Abn logo
Aug 14 2020 @ 01:16AM

ఆగస్టు 5, డిసెంబర్ 6

ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ భూమిపూజా మహోత్సవాన్ని దేశ స్వాతంత్ర్య పోరాటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోల్చారు. మందిర్ నిర్మాణ వేడుకలు నాకు మాత్రం సర్వదా 1992 డిసెంబర్ 6 ఘటననే జ్ఞప్తికి తెస్తున్నాయి. పరమ ధర్మం అహింసపై హింస విజయం సాధించిన వేళ అది.


అయోధ్యలో సరయూ నదీ తీరాన రామజన్మభూమిలో అభిరాముని మందిర భూమి పూజా వేడుకలకు సంబంధించిన తమ ప్రత్యక్ష ప్రసారాన్ని సంఖ్యానేక ప్రజలు వీక్షించారని దూరదర్శన్ సగర్వంగా ప్రకటించుకున్నది. ఆత్మస్తుతి! ఒక టీవీ ఛానెల్ గొప్పదనానికి టెలివిజన్ రేటింగ్ పాయింట్సే గీటురాయి అయినప్పుడు బడాయి మాటలకే చెల్లుబాటు మరి.


ధర్మమూర్తి అయిన ఒక మహాకావ్య నాయకుడు కాల గర్భాన్ని చీల్చుకుని, జాతి భాగ్య విధాతగా ఉన్న ఒక రాజకీయ మహానేత సమక్షంలో అపూర్వంగా అభిషిక్తుడయిన శుభ సందర్భమే అయోధ్యలో రామాలయ భూమి పూజ. ఆ వేడుకలను, ఖచ్చితంగా టెలివిజన్ వినోద కార్యక్రమానికే నిర్వహించిన వైనంగా టీవీ ఛానెల్స్ అన్నీ తమ వీక్షకులకు ప్రసారం చేశాయి! ప్రధానమంత్రి ప్రతి కదలికను ఊపిరిసలపని ఉద్వేగంతో ఈ ధరిత్రి మీద ప్రతి రామభక్తుని కళ్ళ ముందు ఉంచడంలో టీవీ కెమెరాలు సఫలమయ్యాయి. ఎంత కోలాహలం! నేను మాత్రం ఎటువంటి హైరానా పడదలుచుకోలేదు. నా ఆలోచనలు గతంలోకి ప్రవహించాయి. మరో సంచలన సంఘటనాత్మక రోజు నా మనస్సులో తళుక్కుమన్నది. నా హృదయం కలుక్కుమన్నది. 2020 ఆగస్టు 5కి చాలాకాలం ముందే 1992 డిసెంబర్ 6 సంభవించింది.


ఆ రోజు ఆదివారం. బాంబే జింఖానా క్లబ్ మైదానంలో క్రికెట్ మ్యాచ్లో పరుగుల పరవశంలో ఉన్నాను. ముంబైలో నేను ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ సిటీ ఎడిటర్గా పని చేస్తున్న రోజులవి. బాబ్రీ మస్జీదును కూల్చివేసిన వార్త మధ్యాహ్నానికి మాకు చేరింది. వెన్వెంటనే ఆట వదిలేసి సమీపంలోనే వున్న మా పత్రిక ప్రధాన కార్యాలయానికి వెళ్ళాను. 24x7 బ్రేకింగ్ న్యూస్ పూర్వ కాలమది. సంఘటనల దృశ్యాలను నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన నవీన సాంకేతికతలు అప్పటికింకా అందుబాటులో లేవు. ఆ మధ్యాహ్నవేళ ‘టైమ్స్’ న్యూస్ రూమ్ ఇంకా నిద్రమత్తులో ఉన్నది. అయోధ్యలో సంభవించిన ఘటనలను ‘ఉత్తర’ భారతావని వార్తా వనరులుగా మాత్రమే పరిగణిస్తున్నందున వాటి గురించిన కథనాలను నివేదించడం న్యూఢిల్లీలోని జాతీయ బ్యూరో బాధ్యత. ఆ ఆదివారం అపరాహ్ణం, అయోధ్యలో సంభవించిన నాటకీయ పరిణామాలకు పూర్తిగా భిన్నమైన, సుదూర ప్రపంచంగా ముంబై ఘటిల్లింది. నాకు బాగా జ్ఞాపకం- అయోధ్య వార్తలపై దక్షిణ ముంబై పార్లమెంటు సభ్యుడు, నగర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మురళీ దేవరా గర్హనీయ ప్రతిస్పందన- ‘నా ఆనందానికి అడ్డు పడవద్దు. నేను మీ బాస్‌తో బ్రిడ్జి ఆడుతున్నాను’ అని మురళి సమాధానమిచ్చాడు. (‘టైమ్స్’ చైర్ పర్సన్ అశోక్ జైన్ ప్రతి వారాంతంలో విధిగా మురళీతో బ్రిడ్జి ఆడుతుండేవారు).


