ఆత్మ సాక్షాత్కారం అంటే..

ABN , First Publish Date - 2020-07-21T09:06:10+05:30 IST

‘అహం అనే భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్ఠం, అఖండం అయిన సత్‌ స్వరూపం ‘నేను, నేను’ అంటూ హృదయంలో స్వయంగా

ఆత్మ సాక్షాత్కారం అంటే..

  • అహమి నాశభాజ్యహ మహం తయా
  • స్ఫురతి హృత్‌ స్వయం పరమపూర్ణ సత్‌

‘అహం అనే భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్ఠం, అఖండం అయిన సత్‌ స్వరూపం ‘నేను, నేను’ అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది’ అని ఈ శ్లోక భావం. భగవాన్‌ రమణ మహర్షి రచించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞాన గ్రంథం.. ‘ఉపదేశ సారం’లోని 20వ శ్లోకమిది. మనో నాశనం కావాలంటే ‘నేను’ అనే భావన తొలగిపోవాలని తెలిపిన రమణులు.. ఆ భావన పోయాక మిగిలి ఉండే స్థితి గురించి ఇందులో వర్ణించారు. అహం భావన పడిపోయాక మిగిలే ‘నేను’.. సత్యమైనది. అది జ్ఞాన స్వరూపం. సత్‌ రూపం. అఖండం, పరిపూర్ణం అయిన శాశ్వత వస్తువు. ఈ ‘నేను’నే రమణ మహర్షి ‘తాను’ అని వ్యవహరించేవారు. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు అన్ని భావనలు, మనస్సు అంతమైనా కూడా ప్రకాశిస్తూ ఉండేది ఇదే. కాకపోతే మనస్సు ఆ ‘నేను’లో లయమైందే తప్ప నశించలేదు కనుక..


మెలకువ రాగానే మళ్లీ మనసు, దాంతోపాటు ఈ జగత్తు, సుఖదుఃఖాలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా, విచారణతో ‘అహం’ భావనను నాశనం చేస్తే ఆ స్థానంలో తాను (ఆత్మ) ‘నేను నేను’ అని స్వయంగా ప్రకాశిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మ దర్శనం. అయితే.. ఆత్మదర్శనం అనే మాట నిజానికి పెద్ద తప్పు. ఎందుకంటే.. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. దర్శించడానికి అది దృశ్యమూ కాదు. అది మనచే చూడబడే వస్తువే అయితే.. అది పరిమితమైనదే అవుతుంది. పరిమితమైనది నశిస్తుంది. అలా నశించేది ఆత్మ కాదు. అది ఏకం, అద్వయం, సర్వవ్యాపకం. అది మనకన్నా వేరు కాదు. కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేం. ఆత్మ దర్వనం అంటే.. అది ‘నేనే’ అని అనుభవం కలుగుతుందంతే.


ఆత్మదర్శనం కేవలం విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. పూజ, యజ్ఞం, దానధర్మాలు మొదలైన కర్మల వల్లగానీ, జపం, ధ్యానం మొదలైన సాధనల వల్లగానీ, ప్రాణాయామం మొదలైన ప్రక్రియల వల్ల గాని ఈ ‘అహం’భావన తొలగిపోదు. ఈ సాధనలన్నీ కొన్ని ప్రక్రియలు మాత్రమే. ‘అహం’ పుట్టుక ఎక్కడో వెతకడం (విచారణ) వల్లనే అది పడిపోతుంది. అప్పుడే ఆత్మదర్శనం. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడై తగిన శ్రద్ధ చూపిస్తే సద్గురువు ద్వారా వేదాంత బోధ వింటూ ఉండగానే అతడికి ఈ స్థితి సద్యోఫలంగా లభిస్తుంది. ఆ అర్హత లేనివారు దాన్ని సంపాదించడానికే జపధ్యానాదులు. వాటి ద్వారా అర్హత సంపాదిస్తే అప్పుడు విచారణ చేసి, అజ్ఞానాన్ని తొలగించుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. 


ఆత్మ ఎక్కడి నుంచో రాదు. అది స్వయం వ్యక్తం. అందుకే రమణులు ‘స్ఫురతి హత్‌ స్వయం’ అన్నారు. వర్షాకాలంలో సూర్యుడు మబ్బుల వెనుక ఉండడం వల్ల వెలుగు కనిపించదు. అంతమాత్రాన సూర్యుడు లేనట్టు కాదు. ఆయనెప్పుడూ జ్వాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంటాడు. ఆత్మ కూడా అంతే. అజ్ఞానమనే మేఘాలు కప్పివేయడం వల్ల మనకు కనిపించడం లేదంతే. జ్ఞానమనే గాలి వీచినప్పుడు అజ్ఞానపు మబ్బులు తొలగి ఆత్మదర్శనమవుతుంది. అందుకే.. ‘నేనడంగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు’ అన్నారు రమణ మహర్షి. 


దేవిశెట్టి చలపతిరావు, , care@srichalapathirao.com

Updated Date - 2020-07-21T09:06:10+05:30 IST