పురవురాలు

ABN , First Publish Date - 2020-11-02T06:15:10+05:30 IST

పురవురాలు

పురవురాలు

గుంపులు గుంపులుగా 

చవితి చందాలడిగే పిల్లల్లా 

పూల పాదాలతో, గుబురు గంతులతో 

కూడళ్లను సమ్మోహనపరుస్తాయి

మాట్లాడవు, పోట్లాడవు

చల్లే నూకల కోసం దిగుతాయి

సమూహంగానే, ఏకాకులుగా కాదు 

ఆ మాట కొస్తే కాకులు కూడా 

నీలి హారాలే 


బూడిద రంగు బుడిబుడి నడకలు 

రెక్కల పగటి చుక్కలు 

నగరానికి ప్లాటినం వడ్డాణాలు

అడగడుగునా సమష్టి రూపాలు

కనీస డిమాండ్ల కోసం 

కట్టగట్టే కార్మికుల్లా... 

బస్సులు, కార్లు, బైకులు, ఆటోలు 

ఎంత రద్దీలోనైనా, రొదలోనైనా 

ఏకాగ్రత పోతపోసిన దృశ్యాలు 


అప్పుడప్పుడూ 

పురానాపూల్‌ వంతెన మీది 

తీగల పైనా బారులు 

జనానికి సంఘ పాఠాలు 


లారీలు, ట్రక్కులపై తరలిపోయే 

బియ్యం బస్తాల చెవుల్లో 

క్షుదార్తుల దీనగాథలాలపిస్తాయి 

తాము తలదాచుకునే 

గూళ్లున్న భవనాలు 

జాలీల కవచాలు ధరించడం చూచి 

దీనంగా చెట్ల మీదికి చేరుతాయి 

రేపటి పుర బాటసారులకు 

కనువిందు చేయడానికి 

నిజం 


Updated Date - 2020-11-02T06:15:10+05:30 IST