దాడులకు నా బిడ్డ భయపడింది

ABN , First Publish Date - 2021-10-27T08:43:46+05:30 IST

దాడులకు నా బిడ్డ భయపడింది

దాడులకు నా బిడ్డ భయపడింది

గాయాన్ని మాన్పడానికే మాల్దీవులకు

కేసులకు భయపడేది లేదు: పట్టాభి


విజయవాడ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదు. దాడులకు అంతకన్నా భయపడేది లేదు’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ప్రకటించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం పట్టాభి మీడియాకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. విజయవాడ నుంచి మాల్దీవులకు వెళ్లడానికి గల కారణాలను వివరించారు. ‘‘గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ఉద్యమంలో నేను క్రియాశీలకంగా ఉన్నాను. రెండున్నరేళ్లుగా అన్ని ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కక్షపూరితంగా నాపై మూడుసార్లు దాడులు చేశారు. నా ఇంటిపై దాడి చేయడంతోపాటు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు నా ఎనిమిదేళ్ల కుమార్తె భయకంపితురాలైంది. బాధ్యత గల తండ్రిగా బిడ్డ, భార్యతో కొత్త ప్రదేశానికి వెళ్లాను. దీనికి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చాలా బాధకరం, అమానవీయం. తిరిగి వచ్చిన తర్వాత మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటా. నాపై నమోదు చేసిన కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటా’’ అని పట్టాభి పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-27T08:43:46+05:30 IST