భావజాల వ్యూహంతోనే ప్రజాసంఘాలపై దాడులు!

ABN , First Publish Date - 2021-01-07T06:16:18+05:30 IST

ఆలోచనల బలం అందరికన్నా అధికారంలో ఉన్న వాళ్లకే బాగా తెలుసు. అందుకే భిన్నంగా ఆలోచించేవాళ్ల మీద నిఘా వేస్తారు....

భావజాల వ్యూహంతోనే ప్రజాసంఘాలపై దాడులు!

ప్రజా జీవితంలో మానవీయ విలువల కోసం, ప్రజాస్వామిక చైతన్యం కోసం, రాజ్యాంగబద్ధ హక్కుల కోసం ఆలోచిస్తున్న వాళ్లందరూ తమకు ఆటంకంగా తయారయ్యారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వీళ్ల మాటలు, రాతలు, పనులు న్యూసెన్స్‌ అనుకుంటున్నాయి. లౌకిక, ప్రగతిశీల, విప్లవ భావజాలాన్ని తుడిచిపెట్టడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇది ప్రజాసంఘాల మీద దాడి అని విడిగా చూడ్డానికి లేదు. మొత్తంగా లౌకిక, ప్రజాస్వామిక విలువల మీద దాడిగా భావించాలి.


ఆలోచనల బలం అందరికన్నా అధికారంలో ఉన్న వాళ్లకే బాగా తెలుసు. అందుకే భిన్నంగా ఆలోచించేవాళ్ల మీద నిఘా వేస్తారు. ఆలోచించకుండా చేయలేరు కాబట్టి ప్రజల్లో లేకుండా చేస్తారు. అక్రమ కేసులు పెట్టి కటకటాల వెనుక్కి తోసేస్తారు. ఆలోచనలు భౌతిక రూపం ధరిస్తాయనే ఆందోళనే దీనికి కారణం. ఈ విషయంలో రాజరికాలకు, ఉదారవాద 'ప్రజస్వామ్యాల'కు తేడా లేదు. బుధవారం విజయవాడలో కుల నిర్మూలనా పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ అరెస్టు దీనికి ఉదాహరణ. ఆయన ప్రభావశీలమైన ఆలోచనాపరుడు. నిత్యం దళితుల, పేదల మధ్య పని చేస్తుంటాడు. ముప్పై ఏళ్లుగా దళిత విముక్తి పోరాటాల్లోని అనేక సంఘర్షణల మధ్య నుంచి రాటుదేలాడు. ముఖ్యంగా రాజ్యాంగవాదానికి గురి కాని కుల నిర్మూలనా నాయకుడు. ఆయన అరెస్టు అనేక విషయాలను సూచిస్తున్నాయి. బహుజన, ప్రజాస్వామిక ఉద్యమకారులు వాటిని గమనించాలి. 


నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో గత నెలన్నరగా ప్రజా సంఘాల నాయకుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ప్రభాకర్‌తో ఈ సంఖ్య పదికి చేరింది. 2020 నవంబర్‌ 27న చైతన్యమహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరి, అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మతో ఈ అరెస్టులు మొదలయ్యాయి. డిసెంబర్‌8న మదనపల్లిలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యుడు ఆంజనేయులును; డిసెంబర్ 12న, 15న అదే సంఘం నాయకులు కొండారెడ్డిని, అన్నపూర్ణను అరెస్టు చేశారు. డిసెంబర్‌ 21న, 23న ప్రజాకళామండలి నాయకులు విజయ్‌, కోటి అరెస్టయ్యారు. 2న న్యాయశాస్త్ర విద్యార్థి క్రాంతిని గుంటూరులో అరెస్టు చేశారు. 26న విరసం సభ్యుడు, అన్నపూర్ణ సహచరుడు డి. శ్రీనివాసరావును విశాఖలో పట్టుకపోయారు.


ఈ సంఖ్య ఇక్కడితో ఆగేది కాదని తెలుస్తోంది. రాష్ట్రంలో 32మంది ప్రజాసంఘాల సభ్యుల మీద నవంబర్‌ 23న విశాఖపట్నం జిల్లా ముంచింగ పుట్టులో, నవంబర్‌ 24న గుంటూరు జిల్లా పిడుగురాళ్ల స్టేషన్‌లో రెండు కేసులు పెట్టారు. ఉపాతోపాటు అనేక సెక్షన్ల కేసులు నమోదు చేశారు. కొందరి మీద ఏనాటివో పాత కేసులు బైటికి తీసి చూపించారు. 2005లో అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ లడ్హా మీద మావోయిస్టులు చేసిన హత్యాయత్నం కేసులో డి. శ్రీనివాసరావును అప్పట్లోనే అక్రమంగా ఇరికించారు. ఇప్పుడు ఆ కేసును బైటికి లాగి ఆయన్ను అరెస్టు చేస్తున్నామని చెప్పారు. రాజేశ్వరిని, అంజమ్మను కూడా విశాఖ జిల్లాలోని జి. మాడుగులలో 2018లో పెట్టిన కేసు కింద అరెస్టు చేస్తున్నట్లు చూపించారు. 


ఇట్లా నిరాధారమైన కేసులు పెట్టడం, పాత అక్రమ కేసులను బైటికి తీయడం, నెల రోజుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేయడం.. యాదృచ్ఛికం కాదు. వైసీపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే ఈ నిర్బంధాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ వ్యవహారమంతా జగన్‌మోహన్‌రెడ్డి పాలనా విధానం. నిజానికి మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఏ రాష్ట్రంలో అక్కడ పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడినా అది కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానమే అనుకోడానికి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరుగుతున్న చర్యలివి. కేంద్రంతో, రాష్ట్ర ప్రభుత్వాలకు పేచీలు ఉన్నా, ఉన్నట్లు బైటికి నటిస్తున్నా.. ప్రజా పోరాటాలు, ఆకాంక్షల విషయంలో మాత్రం అందరిదీ ఒకే వైఖరి.


