హైదరాబాద్‌కు ‘మహా’ క్యూ

ABN , First Publish Date - 2021-04-09T09:09:36+05:30 IST

నాందేడ్‌కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అక్కడి ఆస్పత్రుల్లో చికిత్సతో లాభం లేదనుకుంది.

హైదరాబాద్‌కు ‘మహా’ క్యూ

మహారాష్ట్ర నుంచి కొవిడ్‌ రోగుల రాక.. ఒక్కో ఆస్పత్రిలో 10-30 మంది చేరిక

వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ చికిత్సలకు డిమాండ్‌.. సీరియస్‌, కోమార్బిటీస్‌ కేసులే అధికం

గాంధీలో కరోనా చికిత్సకు 500 బెడ్లు.. చెస్ట్‌ ఆస్పత్రిలో 124 పడకలు సిద్ధం


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): నాందేడ్‌కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అక్కడి ఆస్పత్రుల్లో చికిత్సతో లాభం లేదనుకుంది. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులుండడం ప్రధాన కారణం. పైగా వైరస్‌ కారణంగా కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో.. కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అయిదారు రోజులపాటు వెంటిలేటర్‌ చికిత్స తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడింది.


ఆస్పత్రి నుంచి రెండు రోజుల క్రితం డిశ్చార్జి అయ్యింది. ఇలా.. రోజుకు పదుల సంఖ్యలో కొవిడ్‌ రోగులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. వీరికి తోడు.. కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్‌ ఆస్పత్రులకు తాకిడి పెరిగింది. ఇక పడకలు అందుబాటులో ఉన్నాయా? అంటూ ఆయా రాష్ట్రాల నుంచి ఆస్పత్రులకు వచ్చే ఫోన్‌కాల్స్‌కు లెక్కే లేదు. ఇప్పటికే హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు పడకలు దొరకని పరిస్థితి. ఇక పక్క రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తే.. పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పది రోజులుగా..

హైదరాబాద్‌ ఆస్పత్రులకు పది రోజులుగా మహారాష్ట్ర నుంచి వచ్చే రోగుల తాకిడి పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ చికిత్స అందిస్తున్న ఒక్కో ఆస్పత్రిలో 20-30 మంది దాకా మహారాష్ట్రకు చెందిన రోగులు చికిత్స పొందుతున్నారు. గడిచిన పది రోజులుగా.. ఒక్కో ఆస్పత్రికి సగటున రోజుకు 8 మంది మహారాష్ట్ర కొవిడ్‌ బాధితులు వస్తున్నారు. నాందేడ్‌, లాతూర్‌, పర్బణీ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ అందుబాటు ధరల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుతుడడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వారిలో ఎక్కువ మంది రోగులు వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ పడకలు అవసరమైన వారే ఉంటున్నారని వివరించారు. వీరిలో ఎక్కువ మంది 25-70 వయసు వారేనని పేర్కొన్నారు. చాలా మంది బీపీ, షుగర్‌, కిడ్నీ, గుండె, శ్వాసకోశ సమస్యలున్న వారేనని తెలిపారు.


15 నుంచి 20 మందికి చికిత్స 

మా ఆస్పత్రిలో ప్రస్తుతం 15-20 మంది మహారాష్ట్రకు చెందిన వారు కొవిడ్‌కు చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజు ముగ్గురు, నలుగురు వస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రోగులు ఇక్కడ చికిత్సపై ఆసక్తి చూపుతున్నారు. నాందేడ్‌, లాతూర్‌ వంటి సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాలు లేకపోవడంతో హైదరాబాద్‌కు తాకిడి పెరిగింది.

 డాక్టర్‌ రాహుల్‌ మెడక్కర్‌, కేర్‌ ఆస్పత్రి సీవోవో




ప్రతిరోజు సుమారు 8 మంది

మా ఆస్పత్రిలో సుమారు వంద మంది మహారాష్ట్ర కొవిడ్‌ రోగులకు చికిత్సలు అందించాం. పది రోజులుగా మహారాష్ట్ర రోగుల తాకిడి పెరిగింది. మా ఆస్పత్రికి ప్రతిరోజు సగటున 8 కేసులు వస్తున్నాయి. 50ు మంది అంబులెన్సుల్లో వెంటిలేటర్లతో వస్తున్నారు. వారిలో 30ు మంది పరిస్థితి విషమంగా మారాక ఇక్కడ చేరుతున్నారు.

డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కులకర్ణి, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ (కిమ్స్‌)

Updated Date - 2021-04-09T09:09:36+05:30 IST