Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందరినీ కాపాడి...ఆప్తులను కోల్పోయి..

(కడప, ఆంద్రజ్యోతి) చెయ్యేరు వరద ఆ గ్రామాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అన్నమయ్య డ్యామ్‌ మట్టి కట్ట తెగిపోవడంతో వరద ఊళ్లకు ఊళ్లను ముంచెత్తింది. కొందరు తమ కళ్ల ముందే ఆప్తులను కోల్పోయారు. ముప్పు ముంచుకొస్తున్న సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు రిటైర్డు లష్కర్‌ రామయ్య ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడుకున్నారు. రామయ్యలాగే పులపత్తూరు సర్పంచ్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ ప్రజలను రక్షించారు. జనాన్ని కాపాడినా తన వాళ్లను కాపాడుకోలేకపోయాననే బాధ, దుఃఖం, అంతులేని ఆవేదన ఆయనను వెంటాడుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఉప్పెనై ముంచిన వరద క్షణాలను ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కడప జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు మా స్వగ్రామం. చెయ్యేరు నది ఒడ్డున పచ్చని పంటలు, పాలధారలు, ఉద్యాన పంటలతో కళకళలాడుతూ కోనసీమను తలపించే పల్లెసీమ. చెయ్యేరు నదితో చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. తాతలు, ముత్తాతల కాలం నుంచి ఇక్కడే నివసిస్తూ.. చెయ్యేరు ఆధారంగా పచ్చని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాం. మా పల్లెకు చెయ్యేరు ఏనాడూ లోటు చేయలేదు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట కొట్టుకుపోవడంతో జీవనాధారమైన చెయ్యేరు నది ఉప్పెనై మా ఊరు పులపత్తూరుతో పాటు తొగూరుపేట, మందపల్లితో పాటు పలు గ్రామాలను ముంచేసింది. ఆ క్షణంలో అప్రమత్తమై జనాలను గట్టుపైకి చేర్చకపోయి ఉంటే.. జరిగే ప్రమాదం ఊహించుకోవడానికే భయమేస్తుంది. 


ఆ రాత్రి జాగరణ చేశాం

తెల్లారితే కార్తీక పౌర్ణమి. మాఊరి సమీపంలోని పురాతన శివాలయాల్లో అభిషేకాలు, అన్నదానాలు చేయాలని సరుకుల కోసం మా తమ్ముళ్లతో కలిసి రాజంపేటకు వెళ్లాను. గురువారం పగలంతా భారీ వర్షం పడింది. రాత్రికి వర్షాలు ఉధృతమయ్యాయి. వంకలు, వాగులు పొంగుతున్నాయి. రాత్రి 9.30 గంటల సమయంలో చెయ్యేరు వరద ఉధృతమైందంటూ మా ఊరి నుంచి ఫోన్‌ వచ్చింది. రాత్రి 10.30 గంటలకు పులపత్తూరుకు చేరుకున్నా. అప్పటికీ ఊరు ప్రశాంతంగానే ఉంది. ఊరు అంచుల వరకు నది ప్రవహిస్తోంది. ఇలాంటి వరదలు గత ఏడాది చూశాం. అంతకుముందూ చూశాం. ఊరిపైకి మాత్రం వరద రాలేదు. ఎక్కడో తెలియని భయం. సచివాలయం దగ్గరే వరద అంచనా వేస్తూ గడుపుతున్నాం. ఓ పక్క వర్షం.. మరోపక్క చెయ్యేరు ఉగ్రరూపం చూస్తుంటే.. కునుకు కూడా తీయలేని పరిస్థితి. జాగరణ చేశాం. 


ఆ క్షణం భయమేసింది

అప్పుడు సమయం (19వ తేదీ, శుక్రవారం) తెల్లవారుజామున 4.30 గంటలవుతోంది. వీఆర్‌ఏ పెంచలయ్య నా దగ్గరకు వచ్చాడు. అన్నా.. అన్నమయ్య ప్రాజెక్టు లీకేజీ అవుతుందంటా.. నాకు ఫోన్‌ వచ్చిందని చెప్పాడు. ఎందుకో ఆ క్షణం భయమేసింది. వీఆర్‌ఏకు కాల్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌కు తిరిగి పోన్‌ చేశా. ఆ నెంబరు రిటైర్డు లష్కర్‌ రామయ్యది అనుకుంటున్నా.. ఆ క్షణంలో రామయ్య ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడో.. ఆయన కొడుకు ఫోన్‌ ఎత్తాడో తెలియదు.. అన్నా అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట తెగిపోయింది.. ఏ క్షణమైనా ఊరిని ముంచేయచ్చు.. జనం జాగ్రత్త అంటూ.. అవతలి నుంచి సమాధానం. ఒక్కసారి కాళ్లు, చేతులు ఆడలేదు. గుండెలో తెలియని భయం. నది ఒడ్డునే ఉన్న దళితవాడ కొట్టుకుపోక తప్పదు. క్షణం ఆలస్యం చేయలేదు. ఆ కాలనీ వైపు పరుగులు తీశా. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. గట్టుపైకి పదండంటూ కేకలు వేస్తూ ఆ కాలనీ మొత్తం తిరిగి గట్టుపైకి పంపించాను. అక్కడి నుంచి ఊరంతా ఇతర కాలనీలకు వెళ్లి జనాలను అందరినీ గట్టుపైకి చేర్చాం. అప్పటికే వరద ఊళ్లోకి వచ్చేసింది. 


ఆ మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి..

