కడగండ్లు!

ABN , First Publish Date - 2021-11-22T08:09:50+05:30 IST

వాయుగుండం ప్రభావంతో అతలాకుతలమైన జిల్లాలకు కడగండ్లు తప్పడం లేదు. ముంపు ప్రాంతాల్లోని బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు..

కడగండ్లు!

ముంపు భయంతో ప్రజలు బిక్కుబిక్కు 

భారీ వర్షాలకు చెరువులు, రోడ్లు ధ్వంసం 

వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

తిరుపతిలో ప్రమాదకరంగా రాయలచెరువు 

ఏ క్షణమైనా గండిపడే అవకాశం

కట్ట నుంచి లీకవుతున్న నీరు 

హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు 

ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి కొండలపైకి...

కోవూరు వద్ద జాతీయ రహదారికి భారీ గండి

విజయవాడ- చెన్నై మధ్య రాకపోకలకు బ్రేక్‌ 

నెల్లూరు-పడుగుపాడు పరిధిలో ట్రాక్‌ ధ్వంసం

వరద ఉధృతితో సాగని పునరుద్ధరణ పనులు 

కడప జిల్లాలో సాయం కోసం ఎదురుచూపులు

ప్రకాశంలో వెలిగొండ ఫీడర్‌ కాలువకు గండి


వాయుగుండం ప్రభావంతో అతలాకుతలమైన జిల్లాలకు కడగండ్లు తప్పడం లేదు. ముంపు ప్రాంతాల్లోని బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భారీవర్షాలకు నిండిన చెరువులకు గండ్లు పడటంతో దిగువ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలుచోట్ల రహదారులకు సైతం భారీ గండ్లు పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరడంతో పునరుద్ధరణ పనులకు తీవ్ర ఆటంకంగా మారింది. వర్షాల కారణంగా తిరుపతి సమీపాన రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఎగువనుంచి నీటి ప్రవాహం పెరగడంతో నిండుకుండలా మారింది. శనివారమే చెరువు కట్ట తెగిందన్న ప్రచారం జరిగింది. దీంతో చెరువు కింద ఉండే దాదాపు 20గ్రామాలవారు భయాందోళనకు గురయ్యారు.


అయితే మొరవ కాలువను యంత్రాల సాయంతో వెడల్పు చేసి నీటిని వదిలివేయడంతో చెరువులోకి వచ్చేనీరు తగ్గుముఖం పడుతుందని రెవెన్యూ యంత్రాంగం హామీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆదివారం చెరువు కట్ట లీకవడం ప్రారంభమైంది. ఇది గుర్తించిన అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. దిగువ గ్రామాలను ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా గండిపడే అవకాశం ఉందన్న భయంతో ఊళ్లకు, ఊళ్లకు ఖాళీచేసి వెళ్లిపోయారు. మరికొందరు పక్కనే ఉన్న చిన్నచిన్న కొండలు, గుట్టలు ఎక్కి బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకొందరు పునరావాస కేంద్రాల బాటపట్టారు. ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, కలెక్టరు హరినారాయణ్‌, ఎస్పీ వెంకటఅప్పలనాయుడుతో పాటు ఇరిగేషన్‌ అధికారులు చెరువును పరిశీలించారు. లీకేజీ నివారణ చర్యలు మొదలుపెట్టారు. లీకవుతున్నచోట యువత సహాయంతో యంత్రాంగం ఇసుక బస్తాలతో అడ్డుపెట్టే ప్రయత్నం చేసింది. మరికొన్నిచోట్ల కూడా చెరువు కట్ట లీకవుతున్నట్టు తెలుస్తోంది. 


నెల్లూరులో రోడ్లకు గండ్లు 

వరద ముంపు నుంచి నెల్లూరు జిల్లా ఇంకా బయటపడలేదు. ఎగువ నుంచి పెన్నాకు భారీగా వరద పోటెత్తుతునే ఉంది. దీంతో నెల్లూరు నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీ, గాంధీ గిరిజన కాలనీలు నీటిలోనే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వేసిన జగనన్న లేఅవుట్లు కనిపించడం లేదు. పెన్నా వరద నీరు భారీగా చేరి కోవూరు చెరువుకు గండి పడటంతో కోవూరు పూర్తిగా నీట మునిగింది. వరద ఉధృతికి పడుగుపాడు- నెల్లూరు మధ్య ఽధ్వంసమైన రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. పెన్నా వరద ఉధృతితో భగత్‌సింగ్‌ కాలనీ సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి శనివారం అర్ధరాత్రి భారీ గండి పడి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఒకవైపు రహదారిని పునరుద్ధరించి ఆదివారం మధ్యాహ్నానికి వాహనాలను పంపారు. వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద బాంబే హైవేపై వరద ఉధృతి పెరగడంతో కడప జిల్లా వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, సోమశిల జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 1.70లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో దిగువకు నీటి విడుదలను 1.44 లక్షల క్యూసెక్కులకు తగ్గించారు. నెల్లూరులోని బాలుర పాలిటెక్నిక్‌ కాలేజీ పూర్తిగా నీట మునిగింది. వరద నీటిలో చిక్కుకొని మృతిచెందిన ఓ విద్యార్థి మృతదేహాన్ని ఆదివారం వెలికితీశారు. సోమశిల జలాశయం వద్ద ఆదివారం రెండు మృతదేహాలను గుర్తించారు. వీరు కడప జిల్లాలో గల్లంతైనవారని అనుమానిస్తున్నారు. 


తెగిన వెలిగొండ ఫీడర్‌ కాలువ కట్ట  

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ఫీడర్‌ కాలువకు మళ్లీ గండి పడింది. మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన మోస్తరు వర్షానికి కటకానిపల్లి వద్ద కాలువ కట్ట తెగింది. దిగువన ఉన్న 40 ఎకరాల్లో మిర్చి నీట మునిగింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 


వరద గాయానికి మందేదీ?! 

వరదకు చితికిన పల్లెసీమల్లో రోడ్లు లేవు.. నిలువ నీడలేదు.. రాత్రి కరెంట్‌ లేదు.. తాగేందుకు నీరు దొరకదు.. కడప జిల్లాలో వరద ఉధృతికి పలు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా రెండు రోజులైనా సహాయక చర్యలు లేవు.. ఎలా ఉన్నారని పలకరించే నాథుడే లేడంటూ రాజంపేట మండలం తొగూరుపేట వాసులు కన్నీరు పెడుతున్నారు. పులపత్తూరు, మందపల్లె, రామచంద్రాపురం, గుండ్లూరు తదితర గ్రామాల్లో 39మందికి పైగా వరదకు గల్లంతైతే ఇప్పటికి గుర్తించిన శవాలు 12మాత్రమే. అధికారులు మాత్రం 9మంది మృతి చెందారని, 12మంది గల్లంతయ్యారని ప్రభుత్వానికి నివేదిక పంపారు. 


బాధితులకు అండగా నిలవండి: సీఎం

భారీవర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం జగన్‌ నిర్దేశించారు. వరద ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, స్థానికంగానే ఉండి, సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. 


సీమలో రికార్డు వర్షపాతం  

వాయుగుండం తీరందాటిన నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమలో కుంభవృష్టి వర్షాలు కురిశాయి. దీంతో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అంటే అక్టోబరు 1నుంచి ఆదివారం వరకు ఏపీలో 245.9 మి.మీ.లకు గాను 342.1 మి.మీ.లు కురిసి సాధారణం కంటే 39 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాయలసీమ నాలుగు జిల్లాల్లో 186.4మి.మీ.కు గాను 406.3 మి.మీ. వర్షపాతం కురిసి సాధారణం కంటే 118 శాతం ఎక్కువగా నమోదైంది.  


నిండుకుండల్లా జలాశయాలు 

భారీవర్షాలు, వరదల నీటితో నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమశిల ప్రాజెక్టులో 325.73 అడుగులు, కండలేరులో 271.78, సర్వేపల్లి డ్యాంలో 25.77, స్వర్ణముఖి జలాశయంలో 30.35, కనిగిరి రిజర్వాయర్‌లో 96.43 అడుగుల నీరు చేరింది. గండికోట ప్రాజెక్టులో 693.73, వెలిగల్లులో 1,374.18, చిత్రావతిలో 976.35, మైలవరంలో 640.42, బుగ్గవంకలో 593.27, పెడ్డేరులో 1,581,52, కల్యాణి డ్యాంలో 895.50, కాళింగిలో 217, ఎన్టీఆర్‌ జలాశయంలో 964.656 అడుగుల మేర నీటి మట్టాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 


శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఆదివారం సాయంత్రం శ్రీశైలం జలాశయం వద్ద 1,01,487 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం నీటిమట్టం గరిష్ఠ నీటిమట్టం 885అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 857.50 అడుగుల వద్ద 98.68 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. 


పెరుగుతున్న పంట నష్టం

భారీవర్షాలు, వరదలతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పంట నష్టాల అంచనా పెరుగుతోంది. నీటి ముంపు తొలగే కొద్దీ నష్టం తీవ్రత బయట పడుతోంది. ఈ నాలుగు జిల్లాల్లో 6.32లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు తాజాగా మరో 43వేల ఎకరాల్లో పంటలు పాడైనట్లు గుర్తించారు. దీంతో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 6,75,165 ఎకరాలకు పెరిగింది. కడప 3,92,788, నెల్లూరు 30,550, చిత్తూరులో 24,040 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ఆదివారం పేర్కొన్నారు. 


కుప్పకూలిన పాపాఘ్ని బ్రిడ్జి 

భారీవర్షాలతో పాపాఘ్నికి వరద పోటెత్తడంతో కడప జిల్లా కమలాపురం సమీపంలోని పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన శనివారం రాత్రి కుప్పకూలింది. దీంతో కడప నుంచి కమలాపురం, ఎర్రగుంట్ల, అనంతపురం వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎన్‌హెచ్‌ కడప ఈఈ ఓబులరెడ్డి వంతెనను పరిశీలించారు. 


గుడి నుంచి గూటికి..!

కార్తీక దీపారాధన సందర్భంగా శుక్రవారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయానికి భక్తులు భారీగా చేరుకున్నారు. అప్పటి నుంచి భారీ వర్షాలు, పెన్నా నదికి వరద పోటెత్తడంతో వారంతా ఆలయంలోనే ఉండిపోయారు. ఆదివారం వరద తగ్గుముఖం పట్టడంతో అక్కడి నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. అయితే, పెనుబల్లి వద్ద వరద తాకిడికి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రోడ్డుకు దూరంగా ఉన్న పొలంలో నిలిచిన నడుములోతు నీళ్లలోనే అవస్థలు పడుతూ ఒడ్డుకు చేరుకోవాల్సి వచ్చింది.

- బుచ్చిరెడ్డిపాళెం

ట్రాక్‌లపై ‘తెగించి ముందుకు..!

నెల్లూరు జిల్లాలో భారీ వరద నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. శనివారం రైల్వే ట్రాక్‌ ధ్వంసం కాగా ఎక్కడి రైళ్లను అక్కడే ఆపేశారు. ఆదివారం జాతీయ రహదారి కూడా తెగిపోవడంతో రోడ్డు రవాణా నిలిచిపోయింది. దీంతో నెల్లూరులో చిక్కుకున్న దూరప్రాంత ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పైనే నడుచుకుంటూ నెల్లూరు దాటి జాతీయ రహదారి మీదకొచ్చారు. అక్కడి నుంచి కొన్ని వాహనాలు పట్టుకొని తమ ప్రాంతాలకు పయనమయ్యారు.

- నెల్లూరు, ఆంధ్రజ్యోతి




4 రోజులుగా అర్ధాకలితో

తిరుపతిలోని ఓ ముస్లిం కుటుంబం (పిల్లలు ఏడుగురు, పెద్దలు నలుగురు) నాలుగైదు రోజులుగా జలదిగ్భందంలో చిక్కుకొని కష్టాలు పడుతోంది. దా తలు ఇచ్చే ఆహారపొట్లాలతో బిడ్డలకు ఆకలి తీరక సాయం కోసం అర్రులు చాస్తోంది. నాలుగు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటే ఇంత వరకు నాయకులు, అధికారులు పట్టించుకోలేదని తిరుపతి పూలవానిగుంట వాసులు బాషా, నజీమాభాను దంపతులు ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయారు.


తండ్రి కళ్లెదుటే కొట్టుకుపోయారు

మాండవ్యనదిలో పడి అక్కాతమ్ముడు మృతి     

కుమార్తె పుట్టిన రోజు నాడే తీవ్ర విషాదం

చిన్నమండెం, నవంబరు 21: పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని ఆశపడ్డారు. తండ్రి కేకు కొనిస్తానని చెప్పడంతో ఆ అక్కాతమ్ముడు సంతోషంగా బైక్‌ ఎక్కా రు. కానీ.. మాండవ్యనది రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు వారి ఆనందాన్ని హరించివేసింది. కడప జిల్లా చిన్నమండెం మండలంలోని ఎర్రగుట్టపల్లె వద్ద ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. టి.చాకిబండకు చెందిన షేక్‌ అమీర్‌బాషాకు కుమార్తె సాదియా (19), కుమారుడు జాసిర్‌ (12) ఉన్నారు. ఆదివారం సాదియా పుట్టినరోజు కావడంతో రాయచోటిలో కేకు కొనేందుకు కొడుకు, కూతురుతో కలిసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మాండవ్యనది బ్రిడ్జిపై ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పిల్లలను బైక్‌ నుంచి దించాడు. సాదియా, జాసిర్‌ ఒకరినొకరు పట్టుకొని నది దాటుతుండగా సాదియా కింద పడిపోయింది. ఈ క్రమంలో జాసిర్‌ను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. కళ్ల ముందే కన్నబిడ్డలు కొట్టుకుపోతుంటే బాషా గుండెలవిసేలా రోదించాడు. సాదియా మృతదేహం ఉప్పరపల్లె, జాసిర్‌ మృతదేహం గొర్లముదివేడు వద్ద లభించాయి.



                                                                       

Updated Date - 2021-11-22T08:09:50+05:30 IST