Abn logo
Apr 5 2020 @ 02:01AM

అతిగా భయపడుతున్నామా?

క్షయవ్యాధి కారక మరణాలు లక్షల సంఖ్యలో వున్నందున దేశాన్ని లాక్‌డౌన్ చేయాలని ఎవరైనా ఆలోచించారా? చైనాకు ఇరుగుపొరుగున వున్న దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్‌లు చేపట్టిన చర్యలను అనుసరించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలుగుతాము. అంతేగానీ అమెరికాలో సంపూర్ణ షట్ డౌన్ లేదా భారత్‌లో అసంబద్ధ లాక్‌డౌన్ వల్ల ప్రయోజనమేమీ వుండదు. కరోనా వైరస్ తిరోగమించదు. షట్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌లు ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బ తీస్తాయి, పేదలను చెప్పనలవికాని అవస్థల పాలుచేస్తాయి.


నవీన సాంకేతికతా శిల్పి బిల్‌గేట్స్ ఒక అద్భుత దార్శనికుడు. 2015 తొలినాళ్లలోనే, ఇప్పుడు మన జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న కొవిడ్ -19 లాంటి వైరస్, ప్రపంచం మీద విరుచుకుపడనున్నదని ఆయన చెప్పారు. ఆ విశ్వమారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సంసిద్ధంగా లేదని కూడా గేట్స్ నిక్కచ్చిగా హెచ్చరించారు. కరోనా మహమ్మారి విజృంభించిన నాటి నుంచి ప్రజల్లో బిల్‌గేట్స్ పట్ల గౌరవ భావం ఇతోధికమయింది. అమెరికాలో ఈ భయానక విషక్రిమిపై పోరుకు ఒక ప్రణాళికను ఆయన ప్రతిపాదించారు. దాని సారాంశమిది: పదివారాల పాటు లేదా వైరస్ సంక్రమణలు తగ్గుముఖం పట్టేంత వరకు అమెరికాను షట్‌డౌన్ చేయాలి; విస్తృత స్థాయిలో ప్రజలకు కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి; కరోనాను అరికట్టే వ్యాక్సిన్ అభివృద్ధి పరిచేందుకు ఫెడరల్ ప్రభుత్వం అన్ని విధాల సహకరించాలి. 


ఇంతకూ కరోనా వైరస్ నిజంగా ప్రాణాంతకమైనదేనా? అవునని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి; ప్రజలు విశ్వసిస్తున్నారు. వాస్తవమేమిటి? ‘డైమండ్ ప్రిన్సెస్ ’అనే జపనీస్ ప్రయాణికుల నౌక ఉదంతాన్ని పరిశీలిద్దాం. గత జనవరి 20న యోకొహమలో 80 ఏళ్ళ వృద్ధుడు ఒకరు ఈ నౌకలోకి ఎక్కాడు. జనవరి 26న హాంకాంగ్‌లో ఆ వృద్ధుడు నౌకనుంచి నిష్క్రమించాడు. దరిమిలా వైద్య పరీక్షల్లో ఆయనకు కొవిడ్ -19 పాజిటివ్ నిర్థారణ అయింది. ఫిబ్రవరి 4న యోకొహమ ఓడరేవులో ‘డైమండ్ ప్రిన్సెస్’ను క్వారంటైన్‌లో ఉంచారు. చెప్పవచ్చినదేమిటంటే, కరోనావైరస్ వల్ల సంభవించే నష్టాన్ని అంచనావేసేందుకు ఇదొక నిర్దుష్ట నిదర్శనం. ఆ నౌక, సరిహద్దులు పూర్తిగా మూసివేసిన ఒక మినీ నగరం లాంటిది. నౌకలోని ప్రతి ఒక్కరూ ఇతరులకు అత్యంత చేరువగా వుంటారు. ప్రతి ఒక్కరికి వైరస్ సోకడానికి ఇంతకంటే అనుకూల పరిస్థితి మరొకటేముంటుంది? ఓడలోని ప్రయాణికులు వృద్ధులు కావడం కరోనా వైరస్ సృష్టించే విషమ పరిస్థితుల నిదర్శనాధ్యయానికి (కేస్‌స్టడీ) మరింత అనుకూల పరిస్థితి. యువజనుల కంటే వృద్ధులకే మరింత హానికారిగా కరోనా పేరుబడింది. మరింత శోచనీయమైన విషయమేమిటంటే ఈ అంటువ్యాధిని నివారించేందుకు ఓడ అధికార వర్గం కనీస మాత్రంగానైనా జాగ్రత్తలు తీసుకోలేదు! డైమండ్ ప్రిన్సెస్‌లో మొత్తం 3711 మంది వున్నారు. వారిలో 1045 మంది సిబ్బంది కాగా, 2666 మంది ప్రయాణికులు. సిబ్బంది సగటు వయసు 36, ప్రయాణికుల సగటు వయస్సు 69 సంవత్సరాలు. నౌకను క్వారంటైన్ చేసిన తరువాత దానిలో పూర్తిగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓడను సందర్శించిన అంటువ్యాధుల నిపుణుడు కెంటారో ఇవాటా ఆ పరిస్థితులకు ఎంతో భీతిల్లి పోయాడు. డైమండ్ ప్రిన్సెస్‌ను ‘ఆయన కొవిడ్ -19 మిల్లు’గా అభివర్ణించాడు. మరి ఓడలోని 3711 మందిలో 696 మందికి వైరస్ సోకడంలో ఆశ్చర్యమేముంది? వీరిలో 12 మంది మరణించారు. గమనార్హమేమిటంటే సిబ్బంది 1045 మందిలో ఒక్కరికీ కరోనా వ్యాధి సోకలేదు. ఇదెలా సాధ్యమయింది? సిబ్బంది అందరూ యువజనులు కావడమే. వృద్ధ ప్రయాణికులు అందరూ మరణించారు. వైరస్ సోకిన మొత్తం మందిలో మృతుల సంఖ్య 0.3 శాతం మాత్రమే. 