బాబ్రీ మస్జీదు కూల్చివేత దృశ్యాలు ఆ రోజు సాయంత్రానికి బీబీసీలో ప్రసారమయ్యాయి. వీక్షకుల మనస్థితిలోను, వీథుల్లోని పరిస్థితులలోనూ కొట్టొచ్చిన మార్పు చోటు చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ రాత్రి తొలుత, నిత్యం కిక్కిరిసిపోయివుండే మహమ్మద్ అలీ రోడ్ ఇరుకు గల్లీల్లో ఉన్న మినారా మస్జీద్ వద్ద రాళ్ళు రువ్వుడు నిరసనలు ప్రజ్వరిల్లిన వార్త మాకు అందింది. ఆ తరువాత ఒక మూక పోలీస్ వైర్‌లెస్ వ్యాన్‌పై దాడి చేసిన సమాచారమందింది. ఖాకీ దుస్తుల్లో ఉన్నవారిని, మస్జీదును సంరక్షించడంలో విఫలమైన ప్రభుత్వానికి ప్రతినిధులుగా కోపోద్రిక్తులైన ప్రజలు భావించడం జరిగింది. నానావిధ సంఘటనల పట్ల ఎనలేని కుతూహలం, ఆసక్తి చూపే 27 సంవత్సరాల యువ పాత్రికేయుడిని కదా. సహజంగానే ఆ దాడి ప్రదేశానికి జరూరుగా వెళ్ళాను. మహమ్మద్ అలీ రోడ్ అర్ధరాత్రి కూడా మహా సందడిగా వుండే ప్రాంతం. ఉద్రిక్త పరిస్థితులు స్పష్టంగా కనపడతున్నాయి ఎల్లెడలా పోలీసులు పహరా కాస్తున్నారు. కొన్ని తావులలో రాళ్ళు రువ్వడం కొనసాగుతూనే ఉన్నది. మరుసటి రోజు ముస్లిం నాయకుడు ఒకరు బంద్‌కు పిలుపునిచ్చాడు. మధ్య ముంబైలో కర్ఫ్యూ విధించారు. నగర శివారు ప్రాంతాలకు హింసాకాండ వ్యాపించింది. ఆ తరువాత మూడునెలల పాటు ముంబై మహానగర ‘విశ్వజనీన భ్రమలు’ పటాపంచలవుతూనే వున్నాయి. 1992 డిసెంబర్లో పోలీసులు, కోపోద్రిక్తులయిన ముస్లిం బృందాల మధ్య ప్రారంభమైన దాడులు, 1993 జనవరిలో మిలిటెంట్ హిందూ సంస్థల దౌర్జన్యకర కవ్వింపులుగా పరిణమించగా, 1993 మార్చిలో దావూద్ ఇబ్రహీం నాయకత్వంలోని సంఘ వ్యతిరేక శక్తులు విచక్షణారహితంగా వరుసపేలుళ్లకు పాల్పడేందుకు దారితీశాయి.