నిస్సందేహంగా ఇది కొన్ని రాజకీయ విశ్వాసాల మీద దాడి. అందుకే దళితుల విముక్తి కోసం పోరాడుతున్న వాళ్లపై అక్రమ కేసుల్ని బనాయించారు. స్త్రీల స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న వాళ్లను నేరస్థులను చేశారు. కార్మికులపై దోపిడీని ప్రశ్నిస్తున్న వాళ్లను ప్రమాదకారులుగా చిత్రించి కటకటాలపాలు చేస్తున్నారు. అమరుల త్యాగాలను ఎత్తిపట్టడాన్నే భరించలేకపోతున్నారు. జీవితంలోంచి వేరు చేయలేని సాహిత్య సృజనను విధ్వంస చర్యగా భావించి కేసులు పెడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడే పోరాటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ దక్షిణాదిన విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తగిన రాజకీయాలను నడుపుతోంది. ఇందులో భావజాల వ్యూహం కూడా ఉంది. విప్లవ, ప్రజాస్వామిక, లౌకిక విలువల గురించి మాట్లాడే వ్యక్తులను, సంస్థలను దెబ్బతీయడంలో భాగంగానే ప్రస్తుత అరెస్టులను చూడాలి. కాషాయీకరణ, కార్పొరేటీకరణలకు అడ్డంగా ఉండే ఎవరినీ బీజేపీ ప్రభుత్వం బతకనివ్వదల్చుకోలేదు. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పేచీ ఎందుకు ఉంటుంది?


ఈ అరెస్టులను మరో రెండు విషయాలతో కలిపి చూడాలి. ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్రమవుతున్న నిర్బంధానికి కొనసాగింపే ప్రజాసంఘాల కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులు. గత టీడీపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో కేంద్రం మార్గదర్శకత్వంలో అమలు చేసిన నిర్బంధాన్ని జగన్‌మోహన్‌రెడ్డి మరింత ముందుకు తీసికెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఇటీవల రెండు మూడు దారుణ ఘటనలు జరిగాయి. డిసెంబర్‌ 2న నక్కమామిడి పంచాయతీలోని సంగవరం గ్రామాన్ని అర్ధరాత్రి వందలాది పోలీసులు చుట్టుముట్టి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఆదివాసీ తెగకు చెందిన మావోయిస్టు మల్లాల్‌ అనే వ్యక్తి, శాంత అనే సాధారణ ఆదివాసీ మహిళ, ఒక చిన్న పాప కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతంలో ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాల వేలాది పోలీలు, సైనిక బలగాలు నిత్యం కూంబింగ్‌ చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామాలను చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నారు. నవంబర్‌ 26న తోటగూడ వద్ద కాల్పులు జరిపి కిషోర్‌ అనే వ్యక్తిని చంపేశారు. గాయపడిన లైకోన్‌ అనే వ్యక్తిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి అరెస్టు చేశారు. ఇట్లా నిత్యం ఎందరినో అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ఆదివాసుల సాధారణ జీవితాన్ని కూడా అల్లకల్లోలం చేస్తున్నారు.


ఈ మొత్తానికి నేపథ్యంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. నవంబర్‌ నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఇంటలిజెన్స్‌ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వచ్చే ఏడాది జూన్‌ లోపు చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, బీహార్‌తో సహా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా మిగలకుండా చంపేయాలనే నిర్ణయం అక్కడ తీసుకున్నారు. 2017లో అప్పటి హోం మంత్రి రాజనాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఆపరేషన్‌ సమాధాన్‌కు కొనసాగింపుగా అమితషా ఆపరేషన్‌ ప్రహార్‌ను ఆరంభించాడు. దీన్ని ముందుకు తీసికెళ్లడానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు నిధులు, బలగాలు, ఆయుధాలు విరివిగా అందిస్తామని, ఇది చివరి ఆపరేషన్‌ కావాలనే నిర్ణయం చేశాడు. దీని కోసం పెద్ద ఎత్తున బలగాలను పంపిస్తున్నారు. కొత్తగా చేరే సైనిక బలగాలతో కలిసి సుమారు 20 లక్షల సాయుధులను విప్లవోద్యమ ప్రాంతాలకు కేటాయించినట్లవుతుంది. సరిగ్గా ఈ నిర్ణయం తర్వాత కొద్ది రోజులకే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ ట్రై జంక్షన్‌ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు, అక్రమ కేసులు, అరెస్టులు తీవ్రమయ్యాయి. 


ప్రజా జీవితంలో మానవీయ విలువల కోసం, ప్రజాస్వామిక చైతన్యం కోసం, రాజ్యాంగబద్ధ హక్కుల కోసం ఆలోచిస్తున్న వాళ్లందరూ తమకు ఆటంకంగా తయారయ్యారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వీళ్ల మాటలు, రాతలు, పనులు న్యూసెన్స్‌ అనుకుంటున్నాయి. లౌకిక, ప్రగతిశీల, విప్లవ భావజాలాన్ని తుడిచిపెట్టడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇది ప్రజాసంఘాల మీద దాడి అని విడిగా చూడ్డానికి లేదు. మొత్తంగా లౌకిక, ప్రజాస్వామిక విలువల మీద దాడిగా భావించాలి.

పాణి

Updated Date - 2021-01-07T06:16:18+05:30 IST