జనాన్ని కాపాడాలనే ఆత్రుతతో అయిన వాళ్లను మరిచిపోయాను. మా ఇంట్లో ఉన్న వాళ్లు ఒక్కసారిగా గుర్తుకువచ్చారు. అప్పటికే ఊళ్లో ఐదారుగుడుల మేర నీళ్లు వచ్చాయి. ఆ నీటిలోనే ఈదుకుంటూ మా ఇంటికి చేరుకున్నా. అతికష్టం మీద బాత్‌రూమ్‌ ఎక్కాను. కిటికిలో నుంచి లోపల ఉన్న మా తాత భీమచంగల్‌రెడ్డి, చిన్నమ్మలు భీమ పద్మావతమ్మ, భీమ విజయమ్మలను పిలిచాను. వరద క్రమక్రమంగా పెరుగుతోంది. ఆ సమయంలో... ‘నాన్నా ఊపిరి ఆడడం లేదు.. బయటికి వచ్చే పరిస్థితీ లేదు.. నీవు మాకోసం ఆరాట పడకుండా నీ ప్రాణాలు కాపాడుకో’ అన్న మా చిన్నమ్మ మాటలే వినిపించాయి. రెండు క్షణాల్లో ఆ మాటలు కూడా మూగబోయాయి. పై నుంచి ఉప్పెనలా వస్తున్న వరదను చూసి మిద్దె ఎక్కాను. 70-80 ఏళ్ల నాటి ఇల్లు అది. వరద ఉధృతికి కదులుతోంది. ఏ క్షణమైనా కూలిపోవచ్చన్న భయమేసింది. వరద తగ్గడంతో నేను క్షేమంగా బయటపడినా అయిన వారిని కోల్పోయాను. ఓ ప్రజాప్రతినిధిగా ప్రజలను కాపాడానన్న సంతృప్తి ఉన్నా.. తాత, చిన్నమ్మలను కోల్పోవడంతో కన్నీళ్లు ఆగలేదు. చిన్నమ్మ మృతదేహం ఇంట్లో దొరికితే.. తాత మృతదేహం నారాయణ నెల్లూరు సమీపంలో, మరో చిన్నమ్మ శవం ఆస్పత్రి మార్చురీలో లభించింది. ‘నాన్నా ఊపిరి ఆడడం లేదు.. నీవెళ్లిపో’ అన్న చిన్నమ్మ మాటలు ఇప్పటికీ చెవిలో వినిపిస్తున్నాయి. నా ఇల్లు కొంచెం గుట్టపైన ఉండటంతో మా కుటుంబం క్షేమంగా బయటపడింది.


సర్వం కోల్పోయాం

జనంతో పాటు నేను, మా చిన్నమ్మ వాళ్ల కుటుంబం భారీగా నష్టపోయాం. చెయ్యేరు నది తీరంలోని మూడెకరాల పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మా చిన్నమ్మ కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడింది. అంతేకాదు.. మా ఊరి పక్కనే శివాలయాన్ని పదేళ్ల క్రితం రూ.15 లక్షలతో పునర్నిర్మాణం చేయించా. ఈ రోజు ఆ ఆలయం ఆనవాళ్లు కూడా కోల్పోయింది. చెయ్యేరు మిగిల్చిన నష్టాన్ని 


ఏ మాటలతో చెప్పాలో అర్థం కావడం లేదు. 

చెయ్యేరు వరద ఉప్పొంగుతోంది. అప్పుడు సమయం తెల్లవారుజాము నాలుగున్నర గంటలు. అన్నమయ్య ప్రాజెక్టు లీక్‌ అవుతోందని ఫోన్‌ వచ్చిందంటూ వీఆర్‌ఏ పెంచలయ్య నా దగ్గరకు వచ్చాడు. ఆ ఫోన్‌ నెంబరు రిటైర్డు లష్కర్‌ రామయ్యది. తిరిగి కాల్‌ చేస్తే.. అన్నమయ్య డ్యామ్‌ మట్టి కట్ట తెగిపోయింది.. ఊరంతా గట్టుపైకి చేరండంటూ సమాధానం. ఆ క్షణం జనమే గుర్తు వచ్చారు. తొలుత దళితవాడకు పరుగులు పెట్టా. అరగంటలో ఊరందరినీ అప్రమత్తం చేసి గట్టుపైకి చేర్చాం. జనాన్ని కాపాడాలనే ఆత్రుతతో అయిన వాళ్లను మరిచిపోయాను. 


అప్పటికే ఊళ్లో ఐదారుగుడుల మేర నీళ్లు వచ్చాయి. నీటిలోనే ఈదుకుంటూ ఇంటికి చేరుకున్నా. అతికష్టమ్మీద బాత్‌రూమ్‌ ఎక్కాను. కిటికిలో నుంచి లోపల ఉన్న మా తాత, చిన్నమ్మలను పిలిచాను. ‘నాన్నా ఊపిరి ఆడడం లేదు.. బయటికి వచ్చే పరిస్థితి లేదు.. నీవు మాకోసం ఆరాట పడకుండా నీ ప్రాణాలు కాపాడుకో’ అన్న మా చిన్నమ్మ మాటలు వినిపించాయి. రెండు క్షణాల్లో ఆ మాటలూ మూగబోయాయి. వరద తగ్గడంతో నేను క్షేమంగా బయటపడినా.. అమ్మానాన్నలాంటి చిన్నమ్మలు, తాతను కోల్పోవడంతో కన్నీళ్లు ఆగలేదు. ఆ బాధ వెంటాడుతోంది. 

-పులపత్తూరు సర్పంచ్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

Advertisement
Advertisement