మాస్కు ధరించేందుకు నిరాకరణ.. మహిళపై అరెస్ట్ వారెంట్ !

ABN , First Publish Date - 2021-03-16T17:34:15+05:30 IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మాస్కు ధరించేందుకు నిరాకరించిన ఓ మహిళపై అరెస్టు వారెంట్ జారీ అయింది.

మాస్కు ధరించేందుకు నిరాకరణ.. మహిళపై అరెస్ట్ వారెంట్ !

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మాస్కు ధరించేందుకు నిరాకరించిన ఓ మహిళపై అరెస్టు వారెంట్ జారీ అయింది. టెక్సాస్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓరెగాన్​లోని గ్రాంట్స్ పాస్​కు చెందిన టెర్రీ రైట్(65) అనే మహిళ క్యాష్ విత్‌డ్రా కోసం స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచీకి వెళ్లింది. బ్యాంకు‌కు వచ్చిన టెర్రీ మాస్కు వేసుకోకపోవడం గమనించిన సిబ్బంది ఆమెను మాస్కు ధరించాలని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో బయటకు వెళ్లిపోవాలని సిబ్బంది చెప్పారు. కానీ, టెర్రీ తన పని అయ్యేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, మాస్కు కూడా ధరించబోనని భీష్మించుకుని కూర్చుంది. దాంతో చేసేదేమిలేక బ్యాంకు మేనేజర్ 911కు కాల్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి టెర్రీని మాస్కు వేసుకోవాలని కోరారు. 


కానీ, ఆమె వారి మాటను కూడా బేఖాతరు చేసింది. మాస్కు ధరించడానికి ససేమిరా అంది. పైగా అక్కడికి వచ్చిన పోలీస్ అధికారితో 'నువ్వేం చేస్తావ్? అరెస్ట్ చేస్తావా? చేస్కో' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడింది. దాంతో కొవిడ్ నిబంధనల అతిక్రమణ ఆరోపణలపై అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు టెర్రీకి చెప్పారు. అంతే.. వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందామె. దీంతో పోలీసులు ఆమెను అడ్డగించి అరెస్ట్ చేశారు. అయితే, ఆమె స్థానిక నిబంధనల ప్రకారం తాను మాస్కు ధరించాల్సిన అవసరం లేదని చెప్పిందట. దీనికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు వేసుకోవడం తప్పనిసరి కాదని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇటీవల ప్రకటన చేయడమేనని సమాచారం. కానీ, వైరస్ ప్రభావం పూర్తిగా తొలిగిపోని కారణంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చాలా ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ అధికారులు మాస్కు తప్పనిసరి నిబంధనను అమలు చేస్తున్నారు.

Updated Date - 2021-03-16T17:34:15+05:30 IST