ఖాతాదారులకు సేవలను విస్తృతం చేస్తాం

ABN , First Publish Date - 2021-05-07T03:16:36+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖాతాదార్లకు ఇబ్బందులు కలగకుండా బ్యాంక్‌ సేవలను విస్తృతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాం క్‌ (ఏపీజీవీబీ) చైర్మన్‌ కే. ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు.

ఖాతాదారులకు సేవలను విస్తృతం చేస్తాం
నగదు డ్రా చేస్తున్న చైర్మన్‌

 ఏపీజీవీబీ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌

చుంచుపల్లి, మే 6: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖాతాదార్లకు ఇబ్బందులు కలగకుండా బ్యాంక్‌ సేవలను విస్తృతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాం క్‌ (ఏపీజీవీబీ) చైర్మన్‌ కే. ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు. గురువారం మండలంలోని విద్యానగర్‌ కాలనీ పంచాయతీలోగల ఏపీజీవీబీ రీజియన్‌ కార్యాలయం వద్ద జిల్లా మొబైల్‌ ఏటీఎంలో నుంచి నగదును డ్రా చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ... ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 15 మొబైల్‌ ఏటీఎం వాహనాలు ఖాతాదార్ల సౌకర్యార్ధం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 3 ఉన్నాయని, రాబోయే రోజుల్లో సుమారు పది మొబైల్‌ ఏటీఎంలను అందుబాటు లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఏపీజీవీబీ మొత్తం 42 బ్యాంక్‌ బ్రాంచీలు ఉండగా, అందులో 3.67లక్షల ఖాతాదార్లకు సేవలందిస్తున్నా మన్నారు. ఖాతాదారుల్లో స్వయం సహాయక సంఘాలు, రైతులు ఎక్కువ మంది ఉన్నారని, వారికి గ్రామీణ స్థాయిలో కూడా ఏపీజీవీబీ సేవలందించే ముఖ్య ఉద్దేశ్యంలో భాగంగా ఈ మొబైల్‌ ఏటీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ మొబైల్‌ ఏటీఎంల వద్ద ఖాతాదారులు తమ ఎకౌంట్‌లో నగదును జమా, విత్‌ డ్రా చేసుకోవచ్చని, కొత్త ఖాతాదారులు బ్యాంక్‌ ఖాతాను సైతం తెరుచుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. అందు కోసం బ్యాంక్‌ మిత్ర కస్టమర్‌ సర్వీసెస్‌ అధికారి అందుబాటులో ఉంచు తున్నామన్నారు. ఖాతాదార్లకు బ్యాంకింగ్‌ సేవలు అతి చేరువ చేసే ఉద్దేశ్యంలో భాగంగా కరోనా విలయ తాండ వం చేస్తున్న తరుణంలో ఈ మొబైల్‌ ఏటీఎం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ నిర్మూలించేందుకు ఖాతాదారులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ బ్యాంక్‌ అధికారులకు, సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ రీజనల్‌ మేనేజర్‌ ఐ.శ్రీకాంత్‌, సీనియర్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) కత్తి శ్రీనివాస్‌, సీనియర్‌ మేనేజర్‌ బిజినెస్‌ సూరిరెడ్డి, విద్యానగర్‌ బ్రాంచి మేనేజర్‌ అశోక్‌ కుమార్‌, అధికారులు డి.అవినాష్‌, సంతోష్‌, పవన్‌, చౌదరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T03:16:36+05:30 IST