Abn logo
Apr 21 2021 @ 00:50AM

అతడు వీడియో పెడితే వైరలే!

అభిరుచిని ఆస్వాదిస్తూ... అందులోనే కెరీర్‌ను వెతుక్కొనేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటివారిలో ముందుంటాడు యూట్యూబర్‌ ఆశిష్‌ చంచలాని. మధ్యలోనే ఇంజనీరింగ్‌ వదిలేసి... సరదా వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు మిలియన్లమంది చందాదారులనే కాదు... ‘ఫోర్బ్స్‌ మేగజైన్‌ 30 అండర్‌ 30’లో కూడా స్థానం దక్కించుకున్న అతడి కథ ఇది... 


చిన్నప్పటి నుంచి ఆశిష్‌కు సినిమాలంటే పిచ్చి. అందుకు కారణం లేకపోలేదు. మహారాష్ట్ర థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌ అతడి సొంత పట్టణం. అక్కడ వాళ్ల నాన్న అనిల్‌ చంచలానికి సినిమా థియేటర్‌ ఉంది. ఇప్పుడది మల్టీప్లెక్స్‌గా రూపాంతరం చెందింది. అందులో వచ్చిన సినిమా వచ్చినట్టు చూస్తుండేవాడు ఆశిష్‌. దాంతో సహజంగానే బాలీవుడ్‌ చిత్రాలన్నా, తారలన్నా తగని క్రేజ్‌ ఏర్పడింది అతడికి. తెరపై కనిపించాలనే ఓ చిన్న కోరిక ఆ వయసులోనే నాటుకుపోయింది. 


తొలి అడుగు అలా...  

పాఠశాల విద్యాభ్యాసం అయిపోయింది. అందరిలా కెరీర్‌ రేస్‌లో పరిగెత్తాలనుకున్నాడు. దాని కోసం సివిల్‌ ఇంజనీరింగ్‌లో చేరాడు ఆశిష్‌. కానీ కాలేజీ వయసు... కుర్ర మనసు... చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయాడు. అతడి ఆలోచనలు వేరే. ఊహా లోకంలో విహరిస్తున్నాడు. చిన్నప్పుడు కన్న ‘రంగుల’ కల ఇన్నేళ్ల తరువాత మళ్లీ చిగురులేసింది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌తో చిన్న చిన్న సరదా వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి ఆనందపడ్డాడు. అప్పుడు అతడికి తెలియదు... ఈ వీడియోలే తను స్టార్‌గా ఎదగడానికి నాంది అవుతాయని! 


మధ్యలోనే మానేసి... 

‘ఆశిష్‌ చంచలాని వైన్స్‌’ పేరుతో అతడు ప్రారంభించిన యూట్యూబ్‌ చానల్‌కు ఆరంభంలోనే మంచి ఆదరణ లభించింది. వీడియోలకు క్రమంగా వీక్షకులు పెరుగుతున్నారు. దీంతో సరదాగా మొదలైన వ్యాపకం తరువాత అతడి లోకంగా మారిపోయింది. ‘‘ఇదంతా 2014లో! కాలేజీలో పాఠాలు ఎక్కడంలేదు. మనసు ఎటో లాగుతోంది. అదే సమయంలో నా యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచాను. సరదాగా, సెటైరికల్‌గా ఉంటే షార్ట్‌ వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేశాను. స్నేహితులు, వారికి తెలిసినవారు... ఇలా అన్ని వైపుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఇక ఇంజనీరింగ్‌ నా వల్ల కాదనిపించింది. చదువు మధ్యలోనే ఆపేసి పూర్తిగా సామాజిక మాధ్యమాల కంటెంట్‌పైనే దృష్టి పెట్టాను. యూట్యూబ్‌లో నా తొలి వీడియో... ‘తూ మేరా బాప్‌ కో జాన్తా నహీ హై’. జనాలకు చికాకు తెప్పించే వీడియో అది’’ అని గతం గుర్తు చేసుకున్నాడీ 27 ఏళ్ల కుర్రాడు. 


అవార్డులూ అందుకున్నాడు... 

సామాజిక మాధ్యమాల్లో ఆశిష్‌కు ఫాలోవర్స్‌ వేగంగా పెరిగారు. దీంతో అతడు చుట్టూ ఉండే అంశాలనే తీసుకొని, వాటిలో నుంచే హాస్యం పండించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయోగమూ విజయవంతమైంది. ‘‘ఈటింగ్‌ హ్యాబిట్స్‌ ఇన్‌ క్లాస్‌రూమ్‌’ వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తే... 3.1 మిలియన్లమంది వీక్షించారు. అప్పుడు అర్థమైంది... నా కంటెంట్‌కు కూడా వైరల్‌ అయ్యే సత్తా ఉందని! దాంతో నాకు పూర్తి స్పష్టత వచ్చింది. నమ్మకం పెరిగింది. నా కెరీర్‌ ఇక ఇదేనని నిర్ణయించుకున్నాను’’ అంటాడు అతడు. 24 మిలియన్ల సబ్‌స్ర్కైబర్స్‌... 

