తప్పు జరిగింది మిత్రమా.. YSRCP ఎమ్మెల్యేల్లో అంతర్గత చర్చ!

ABN , First Publish Date - 2021-11-21T08:03:04+05:30 IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి అనధికారికంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలూ..

తప్పు జరిగింది మిత్రమా.. YSRCP ఎమ్మెల్యేల్లో అంతర్గత చర్చ!

  • కుటుంబాల జోలికి  వెళ్లాల్సింది కాదేమో!
  • సభలో పరిణామాలపై లోలోపల అసహనం 


అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి అనధికారికంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలూ, హావభావాలపై ఆపార్టీ నేతల్లోనే కంపరం మొదలైంది. శాసనసభలో పరిణామాలపై బాహాటంగా పెదవి విప్పకపోయినా.. ప్రైవేటు సం భాషణల్లో మాత్రం ‘తప్పు జరిగింది మిత్రమా’ అని కొందరు వైసీపీ ఎమ్మెల్యే లు వ్యాఖ్యానిస్తున్నారని తెలిసింది. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనేందుకు చాలా మార్గాలున్నా, అవన్నీ వదిలేసి ఆయన భార్యను కించపరచేలా మాట్లాడడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా డీఎన్‌ఏ పరీక్ష లు చేయాలంటూ మూర్ఖంగా మాట్లాడడం ఏమిటని అధికార పక్ష ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. చంద్రబాబు గతంలో చేసిన దానికి ఇప్పుడిలా అనుభవిస్తున్నారంటూ సమర్థించుకునే ప్రయత్నం చేయడాన్ని కూడా వారు తప్పుబడుతున్నారు.


శుక్రవారం శాసనసభ సమావేశం ముగిశాక..  కొందరు మంత్రులు, శాసనసభ్యులు.. చంద్రబాబు వయసును ప్రస్తావిస్తూనే.. విధి బలీయమైనదంటూ వ్యాఖ్యానించడం.. గతంలో చేసిన తప్పులకు అనుభవిస్తున్నారంటూ హేళనగా మాట్లాడడాన్ని కొందరు నేతలు తప్పుపడుతున్నా రు. ‘‘ఒకవైపు తామేమీ అనలేదంటూనే.. మరోవైపు గతంలో చేసిన దానికి ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం ద్వారా.. పరోక్షంగా తాము కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడామని అంగీకరించినట్టయింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన.. అవమానకరమైన.. కుటుంబాలను విచ్ఛిన్నం చేసేరీతిలో ఎంతో ప్రచారం జరుగుతుంటుంది. కానీ, ఆ ధోరణిని ఏకంగా దేవాలయంలాంటి సభలో ప్రదర్శిస్తే ఎలా?’’ అని ప్రైవేటు చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారం వైసీపీకి రాజకీయంగా ఎంత వరకూ మేలు చేస్తుందో తెలియదు కానీ.. ప్రజల్లో మాత్రం పార్టీపై వ్యతిరేకతను పెంచినట్టు వైసీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తేల్చేస్తున్నారు.



Updated Date - 2021-11-21T08:03:04+05:30 IST