ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2021-06-23T23:36:35+05:30 IST

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా

విజయవాడ: ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసీరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీ అక్రమ తవ్వకాలతో కడప జిల్లాలోని ఇడుపులపాయ, వేంపల్లె మండలం, పులివెందుల నియోజకవర్గంలోని మరికొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోనున్నాయని ఆయన పేర్కొన్నారు. భూగర్భ జలాలు ఎక్కువగా తోడేసిన గ్రామాలు రాష్ట్రంలో 387 ఉన్నాయని, అందులో కడప జిల్లాలో 63 ఉన్నాయని, వాటిలో వేంపల్లె ఒకటి అని ఆయన తెలిపారు. 2021 జూన్ 11న జారీ చేసిన జీఓ నెంబర్ 38 ప్రకారం పై గ్రామాల పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉందన్నారు. కానీ వేంపల్లె పక్క గ్రామమైన ఇడుపులపాయ పేరుతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, ఇది వాల్టా చట్టానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. 


జేపీ కంపెనీ మార్గదర్శకాల ప్రకారం ఒక మీటర్ లోతు వరకే తవ్వాల్సి ఉండగా 3 మీటర్ల వరకు ఇసుక తోడేస్తున్నారని ఆయన ఆరోపించారు. పగటిపూట మాత్రమే ఇసుక తవ్వాల్సి ఉండగా రాత్రివేళ  కూడా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మనుషులు, చిన్న యంత్రాలతో గానీ ఇసుక తవ్వాలని, కానీ హిటాచి లాంటి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో వేంపల్లె మండలంలో తాగు, సాగునీటి, పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయని తులసీరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-06-23T23:36:35+05:30 IST