ఆశిష్‌ చంచలాని కంటెంట్‌ సాదాసీదాగా ఉండదు. సినిమాల్లో కామెడీ బిట్స్‌ చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది. ఒక్కడే కూర్చొని ఏదో చెప్పేస్తూ నవ్వించే ప్రయత్నం చేయకుండా... విభిన్న పాత్రధారులతో అలరిస్తాడు. అతడి విజయానికి ప్రధాన కారణం అదే! ఇంతకీ ఆశిష్‌ యూట్యూబ్‌ చానల్‌కు సబ్‌స్ర్కైబైర్లు ఎంతమందో తెలుసా..! 24.2 మిలియన్లమంది! దేశంలోనే అత్యధిక చందాదారులున్న రెండో యూట్యూబర్‌ అతడు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌కూ తక్కువేంలేదు. 10.4 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారక్కడ. గత ఏడాది తీసిన ‘లాక్‌డౌన్‌ విత్‌ పరివార్‌’, ‘లాక్‌డౌన్‌ కీ సైడ్‌ ఎఫెక్ట్స్‌’ వీడియోలకు 76 మిలియన్ల వ్యూస్‌ లభించాయి. ఇటీవల వదిలిన ‘ఆఫీస్‌... ఎగ్జామ్‌ ఔర్‌ వేక్సిన్‌’ను 43 మిలియన్లమంది వీక్షించారు. 


అవార్డులూ అందుకున్నాడు... 

అప్రతిహతంగా సాగిపోతున్న ఆశిష్‌ చంచలాని కెరీర్‌లో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ఉన్నాయి. 2018లో ‘బెస్ట్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌’గా ‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌ అవార్డ్‌’ అందుకున్నాడు. 2019లో ‘కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో భాగంగా నిర్వహించిన ‘వరల్డ్‌ బ్లాగర్స్‌ అవార్డ్స్‌’ తొలి ఎడిషన్‌లో ‘బెస్ట్‌ కామెడీ ఇన్‌ఫ్లుయన్సర్‌’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అదే ఏడాది అంతర్జాతీయ స్థాయిలో మరో అవార్డ్‌ దక్కించుకున్నాడు. ఇటీవల ప్రముఖ మేగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘30 అండర్‌ 30’ భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. నటనపై ఆసక్తితో ముంబయిలోని ‘బారీ జాన్‌ యాక్టింగ్‌ స్టూడియో’లో శిక్షణ కూడా తీసుకున్నాడు. 


బాలీవుడ్‌కు ప్రమోషన్‌... 

ఐదేళ్ల కిందట ‘ప్యార్‌ తూనే క్యా కియా’ షో ద్వారా టీవీ తెరపైనా కనిపించాడు ఆశిష్‌. ‘ఆఖరీ సఫర్‌’ అనే లఘుచిత్రం కూడా తీశాడు. ఒకప్పుడు తమ థియేటర్‌కు వచ్చిన బాలీవుడ్‌ తారలను చూసి సంబరపడ్డ అతడు... ఇప్పుడు వారి సినిమాలను తన చానల్‌ ద్వారా ప్రమోట్‌ చేసే స్థాయికి ఎదిగాడు. షాహిద్‌ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌ తదితర స్టార్స్‌ తమ చిత్రాల ప్రచారానికి ఆశిష్‌తో ఒప్పందం చేసుకున్నారంటే... అతడి మార్కెట్‌ ఏ రేంజ్‌లో ఉందో వేరే చెప్పక్కర్లేదు. 


అక్షయ్‌కుమార్‌, శ్రీదేవి తన అభిమాన తారలని చెప్పే ఆశిష్‌... ‘‘రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి, మనదైన ప్రత్యేకత కనిపించేలా కంటెంట్‌ క్రియేట్‌ చేయగలిగితే వైరల్‌ అవ్వడం కష్టమేమీ కాదు. అదే సమయంలో కంటెంట్‌ ఎప్పటికప్పుడు కొత్తగా, అందరికీ అర్థమయ్యేలా తీయడం కూడా చాలా ముఖ్యం. అంతకు మించి ఇక్కడ వ్యక్తిగత నేపథ్యాలతో సంబంధం లేదు’’ అంటాడు. 

ఆసియా సినిమా అంటే భారత్‌ గుర్తొచ్చేలా దర్శకుడిగా వినూత్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు తీయాలనేది అతడి కల. దాని కోసం ప్రొడక్షన్‌ హౌస్‌ ఒకటి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాడు.