నేటి నుంచి మనిషికి..10కిలోల ఉచిత రేషన్‌బియ్యం

ABN , First Publish Date - 2020-07-05T10:25:19+05:30 IST

కోవిడ్‌ 19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు మనిషికి 10కిలోల చొప్పున ఉచితంగా

నేటి నుంచి మనిషికి..10కిలోల ఉచిత రేషన్‌బియ్యం

కిలో కందిపప్పు అందజేత

5నెలల పాటు పంపిణీకి ఏర్పాట్లు


ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 4: కోవిడ్‌ 19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు మనిషికి 10కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. జిల్లాలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని వ్యక్తికి పది కిలోల రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ఆదివారం నుంచి రేషన్‌బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ సందర్భంగా కేంద్ర  ప్రభుత్వం ప్రకటించిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సవరణ చేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని తెల్లరేషన్‌ కార్డు దారులకు ఇంట్లో ప్రతి వ్యక్తికీ 10కేజీల బియ్యాన్ని, అన్నపూర్ణ అన్నయోజన కార్డుదారులకు 35కేజీలతో పాటు అదనంగా మరో 5 కేజీలను  ఉచితంగా పంపిణీ చేయనున్నారు.


జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరుతో పాటు నవంబరు నెల వరకు తెల్లకార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు ఒక కిలో కందిపప్పును కూడా అందించనున్నారు. ఈ విషయమై శనివారం రాత్రే రేషన్‌ డీలర్లతో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు సమీక్షించారు. బియ్యం నిల్వలపై కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆరా తీశారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరాలు అడిగినట్లు సమాచారం. శనివారం రాత్రి నుంచే జిల్లాలోని గోదాముల నుంచి బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరఫరాచేస్తున్నారు. డీఎస్వో రాజేంద్రప్రసాద్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ సోములు, అసిస్టెంట్‌ మేనేజర్‌ సీహెచ్‌ నర్సింహారావు ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట సిబ్బందిని అప్రమత్తం చేశారు.  ఆదివారం ఉదయం నుంచి జిల్లాలోని అన్ని రేషన్‌ డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. 


జిల్లాలో రేషన్‌ వివరాలు ఇలా

జిల్లాలో ఆహారభద్రతా కార్డులు  4,05,169  వినియోగదారులు 11,44,833 మంది ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం ఆరు కేజీల చొప్పున ప్రభుత్వం ప్రతి నెలా బియ్యాన్ని కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో జూలై నుంచి నవంబరు వరకు ఐదు నెలకు సంబందించి ప్రతి కార్డులోని వ్యక్తికి 10కేజీలను, ఒక కిలో కందిపప్పును ఉచితంగా అందించనుంది. దీంతో 11,లక్షల 44వేల 833 మందికి గాను 10కేజీల చొప్పున కోటి 14లక్షల 49 వేల 330 కేజీల బియ్యాన్ని ఈ ఐదు నెలలపాటు నెలకు  కోటా కింద విడుదల చేస్తున్నారు. జిల్లాలో గోదాముల్లో రేషన్‌ బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని బియ్యం కొరత ఏమాత్రం లేదని డీఎస్వో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2020-07-05T10:25:19+05:30 IST