Abn logo
Sep 3 2021 @ 11:05AM

Kuwait లో 8 నెలల తర్వాత అనూహ్య పరిణామం.. భారీ ఉపశమనం!

కువైత్ సిటీ: కువైత్‌లో ఎనిమిది నెలల తర్వాత కరోనా కేసులు భారీగా తగ్గడం ఆ దేశ ఆరోగ్యశాఖకు భారీ ఉపశమనం కలిగించింది. ఆగస్టు నెలలో మొత్తం 11,322 కేసులు నమోదు కాగా, 91 మరణాలు సంభవించాయి. అంతకుముందు జులై మాసంలో ఈ సంఖ్య 38,587గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగే కరోనా సంబంధిత మరణాలు కూడా జులైతో పోల్చుకుంటే ఆగస్టులో ఏకంగా 72 శాతం మేర తగ్గాయని అధికారులు వెల్లడించారు. జులైలో ప్రతిరోజు పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని, ఆ నెల కువైత్‌కు తీరని విషాదాన్ని మిగిల్చిందని ఆరోగ్యశాఖ తెలిపింది.      


అలాగే ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఇలా ఐసీయూలో కరోనా రోగుల సంఖ్య తగ్గడం జనవరి తర్వాత ఆగస్టు నెలలోనే జరిగింది. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా కేవలం 84 మంది కరోనా రోగులు మాత్రమే ఐసీయూలో ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతకుముందు నెలతో పోల్చితే 250 శాతం తగ్గిందని తెలిపింది. ఐసీయూలో చేరేవారి సంఖ్య భారీగా తగ్గడంతో మూడు కోవిడ్-19 ఐసీయూ వార్డ్స్‌ను మూసివేసినట్లు జబేర్ అల్ అహ్మద్ ఆస్పత్రిలోని ఐసీయూ కన్సల్టేంట్ డా. అబ్దుల్లా అల్ ముతైరి వెల్లడించారు.  


వ్యాక్సినేషన్ ఎఫెక్ట్..

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాలు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా తగ్గడానికి కారణం వ్యాక్సినేషన్ వల్లే సాధ్యమైందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. టీకాలు వేయించుకుంటున్న వారి సంఖ్య భారీ పెరగడంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని వారు పేర్కొన్నారు. గత వారం కువైత్ ఆరోగ్యశాఖ మంత్రి డా. బసెల్ అల్ సభా కూడా వ్యాక్సినేషన్‌పై ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 70 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, మొత్తం జనాభాలో 70 శాతం మంది టీకాలు వేసుకున్నారా లేదా టీకాకు అర్హులైన వారు అంటే 12 ఏళ్లు పైబడిన వారేనా అనేది మాత్రం మంత్రి స్పష్టంగా చెప్పలేదు. ఇక ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని కోవిడ్-19 కమిటీ సభ్యుడు డా. ఖలీద్ అల్ సయీద్ మాట్లాడుతూ, సెప్టెంబర్ నాటికి కువైత్ హెర్డ్ ఇమ్యూనిటీని సాధించబోతుందని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.     

తాజా వార్తలుమరిన్ని...