టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి రాజీనామా

ABN , First Publish Date - 2021-04-09T08:44:56+05:30 IST

టీఎ్‌సఆర్టీసీలో ప్రధాన ఉద్యోగ సంఘంగా ఉన్న తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ)లో భారీ మార్పు చోటుచేసుకుంది. పదిన్నరేళ్లపాటు యూనియన్‌ ప్రధాన

టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి రాజీనామా

కొత్త ప్రధాన కార్యదర్శిగా ఏఆర్‌ రెడ్డి

ఏకగ్రీవంగా ఎన్నుకున్న కేంద్ర కమిటీ

చక్రం తిప్పిన మంత్రులు  అజయ్‌, అల్లోల 

టీఎంయూ గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సఆర్టీసీలో ప్రధాన ఉద్యోగ సంఘంగా ఉన్న తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ)లో భారీ మార్పు చోటుచేసుకుంది. పదిన్నరేళ్లపాటు యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వచ్చిన ఇ.అశ్వత్థామరెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే టీఎంయూ ఆదిలాబాద్‌ రీజినల్‌ సెక్రటరీ ఏఆర్‌ రెడి ్డ(ఎ.రామచంద్రారెడ్డి)ని నూతన ప్రధాన కార్యదర్శిగా యూనియన్‌ కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో అశ్వత్థామరెడ్డి శకం ముగిసినట్లయింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో పురుడు పోసుకున్న టీఎంయూ అధికార టీఎర్‌ఎ్‌సకు అనధికార అనుబంధ సంఘంగా కొనసాగుతూ వచ్చింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావశీలంగా ఉన్న నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ) నుంచి విడిపోయి తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 అక్టోబరు 27న టీఎంయూ ఏర్పాటైంది. తిరుపతి అధ్యక్షుడిగా, ఎం.థామ్‌సరెడ్డి కార్యాధ్యక్షుడిగా, ఇ.అశ్వత్థామరెడ్డి ప్రధాన కార్యదర్శిగా టీఎంయూను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మంత్రి టి.హరీశ్‌రావు టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా కొనసాగారు. అయితే కొన్ని కారణాల వల్ల 2018లో ఆ పదవి నుంచి ఆయన తప్పుకొన్నారు. కాగా, ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘంగా.. 2018లో కొత్త పీఆర్సీ కోసం టీఎంయూ ఆందోళనకు దిగింది. అప్పటినుంచే ప్రభుత్వ పెద్దలు, టీఎంయూ నేతల మధ్య గ్యాప్‌ ఏర్పడింది. 


సమ్మెతో ప్రభుత్వ వ్యతిరేక ముద్ర

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం 2019లో యూనియన్లు జేఏసీగా ఏర్పాటై సమ్మెకు దిగగా.. అశ్వత్థామరెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. 55 రోజులపాటు ఉధృతంగా కొనసాగిన సమ్మెలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనియన్ల నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఒక దశలో అశ్వత్థామరెడ్డి సీఎం కేసీఆర్‌కే సవాల్‌ విసిరారు. సమ్మెకు ప్రతిపక్షాలు కూడా మద్దతివ్వడంతో పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. టీఎంయూపై ప్రభుత్వ వ్యతిరేక ముద్ర పడింది. ఎట్టకేలకు సమ్మె ముగిసినా.. కేసీఆర్‌ మాత్రం ఆగ్రహంతోనే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి భవన్‌కు పిలిపించి, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పలు వరాలు కురిపించారు. కానీ, ఆర్టీసీలో రెండేళ్లపాటు యూనియన్లను నిషేధించాలని ఆదేశించారు. ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో యూనియన్ల అస్తిత్వం నామమాత్రంగా మారింది. పీఆర్సీ సమస్య ఎటూ పరిష్కారం కాలేదు.


కొత్త పీఆర్సీ కాలం ఈ ఏప్రిల్‌ 1తో ప్రారంభమైంది. ఈ దశలో టీఎంయూలోని కొంత మంది నేతలు(అశ్వత్థామరెడ్డి మినహా) రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని కలుస్తూ వచ్చారు. అయితే యూనియన్‌ నాయకత్వంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహంతో ఉన్నారని, నాయకులను మార్చాలని మంత్రులు సూచించారు. అశ్వత్థామరెడ్డి కూడా కొంతకాలంగా తాను పదవి నుంచి తప్పుకొంటానంటూ సంకేతాలిస్తున్నారు. ఈ మేరకు గురువారం టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశమెంది. ఈ సందర్భంగా తాను ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆ వెంటనే ఏఆర్‌ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 


గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత? 

టీఎంయూ గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్నుకునే అవకాశమున్నట్లు తెలిసింది. ఇందుకు ఆమె కూడా సూత్రప్రాయంగా సమ్మతించినట్లు తెలిసింది. మరోవైపు టీఎంయూను మళ్లీ టీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా మార్చడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గురువారమే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రులు అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి తెలియజేసినట్లు సమాచారం. 

Updated Date - 2021-04-09T08:44:56+05:30 IST