బ్రిస్బేన్‌ రగడ.. రూల్స్‌ పాటిస్తేనే రండి

ABN , First Publish Date - 2021-01-04T09:25:29+05:30 IST

ఆస్ట్రేలియాతో జరగాల్సిన నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈనెల 15 నుంచి క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే సిడ్నీలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో క్వీన్స్‌లాండ్‌ తమ సరిహద్దులను మూసివేసింది...

బ్రిస్బేన్‌ రగడ.. రూల్స్‌ పాటిస్తేనే రండి

  • భారత జట్టుకు క్వీన్స్‌లాండ్‌ స్పష్టీకరణ
  • చివరి టెస్టు వేదికపై మల్లగుల్లాలు
  • వేచిచూసే ధోరణిలో బీసీసీఐ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరగాల్సిన నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈనెల 15 నుంచి క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే సిడ్నీలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో క్వీన్స్‌లాండ్‌ తమ సరిహద్దులను మూసివేసింది. అంతేకాకుండా సిడ్నీ నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారు కఠిన నిబంధనల్ని పాటించాల్సిందేనని, ఎలాంటి సడలింపులూ ఉండవని స్పష్టం చేసింది. ఇక ఆసీస్‌ మీడియా కథనం ప్రకారం.. బ్రిస్బేన్‌ వెళ్లిన ఆటగాళ్లంతా కఠిన క్వారంటైన్‌ పాటించాలి. హోటల్‌-స్టేడియం-హోటల్‌కు మాత్రమే పరిమితమవ్వాలి. ఎవరైనా పాజిటివ్‌గా తేలితే అందరూ మరోసారి క్వారంటైన్‌కు వెళ్లాలి. ఇదిలావుండగా ఒకవేళ భారత జట్టుకు ఈ నిబంధనలు పాటించడం ఇష్టం లేకపోతే.. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని కూడా క్వీన్స్‌లాండ్‌ ఆరోగ్య మంత్రి తెగేసి చెప్పారు. దీనికి భారత క్రికెటర్లు సుముఖంగా లేనట్టు సమాచారం. తమ ఆటగాళ్లంతా తిరిగి హోటల్‌ గదులకే పరిమితమైతే.. అది వారి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఆందోళనపడుతోంది. ‘ఐపీఎల్‌ కోసం దుబాయ్‌లోనే ఆటగాళ్లంతా 14 రోజుల క్వారంటైన్‌ ముగించుకున్నారు.


ఆసీస్‌కు వచ్చాక మరో 14 రోజులు అలాగే గడిపారు. వాస్తవానికి ఇక్కడి రావడానికి ముందు నుంచే కఠిన బయో బబుల్‌లో ఉన్నారు. ఇప్పుడు టూర్‌ చివర్లో మరోసారి క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆటగాళ్లంతా మళ్లీ హోటల్‌ గదులకే పరిమితమైతే మాత్రం బ్రిస్బేన్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఆఖరి టెస్టును కూడా సిడ్నీలోనే ఆడేందుకు సిద్ధం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపాడు. మరోవైపు సోమవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. హోటల్‌లో కేటాయించిన స్థలంలోనైనా ఆటగాళ్లందరూ కలుసుకునే విధంగా అనుమతించాలని కోరనుంది. 


కొద్ది రోజులు వేచిచూశాకే..: తాజా పరిణామాలపై బీసీసీఐ ఆచితూచి స్పందిస్తోంది. నిబంధనలు పాటిస్తేనే రండంటూ క్వీన్స్‌లాండ్‌ ప్రకటించిన వెంటనే.. అక్కడికి వెళ్లేది లేదని బోర్డు తెగేసి చెప్పినా.. ఆ తర్వాత మెత్తబడింది. కొద్ది రోజులపాటు వేచి చూశాకే చివరి టెస్టు వేదిక మార్పుపై స్పందించాలని భావిస్తోంది. ‘ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా ఉంది. కొద్ది రోజులు వేచి చూశాకే స్పష్టత వస్తుంది’ అని బోర్డు అధికారి పేర్కొన్నాడు. ఇదిలావుండగా షెడ్యూల్‌ ప్రకారం చివరి టెస్టు బ్రిస్బేన్‌లోనే జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆసీస్‌ ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ వ్యక్తం చేశాడు. 


ప్రాక్టీ్‌సకు వర్షం అడ్డంకి

ఆదివారం జరగాల్సిన భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఆటగాళ్లంతా ఇండోర్‌లోని జిమ్‌లో చెమటోడ్చారు. 




ఓటమి భయంతోనే..

భారత జట్టుకు బ్రిస్బేన్‌లో చెత్త రికార్డు ఉందని, అందుకే అక్కడికి వెళ్లేందుకు భయపడుతోందని ఆసీస్‌ మాజీ కీపర్‌ బ్రాడ్‌ హాడిన్‌ వ్యంగ్యంగా స్పందించాడు. గాబా మైదానంలో ఎవరూ గెలవలేదని, ఆసీ్‌సకు అది పెట్టని కోట అంటూ గుర్తుచేశాడు. 


అందరూ కలిసే సిడ్నీకి పయనం

ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంటున్న రోహిత్‌, గిల్‌, పంత్‌, పృథ్వీ షా, సైనీ కూడా మిగతా ఆటగాళ్లతో కలిసే సిడ్నీకి బయలుదేరనున్నారు. మెల్‌బోర్న్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం జట్టంతా ప్రత్యేక విమానంలో వెళ్లనుంది. అంతకుముందు ఈ ఐదుగురిని జట్టుతో కలవనీయకుండా ప్రత్యేకంగా పంపిస్తారని వార్తలు వెలువడ్డాయి. ‘సీఏ ఇచ్చిన ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే మా ఆటగాళ్లు నిబంధన అతిక్రమించినట్టు ఎక్కడా లేదు. అలాంటిదేమైనా జరిగిందో? లేదోనని నిర్ధారించుకుంటామని మాత్రమే వారు చెప్పారు. అందుకే మిగతా వారితో కలిసి వారు సిడ్నీ వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీలేదు. అంతేకాకుండా ఈ విషయంలో బయట ఎన్ని కథనాలు వినిపిస్తున్నా మా క్రికెటర్ల దృష్టంతా మూడో టెస్టుపైనే ఉంది. వారు బయటి విషయాల్ని పట్టించుకోవడం లేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి స్పష్టం చేశాడు. అలాగే విచారణ జరుగుతున్నప్పటికీ రోహిత్‌, పంత్‌, గిల్‌ కూడా మూడో టెస్టులో ఆడే అవకాశాలున్నాయి. 




మాస్క్‌ల్లేకుండా విరాట్‌, పాండ్యా..

భారత జట్టుకు చెందిన ఐదుగురు ఆటగాళ్లే కాకుండా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా  కూడా బయో బబుల్‌ను అతిక్రమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసీ్‌సతో పరిమిత ఓవర్ల సిరీస్‌ సందర్భంగా గతనెల 7న వీరిద్దరు ముఖానికి మాస్క్‌లు కూడా లేకుండా ఓ బేబీ బట్టల దుకాణానికి వెళ్లారని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ పేర్కొంది. రూల్స్‌ ప్రకారం ఆటగాళ్లు బయటికి వెళ్లే సమయంలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. అయితే ఆ షాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఫొటోలో కోహ్లీ, పాండ్యా మామూలుగానే ఉన్నారు. అయితే ఇది చిన్న విషయం కావడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.

Updated Date - 2021-01-04T09:25:29+05:30 IST