కొవిడ్ -19 ఒక మహా అంటువ్యాధి అనడంలో సందేహం లేదు. అయితే అది ప్రాణాంతక వ్యాధి కానేకాదు ‘ప్రభుత్వం తక్షణమే పటిష్ఠ చర్యలు చేపట్టని పక్షంలో అమెరికాలో 22 లక్షల మంది ప్రజలు మరణించే అవకాశమున్నదని’ సుప్రసిద్ధ దినపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’లో మార్చి 15న వెలువడిన ఒక వార్త పేర్కొంది. ఇటువంటి అవాస్తవిక, సంచలనాత్మక వార్తల వల్లే ప్రజలు, ప్రభుత్వాలలో కరోనా విషయమై అమిత భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్ గత నాలుగునెలలకు పైగా అసంఖ్యాక ప్రజలను సతాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభైవేల మంది చనిపోయారు. ఈ వాస్తవాన్ని సరైన దృష్టికోణంలో చూడవలసిన అవసరమున్నది. 2017లో ప్రపంచవ్యాప్తంగా 5.60 కోట్లమంది చనిపోయారు. వీరిలో 17.79 మిలియన్ ప్రజలు హృద్రోగాలతోను, 9.56 మిలియన్ ప్రజలు కేన్సర్తోనూ విగతులయ్యారు. అమెరికాలో కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య నాలుగున్నరవేలకు పైగా ఉన్నది. 2017లో అమెరికాలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 2.80 కోట్లు కాగా వారిలో 6,47,457 మంది హృద్రోగాలతోను; 5,99,108 మంది కేన్సర్‌తో మరణించారు. ఫ్లూ జ్వరానికి 55,672 మంది చనిపోయారు. కరోనా వల్ల మరణించేవారి సంఖ్య లక్ష నుంచి, 2.40 లక్షల మధ్య ఉండవచ్చని వైట్‌హౌజ్ ప్రకటించింది. 2017లో అమెరికాలో రోడ్డు ప్రమాదాలలో 1,69,936 మంది మరణించారు. అంతమంది మరణించారు గనుక రోడ్లను షట్ డౌన్ చేయాలని ఎవరైనా ఆలోచించారా? 


ఇటలీలో మూడునెలల క్రితం కొవిడ్ -19 ప్రబలడం ప్రారంభమైన తరువాత ఇంతవరకు మొత్తం దాదాపు పదమూడున్నరవేల మంది మరణించారు 2013-–14 నుంచి 2016-–17 దాకా ఇటలీలో ఫ్లూ వల్ల 68,000 మంది మరణించినట్టు ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్’ వెల్లడించింది. 2016-–17లో ఇటలీలో ఫ్లూ వల్ల 24,981 మంది మరణించారు. కరోనాతో ఇంతవరకు మరణించిన వారి కంటే ఫ్లూ మృతుల సంఖ్య రెండు రెట్లు ఎక్కువ. 


ఈ వ్యాసం రాస్తున్న సమయానికి భారత్ లో కొవిడ్ -19 కారణంగా 58 మంది మరణించారు. భారత్‌లో క్షయవ్యాధి కారణంగా ఏటా 4,40,000 మంది మరణిస్తున్నట్టు 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. క్షయవ్యాధికి, కరోనా మహమ్మారికి పొంతన ఏమిటి? కరోనా మాదిరిగానే క్షయ కూడా, వ్యాధిగ్రస్తులు దగ్గడం లేదా తుమ్మడం వల్ల వెలువడే సూక్ష్మ క్రిముల ద్వారానే వ్యాపిస్తుంది. మరి క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకై దేశాన్ని లాక్‌డౌన్ చేయాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? 


