‘స్థానిక పోరు’లో వైసీపీ, టీడీపీ ఓట్ల తేడా 2 శాతమే!

ABN , First Publish Date - 2021-11-18T08:18:08+05:30 IST

‘స్థానిక పోరు’లో వైసీపీ, టీడీపీ ఓట్ల తేడా 2 శాతమే!

‘స్థానిక పోరు’లో వైసీపీ, టీడీపీ ఓట్ల తేడా 2 శాతమే!

ఇది మా పార్టీకి ప్రమాదకర సంకేతం

జగన్‌రెడ్డికి నాపై ప్రేమ, పగ రెండూ!

వైసీపీ ఎంపీ రఘురామ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి, ప్రధాన విపక్షం టీడీపీకి మధ్య కేవలం 2ు ఓట్ల వ్యత్యాసమే ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీకి ప్రమాదకరమైన సంకేతాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు తనపై ప్రేమ, పగ రెండూ ఉన్నాయని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌రెడ్డికి తనపై ప్రేమ ఉంది కాబట్టే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయకుండా కొనసాగిస్తున్నారని...తనపై పగ ఉంది కాబట్టే ఎంపీ పదవి నుంచి అనర్హుడిని చేయడానికి వెంటబడుతున్నారని చెప్పారు. బీజేపీలో తాను చేరతానో, లేదో తన ముఖ కవళికలను గమనిస్తే తెలిసిపోతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కుప్పం  ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు సహకరించిన తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలని ఎద్దేవా చేశారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ), రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) అధికారులు రుణాల వసూలు కోసం ఢిల్లీ నుంచి ఏపీకి వెళ్లడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు వర్షాలను కూడా లెక్క చేయకుండా పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారన్నారు.  వివేకా హత్య కేసులో దోషులు ఫలానా వారని నిరూపిస్తే కడప జిల్లాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రఘురామ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు సీబీఐని బెదిరించేవిగా ఉన్నాయన్నారు. అసలు దోషులెవరో నిరూపితమైతే 9 మంది కాదు, సీఎం సహా 151 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2021-11-18T08:18:08+05:30 IST