అడుగడుగునా అడ్డంకులు

ABN , First Publish Date - 2021-12-02T07:58:46+05:30 IST

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో సాఫీగా సాగిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఇప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర పేరిట రైతులు ..

అడుగడుగునా అడ్డంకులు

  • ‘సర్వేపల్లి’లో పాదయాత్ర భగ్నానికి 
  • వైసీపీ నేతల ప్రయత్నం
  • క్రిస్టియన్‌, ముస్లిం రథాలను అడ్డుకున్న పోలీసులు
  • మహిళా రైతులు కాళ్లు పట్టుకున్నా ససేమిరా
  • చివరకు ఆ వాహనాలు పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
  • మధ్యాహ్నం భోజనానికీ అభ్యంతరాలు
  • రద్దీ రోడ్డుపైనే భోజనం చేసిన రైతులు
  • పొదలకూరులో పాదయాత్రకు ఘనస్వాగతం


నెల్లూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో సాఫీగా సాగిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఇప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర పేరిట రైతులు చేస్తున్న యాత్రకు సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు, పోలీసులు అడ్డంకులు సృష్టించారు. మంగళవారం రాత్రి బసకు అవకాశం లేకుండా చేసిన నాయకులు బుధవారం భోజనాలకు కూడా అనుమతించలేదు. దీంతో రైతులు రోడ్లమీదే భోజనం చేయాల్సి వచ్చింది. అధికార పార్టీ నాయకు లు, పోలీసుల తీరు కారణంగా అమరావతి రైతులు వేదనకు గురైనా బుధవారం సాయంత్రం పొదలకూరు లో యాత్రకు లభించిన అపూర్వస్వాగతం వారికి సాం త్వన కలిగించింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మంగళవారం రాత్రి పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వాస్తవానికి మంగళవారం రాత్రి మరిపూరులోని మరిపూరమ్మ ఆశ్రమంలో రైతులు బస చేయాల్సి ఉంది. బసకు తొలుత అంగీకరించిన గ్రామస్థులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల తో మనసు మార్చుకున్నారు. తమకు ఎదురవుతున్న ఒత్తిళ్ల గురించి పోలీసుల ద్వారా అమరావతి జెఏసీ నాయకులకు తెలిపి తమ ఊరిలో రాత్రి బస చేయవద్దని కోరారు. దీంతో వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకనే  ఉద్దేశంతో మంగళవారం రాత్రి రైతులు నెల్లూరు చేరుకున్నారు. 


రథాలు కదలకముందే..

మంగళవారం తమ పాదయాత్రను ఎక్కడ ముగించారో బుధవారం ఉదయం అక్కడ నుంచే రైతులు నడక మొదలుపెట్టారు. ఉదయం పూజా కార్యక్రమా లు ముగించుకొని 10 గంటలకు యాత్ర మొదలైంది. అయితే రథాలు కదలక ముందే పోలీసులు అడ్డగించా రు. ముస్లిం, క్రిస్టియన్‌ రథాలకు ఈ పాదయాత్రలో అనుమతులు లేవని అడ్డుపడ్డారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీజేపీ నేతలు పోలీసులకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా, మహిళా రైతులు పోలీసుల కాళ్లమీద పడి ప్రాధేయపడినా ససేమిరా అన్నారు. దీంతో రైతులు పొదలకూరు రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఆ రెండు రథాలను స్టేషన్‌కు తరలించారు. 


వంట మరోచోట చేయించి...

పాదయాత్ర రైతులకు మధ్యాహ్న భోజనం కోసం పొదలకూరు సమీపంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే అక్కడ వారిని భోజనాలు వండనివ్వలేదు. దీంతో మరోచోట భోజనాలు తయారు చేయించి పాదయాత్ర సాగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చారు. రైతులు రోడ్డుపైనే కూర్చుని భోజనం చేశారు. కాగా, పొదలకూరులో అడుగుపెట్టినప్పటి నుంచి రాజధాని రైతులకు అపూర్వ స్వాగతం లభించింది. 




పలువురిపై కేసులు

అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న వారే టార్గెట్‌గా పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. నెల్లూరు రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు, వేదాయపాళెం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో టీడీపీ  నాయకులు, సీపీఎం నేతలపైనా కేసులు పెట్టారు. కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించారని, అధిక ధ్వని చేశారనే కారణాలతో కేసులు పెట్టడం గమనార్హం.


అన్నం తినే అర్హత కూడా లేదా!?: జేఏసీ

అన్నంపెట్టే అన్నదాతలకు ప్రశాంతంగా భోజనం చేసే అర్హత కూడా లేదా!? అని అమరావతి జేఏసీ నేతలు ప్రశ్నించారు. బుధవారం పాతయాత్ర ముగిసిన అనంతరం జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజలు పొదలకూరులో మాట్లాడారు. రైతులకు రోడ్లపై అన్నం తినే దుస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు కనీసం భోజనం చేసేందుకు వసతి కూడా లేకుండా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పాన్ని దెబ్బతీయలేరన్నారు.

Updated Date - 2021-12-02T07:58:46+05:30 IST