కొవిడ్ -19 ‘మరణాల రేటు’ ఎక్కువ చేసి చూపుతున్నారు. ఇది, విధాన నిర్ణేతలను తప్పుదోవ పట్టించే అవకాశం వున్నది. మొత్తం కేసులను మొత్తం మరణాలతో భాగించగా వచ్చేదే మరణాల రేటు. అయితే, కేసుల మొత్తం సంఖ్య అనేది దేశంలో ఎంత విస్తృతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారన్నదానిపై ఆధారపడివున్నది. తీవ్ర వ్యాధి గ్రస్తులై ఆస్పత్రులకు వచ్చినవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తే మరణాల రేటు మరింత అధికంగా వుండే అవకాశం ఎంతగానో వున్నది. అలా కాకుండా విస్తృతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధిలక్షణ రహిత కేసులను కూడా గుర్తించడం జరిగితే మరణాల రేటు తక్కువగా ఉండే అవకాశమున్నది. 


కొవిడ్ -19ని కామన్ ఫ్లూ తో పోల్చగూడదనే వాదన ఒకటి గట్టిగా వున్నది. నిజమే, ఫ్లూ అంటువ్యాధి లాంటిది కాదు కొవిడ్ -19. అయితే ఈ రెండింటి లక్షణాలు ఒకే విధంగా ఉండడం కద్దు. ఫ్లూ కంటే కొవిడ్ శీఘ్రగతిన వ్యాపిస్తుందనేందుకు రుజువులు వున్నాయి. ఈ రెండు వ్యాధులకు ఒకే విధమైన అంటు వ్యాధి లక్షణాలు ఉన్నందునే ప్రస్తుత గ్లోబల్ షట్‌డౌన్ సందర్భంలో ఈ తులనాత్మక పరిశీలనకు ప్రాధాన్యమున్నది. ఫ్లూ మూలంగా దేశాలను షట్ డౌన్ చేయడమనేది ఎన్నడూ జరగలేదు. మరి కరోనా విషయంలో ఎందుకు అలా చేస్తున్నాము? కొవిడ్ -19 సంక్షోభం దృష్ట్యా ఆహార ధాన్యాల ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు విధించిన పక్షంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.


అమెరికా, బ్రిటన్‌లో సైతం ఆహార ధాన్యాల లూటీ వార్తలు వెలువడడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థల మందగమనం ఫలితంగా అసంఖ్యాక ప్రజలు జీవనాధారాలు కోల్పోతారు. లక్షలాది యువజనులు నిరుద్యోగులవుతారు. ఎంతో మంది నిర్వాసితులవుతారు. ప్రజల జీవన ప్రమాణం గణనీయంగా పడిపోతుంది.ఈ వాస్తవాల దృష్ట్యా పదివారాల పాటు షట్ డౌన్ ప్రకటించాలని బిల్ గేట్స్ ప్రతిపాదించడం సరికాదు. అమెరికాలో గానీ , మరెక్కడైనా గానీ షట్ డౌన్ కంటే మరింత వివేక వంతమైన మార్గాన్ని అనుసరించవలసివున్నది. తొలుత 80 ఏళ్ళకు పైబడినవారందరూ స్వచ్ఛదంగా క్వారంటైన్‌లోకి వెళ్ళాలి. హృద్రోగాలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారిని కూడా స్వచ్ఛందంగా క్వారంటైన్‌లోకి వెళ్ళాలని సూచించాలి. కొవిడ్ -19 ప్రభావితులందరినీ క్వారంటైన్‌కు పంపించాలి. ఆ తరువాత కొవిడ్ -19 రోగితో సంబంధాలలోకి వచ్చిన వారందరినీ గుర్తించి, క్వారంటైన్‌కు పంపించాలి. దరిమిలా విస్తృతస్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతనే మిగతా ప్రజలందరూ తమ సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభించాలి. ప్రజలందరూ మాస్కులు, గ్లవ్స్ ధరించేలా, తరచు చేతులు కడుక్కునేలా చేయాలి. చైనా ఇరుగుపొరుగున వున్న దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్‌లు ఇలాంటి చర్యలు పటిష్ఠంగా చేపట్టడం ద్వారానే కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాయి. అంతేగానీ అమెరికాలో సంపూర్ణ షట్‌డౌన్ లేదా భారత్‌లో అసంబద్ధ లాక్‌డౌన్ వల్ల ప్రయోజనమేమీ వుండదు. కరోనా వైరస్ తిరోగమించదు. షట్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌లు ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బ తీస్తాయి, పేదలను చెప్పనలవి కాని అవస్థల పాలుచేస్తాయి.. దేశ శ్రేయస్సుకు దోహదం చేయవు. 

                                                                   చక్రవర్తి నలమోతు

Advertisement
Advertisement
Advertisement