రౌడీషీటర్‌పై దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-04-05T15:51:17+05:30 IST

సింగరేణి వాంబేకాలనీలో శుక్రవారం రాత్రి ఓ రౌడీషీటర్‌పై యువకుల దాడి ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో

రౌడీషీటర్‌పై దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు

హైదరాబాద్/సైదాబాద్‌ : సింగరేణి వాంబేకాలనీలో శుక్రవారం రాత్రి  ఓ రౌడీషీటర్‌పై యువకుల దాడి ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సైదాబాద్‌ పోలీసులు స్పందించారు. పలువురిపై కేసు నమోదు చేశారు. సింగరేణి వాంబే క్వార్టర్స్‌లో నివాసముంటున్న పి. ప్రశాంత్‌ అలియాస్‌ రాజు సైదాబాద్‌ పీఎస్‌ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో అహ్మద్‌ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రశాంత్‌ దూషించాడు. అహ్మద్‌ తనను ఎందుకు దూషించావంటూ ప్రశాంత్‌ కాలర్‌ పట్టుకున్నాడు. దీంతో ప్రశాంత్‌ అతడిపై దాడి చేసి కింద పడేశాడు. ఇంటికి వెళ్లిన అహ్మద్‌ కుటుంబసభ్యులతో తనపై జరిగిన దాడిని వివరించారు. కుటుంబసభ్యులు ప్రశాంత్‌ ఇంటికి వచ్చి వాకబు చేయగా లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన కోసం ఇంటికి వచ్చారని తెలుసుకున్న ప్రశాంత్‌ చంపాపేటకు వెళ్లి దాక్కున్నాడు.


అహ్మద్‌ కుమారులు ప్రశాంత్‌ స్నేహితుడు మహేష్‌ ద్వారా ఫోన్‌ చేయించి సామరస్యంగా మాట్లాడుకుందామని నమ్మించి పిలిపించారు. ప్రశాంత్‌ రాగానే అహ్మద్‌ కుమారులు ఫసీ, నదీంతో పాటు జావిద్‌ అతడి కళ్లలో మట్టిపోసి కర్రలతో దాడి చేశారు. దాడి ఘటననను ఆసిఫ్‌ వీడియా తీశాడు. స్థానిక యువకుడు జోక్యం చేసుకుని విడిపించాడు.  ఈ దాడిలో గాయపడిన ప్రశాంత్‌ రౌడీషీటర్‌ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దాడి దృశ్యాలు శనివారం రాత్రి వైరల్‌ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రశాంత్‌ను పిలిపించి ఫిర్యాదు తీసుకుని దాడికి పాల్పడ్డ నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అహ్మద్‌ కుటుంబానికి చెందిన మహిళలు జరిపిన దాడిలో ప్రశాంత్‌ వదినకు మూడు నెలల గర్భం పోయిందని తెలపడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని సైదాబాద్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-04-05T15:51:17+05:30 IST