దరిమిలా సంభవించిన మతోన్మాద అల్లర్లు, ఉగ్రవాద దాడులు దక్షిణ ముంబై ఉన్నత మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాలాంటి నవ యవ్వన యువజనులను నగరంలోని, దేశంలోని వాస్తవ పరిస్థితులను వాస్తవికంగా అర్థం చేసుకునేలా జాగృతం చేశాయి. అమిత జనసందోహంతో నిత్యం నానావిధ వ్యాపకాలలో తలమునకలై వుండే ముంబై ఏ క్షణమైనా బద్ధలవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక అగ్నిపర్వతంపై ఉన్నదన్న కఠోర వాస్తవం అర్థమయింది. బాబ్రీ మస్జీదు ముంబై సామాజిక వ్యక్తిత్వంలోని లోపాలు, లొసుగులను బహిర్గతం చేసింది. ఆగ్రహంతో రగిలిపోతున్న ముస్లింల, కలహాలకు కాలు దువ్వే శివ సైనికుల, సంఘ వ్యతిరేకశక్తుల, పక్షపాత బుద్ధితో వ్యవహరించే పోలీసుల దయదాక్షిణ్యాలపై ముంబై ప్రజాజీవనం ఆధారపడి వున్నదన్న వాస్తవం నాకు అర్థమయింది. భద్ర సీమ అయిన మా దక్షిణ ముంబై నుంచి విశాల ముంబైలోని వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఒక మరొక ముంబై కన్పించింది. నేరాలు, హింసాకాండ, అభాగ్యగతుల నెలవే ఆ మరో ముంబై అని నాకు అర్థమయింది. పరస్పర ద్వేషంతో రగిలిపోతున్న ప్రత్యర్థుల ఘర్షణల్లో చిక్కుకుని ఎంతో నష్టపోయిన అనేక కుటుంబాల వారిని కలుసుకుని మాట్లాడాము. ఇళ్ళను వదిలిపెట్టి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయిన దయనీయ పరిస్థితుల గురించి వారు వివరించినప్పుడు మేము చలించిపోయాము. స్వయం ఉపాధితో బతుకుతున్న పలువురి దుకాణాలు, ఇతర కార్యాలయాలను పూర్తిగా ధ్వంసం చేయడం మమ్ములను కలచివేసింది. ముంబైలో వరుసగా రెండుసార్లు సంభవించిన అల్లర్లు, పేలుళ్ళలో 1000 మందికి పైగా అమాయకులు మరణించారు. ఏమిటి వారి అపరాధం? ఒక నిర్దిష్ట మత అస్తిత్వాన్ని కలిగివుండడమే వారి నేరమా?


ఈ హింసాకాండకు ఒక ప్రత్యక్ష సాక్షిగా, 1993 చివరినాళ్ళలో శ్రీకృష్ణ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాను. శివసేన న్యాయవాది, పార్లమెంటు సభ్యుడు అధిక్ శిరోద్కర్ నన్ను మూడురోజుల పాటు పలు వాదోపవాదాలతో నిశితంగా ప్రశ్నించాడు. నగరాన్ని అతలాకుతలం చేసి, ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిన మతోన్మాద అల్లర్లు, వరుస పేలుళ్ల ఘటనలను విపులంగా వివరిస్తూ ‘వెన్ బాంబే బర్‌్నడ్ ’అనే పుస్తకాన్ని మేము (‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ముంబై రిపోర్టర్ల బృందం) వెలువరించాము. వ్యక్తిగతంగా చూస్తే 1993 సంవత్సరం నా వృత్తిగత జీవితంలో ఒక మహా భీతిదాయక కాలం. నేను అవాజ్యానురాగంతో ప్రేమించిన నగరం ఆ దురదృష్టకర ఘటనలతో గాయపడింది, మనస్తాప పడింది. ఈ అఘాతాలను ఆ మహాజన పురం ఎన్నటికీ మరచిపోలేదు. మతాల ప్రాతిపదికన ముంబై భౌతికంగా, మానసికంగా చీలిపోయింది. ఇప్పటికీ ఆ తీవ్ర వ్యాకుల పరిస్థితుల నుంచి పూర్తిగా ఉపశమనం పొందనే లేదు మరి.


ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాలంలోకి జారిపోయాయి. ఒక తరం వెళ్ళిపోయింది. కొత్త తరం ప్రభవించింది. మార్పులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అధిక సంఖ్యాక వాదుల ఆధిపత్య రాజకీయాలు ప్రధాన స్రవంతిగా వర్థిల్లుతున్నాయి. లౌకికవాదం, మతతత్వం; చట్టం, చట్ట విరుద్ధత మధ్య రేఖలను ఈ కొత్త రాజకీయాలు తమకు అనుకూలంగా చెరిపివేశాయి. 1992లో అయోధ్య విధ్వంసకాండలో తమ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన పాత్రకు తాను ఎంతో గర్విస్తున్నానని శివసేన అధినేత బాల్ ఠాక్రే ప్రకటించిన విషయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఆయన నేతృత్వంలో ఎదిగిన శివసేనే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో ఒక జూనియర్ భాగస్వామి!


