర్‌ శివన్‌ శర్మ, కేంద్ర జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసు బైరీ  సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో ఒక బృందం, పశ్చిమ ప్రాంతంలో మరో బృందం పర్యటించాయి. ఇందుకూరుపేట మండలం జేజే పేటలో దెబ్బతిన్న అరటి తోటలను, గంగపట్నంలో తెగిపోయిన రోడ్లు, చెరువు కట్టలు, కూలిన ఇళ్లు, ఇసుక మేటలతో నిండిన పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం తెలుసుకున్నారు. ఆక్వా రైతుల కష్టాలు ఆలకించారు. నెల్లూరు నగరంలోనూ కోతకు గురైన జాతీయ రహదారిని పరిశీలించారు. మరో బృందం సోమశిల జలాశయాన్ని, ఇసుక మేటవేసిన పొలాలను, సంగం వద్ద బీరాపేరు వాగు, బుచ్చి మండలం పెనుబల్లి వద్ద తెగిపోయిన ప్రధాన రోడ్డు, దెబ్బతిన్న హైస్కూల్‌, పశువైద్యశాలలు, జొన్నవాడ వద్ద తెగిన పెన్నా పొర్లుకట్టలను పరిశీలించింది. వారికి  క్షేత్రస్థాయి పరిస్థితులను జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, జేసీ హరేందిరప్రసాద్‌ వివరించారు. అనంతరం నెల్లూరులోని హోటల్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందాలు పరిశీలించాయి. జిల్లాలో రూ.1,190.15 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. స్థానిక భగత్‌సింగ్‌ కాలనీ వద్ద స్థానికులు కేంద్రబృందాలకు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు సాయం ఏమీ అందలేదని ఆందోళన చేశారు. 


నేడు ముఖ్యమంత్రితో సమావేశం 

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానుంది. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్‌ సత్యార్ధి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం రెండు టీంలుగా ఏర్పడి వరద ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించింది. విపత్తు ప్రాంతాల్లో గుర్తించిన పంట, ఆస్తి నష్టంపై ముఖ్యమంత్రితో ఈ బృందం చర్చించనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-11-29T08:12:39+05:30 IST