వరద సాయంగా తక్షణమే వెయ్యి కోట్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-11-25T08:28:08+05:30 IST

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం ఏర్పడిందని, తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు....

వరద సాయంగా తక్షణమే వెయ్యి కోట్లు ఇవ్వండి

వరద ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలను పంపండి

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకుసీఎం జగన్‌ లేఖలు


అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం ఏర్పడిందని, తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు బుధవారం వేర్వేరుగాలేఖలు రాశారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తి తీవ్రంగా ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైందని, చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని వివరించారు. తిరుపతి, తిరుమల, మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయని, గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లిందని, 196 మండలాల్లో నష్టం జరిగిందని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయని, చెరువులకు గండ్లు పడడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని లేఖలో జగన్‌ విజ్ఞప్తి చేశారు.


సాయం పంపిణీలో తప్పు జరగటానికి వీల్లేదు: సీఎం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం సమీక్షించారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఆరా తీశారు. అంశాల వారీగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఇస్తున్న సాయం వరద ప్రాంత బాధితులందరికీ అందాలని సీఎం ఆదేశించారు. సాయం పంపిణీలో ఎక్కడా తప్పు జరగటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ‘వరద ప్రాంతాల్లో తాగునీటి విషయంలో శరవేగంగా చర్యలు తీసుకోవాలి. అన్నమయ్య ప్రాజెక్ట్‌ కొట్టుకుపోయినందున తాగునీటి కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. రానున్న రోజుల్లోనూ ఇబ్బంది రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. తాగునీరు, కరెంటు విషయాల్లో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ రాకూడదు. ఈ అంశాలను సీరియ్‌సగా తీసుకోవాలి. ప్రతి రోజూ వ్యక్తిగతంగా కలెక్టర్లు పర్యవేక్షించాలి. శానిటేషన్‌పై బాగా శ్రద్ధ పెట్టాలి. 104పై బాగా ప్రచారం చేయాలి. ఎవరికైనా ఏదైనా అందకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా 104కు కాల్‌ చేస్తే వెంటనే స్పందించాలి. వారికి సహాయాన్ని అందించాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. చనిపోయిన పశువులకు వెంటనే పరిహారం అందించాలి. పశువులకు వ్యాక్సినేషన్‌, దాణా కూడా పంపిణీ చేయాలి. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారాన్ని 3-4రోజుల్లో అందించాలి. పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.95వేల పరిహారంతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80 వేలు మంజూరు చేయాలి. పంటల నష్టానికి ఎన్యూమరేషన్‌ చురుగ్గా సాగాలి. రోడ్ల పునరుద్ధరణపై వెంటనే నివేదికలివ్వాలి. నివేదికల ప్రకారం వెంటనే పనులు ప్రారంభించాలి. ఈ పనులకు ప్రాధాన్యం ఇచ్చి, నిధులు మంజూరు చేయాలి. నెల రోజుల్లోగా శాశ్వత పనులు మంజూరు కావాలి. కలెక్టర్లతో సమన్వయం చేసుకుని, వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఈ లోగా రవాణాకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక పనులు వెంటనే చేపట్టాలి. చెరువులు, గట్లు పునరుద్ధరణ పనులు కూడా వెంటనే మొదలవ్వాలి’ అని సీఎం ఆదేశించారు.


ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భద్రతపై దృష్టి..

రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలని,  ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టాలని సంబంధింత అధికారులను సీఎం ఆదేశించారు. ‘డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలను బయటకు తీయాలి. ప్రస్తుత నీటి విడుదల సామర్థ్యం, గరిష్ఠ వరద ప్రవాహంపై అంచనాలను మరోసారి పరిశీలించి, నివేదికలు తయారు చేయాలి. ఉదాసీనత వల్ల ఇప్పటి వరకు పనులు పెండింగ్‌లో ఉన్న డ్యాంల భద్రతపైనా దృష్టి పెట్టాలి. అన్నమయ్య లాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కూడదు. మళ్లీ ఇలాంటి వరదలు వస్తే, తట్టుకునేలా అన్నమయ్య ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాలి. రీడిజైన్‌ చేయాలి’ అని ఆదేశించారు.  


రానున్న వర్షాలపై జాగ్రత్తలు తీసుకోవాలి.. 

ఈనెల 26 నుంచి మళ్లీ అవే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను  సీఎం ఆదేశించారు. 27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నందున వర్షసూచనలపై కలెక్టర్లు నివేదికలు పంపాలని, దానివల్ల ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని సీఎం పేర్కొన్నారు. సమీక్షలో సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-25T08:28:08+05:30 IST