అయోధ్య ఉద్యమంతో భారతీయ జనతా పార్టీ ఎనలేని ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఆ పార్టీ ప్రతిష్ఠ అపారంగా పెరిగింది. అయోధ్య ఆ పార్టీకి రాజకీయ పతాక అయింది. దేశ రాజకీయాలలో ఒక ప్రాబల్య పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. 1990లో సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర నిర్వహణలో కీలక పాత్ర వహించిన నరేంద్ర మోదీ పేరు ప్రతిష్ఠలు పొందారు. రాజకీయాలలో ఒక సుస్థిర స్థానాన్ని సాధించుకున్నారు. అంతిమంగా భారతదేశ మహా శక్తిమంతుడైన నాయకుడుగా ప్రభవించారు. ఈ క్రమంలో భారతీయ ముస్లింలు తీవ్ర భీతావహులయ్యారు. ‘ఇతరులు’గా వెలివాడలకు గురయ్యారు. జాతి జీవనంలో వారి క్రియాశీల పాత్రకు ఎన్నో అవరోధాలు నెలకొంటున్నాయి.


చట్టం తన పని తాను చేసుకుపోవడంలో విఫలమయింది. ముంబైలో అల్లర్లకు సంబంధించి నమోదైన 2000 కేసులను మూసివేశారు. కొద్దిమందిని మాత్రమే నేరస్థులుగా నిర్ధారించారు. శిక్ష విధించారు. అయితే వారు ఎంతోకాలం జైలులో లేరు. బెయిల్‌పై విడుదలై స్వేచ్ఛా జీవితం గడుపుతున్నారు. శివసేనను, ముంబై పోలీసధికారులను అభిశంసించిన శ్రీకృష్ణ కమిషన్ నివేదిక సిఫారసులపై పాలకులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా ఆ నివేదికను చెత్త బుట్ట పాలు చేసింది. లక్నోలో ఒక ప్రత్యేక న్యాయస్థానంలో బాబ్రీ మస్జీదు కూల్చివేత కేసుపై విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. అయితే ఎవరినీ దోషులుగా నిర్ధారించనే లేదు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొనబడిన అగ్రనాయకులు ఇప్పుడు పాలకవర్గ కులీనులుగా గౌరవాదరాలు పొందుతున్నారు. బాబ్రీ కూల్చివేత అనంతర హింసాకాండలో నష్టపోయిన వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తమకు కనీస మాత్రంగానైనా న్యాయం జరిగిందని చెప్పలేకపోతున్నారు.


ఆనాటి విధ్వంసకాండ దృశ్యాలు నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి; భీతి గొల్పుతున్నాయి. విశ్వసంస్కృతికి నెలవైన ముంబై నగరంలో సామాజిక సామరస్యత ఛిద్రమైపోయింది. ముంబై వాసులు నిరాశా నిరుత్సాహాల నుంచి ఇంకా బయటపడనే లేదు. భయం వారిని వెంటాడుతూనే వున్నది. ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ భూమిపూజా మహోత్సవాన్ని దేశ స్వాతంత్ర్య పోరాటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోల్చారు. మందిర్ నిర్మాణ వేడుకలు నాకు మాత్రం సర్వదా 1992 డిసెంబర్ 6 ఘటనలనే జ్ఞప్తికి తెస్తున్నాయి. రాజ్యాంగ ధర్మాలపై విధ్వంసక చర్యలు, పరమ ధర్మం అహింసపై హింస విజయం సాధించిన అశుభ వేళ అది. 


తాజా కలం: నా బిడ్డలు బాబ్రీ విధ్వంసానంతర తరం వారు. కొత్త సహస్రాబ్దిలో పుట్టిన సంఖ్యానేకుల వలే ఆ గతంతో ఎటువంటి సంబంధం లేనివారు. ముంబై మతోన్మాద అల్లర్లపై మేము రూపొందించిన పుస్తకాన్ని వారు ఏదో ఒక రోజు చదువుతారు. తళుకులీనుతున్న ‘కొత్త’ భారతదేశం రక్త పంకిలమైన పాత వ్యవస్థ శిథిలాలపై నిర్మాణమయిందన్న సత్యం వారికి తప్పక తెలిసివస్తుంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Advertisement
Advertisement
Advertisement