3 సెషన్లు.. 324 పరుగులు

ABN , First Publish Date - 2021-01-19T06:33:13+05:30 IST

నాటకీయ మలుపులతో సాగుతున్న ఆఖరి టెస్టు మరింత పసందుగా మారింది. నాలుగో రోజున భారత బౌలర్ల వికెట్ల జోరు.. అటు ఆసీస్‌ పరుగుల హోరుతో ఇరు జట్ల మధ్య సమాన పోరే నెలకొంది. దీంతో భారత్‌ ముందు 328 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది...

3 సెషన్లు.. 324 పరుగులు

  • లక్ష్యం 328 జూ ప్రస్తుత భారత్‌ స్కోరు 4/0 
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 294  
  • సిరాజ్‌కు 5, శార్దూల్‌కు 4 వికెట్లు

నాటకీయ మలుపులతో సాగుతున్న ఆఖరి టెస్టు మరింత పసందుగా మారింది. నాలుగో రోజున భారత బౌలర్ల వికెట్ల జోరు.. అటు ఆసీస్‌ పరుగుల హోరుతో ఇరు జట్ల మధ్య సమాన పోరే నెలకొంది. దీంతో భారత్‌ ముందు 328 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. కానీ మనోళ్ల ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే వరుణుడి రాకతో మొత్తం 23 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఆఖరి రోజున గాబాలో టీమిండియా రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టిస్తుందా... లేక డ్రాగా ముగించి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని తమ వద్దే ఉంచేసుకుంటుందో తేలాల్సి ఉంది. అయితే ఇది కూడా వాతావరణం మీదే ఆధారపడి ఉంది. మరోవైపు హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన మూడో టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగి ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు.


బ్రిస్బేన్‌: నాలుగు టెస్టుల సిరీ్‌సలో అసమాన పోరాటాన్ని ప్రదర్శిస్తున్న భారత జట్టు ముందు మరో సవాల్‌. చివరి టెస్టులో గెలిచేందుకు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. పేసర్లు సిరాజ్‌ (5/73), శార్దూల్‌ ఠాకూర్‌ (4/61) సూపర్‌ బౌలింగ్‌ కారణంగా ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌ (55), వార్నర్‌ (48), హారిస్‌ (38), గ్రీన్‌ (37) రాణించారు. ఆసీ్‌సకు 327 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు నాలుగో రోజే ఈ లక్ష్యాన్ని సాధ్యమైంత తగ్గిద్దామని భావించినా వర్షం కారణంగా వీలు కాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 1.5 ఓవర్లలో 4 పరుగుల వద్ద భారీ వర్షం కురిసింది. మరో 23 ఓవర్ల ఆట మిగిలినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. భారత్‌ గెలిచేందుకు 98 ఓవర్లలో మరో 324 పరుగులు చేయాల్సి ఉంది. ఇక చివరి రోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది.


తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు: 21/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీ్‌సకు శుభారంభం దక్కింది. అయితే భారత బౌలర్లు కూడా చెలరేగి నాలుగు వికెట్లతో దెబ్బతీశారు. ఆరంభంలో ఓపెనర్లు వార్నర్‌, హారిస్‌ ధాటిగా పరుగులు సాధించారు. ముఖ్యంగా హారిస్‌ చేసిన 38 పరుగుల్లో 8 ఫోర్లు ఉండడం విశేషం. అటు హాఫ్‌ సెంచరీవైపు సాగుతున్న వార్నర్‌ కూడా ప్రమాదకరంగా కనిపించాడు. కానీ తొలి వికెట్‌కు 89 పరుగులు చేర్చాక వరుస ఓవర్లలో ఈ జోడీ పెవిలియన్‌కు చేరింది. ముందుగా హారి్‌సను ఠాకూర్‌.. వార్నర్‌ను సుందర్‌ ఎల్బీ చేయడంతో భారత్‌ సంబరాల్లో మునిగింది. కొద్దిసేపటికే పేసర్‌ సిరాజ్‌ డబుల్‌ ధమాకా అందించాడు. 31వ ఓవర్‌లో లబుషేన్‌ (25), వేడ్‌ (0) వికెట్లు తీయడంతో ఆసీస్‌ 123/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. కానీ మరో వికెట్‌ పడకుండా లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.


ఆదుకున్న స్మిత్‌, గ్రీన్‌: రెండో సెషన్‌లోనూ ఇరు జట్ల నుంచి పోటాపోటీ ఎదురైంది. ఫామ్‌లో ఉన్న స్మిత్‌, గ్రీన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా అటు భారత బౌలర్లు కూడా పట్టు వీడలేదు. ఇక సుందర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్‌ వదిలేశాడు. కానీ చివరికి తను సిరాజ్‌ చేతికే చిక్కాడు. 55వ ఓవర్‌లో స్మిత్‌ గ్లోవ్స్‌కు తాకిన బంతి కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయితే తాను నాటౌట్‌ అంటూ స్మిత్‌ రివ్యూకు వెళ్లాడు. అయినా అతడికి నిరాశ తప్పలేదు. దీంతో ఐదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత గ్రీన్‌, పెయిన్‌ (27) కాసేపు పోరాడినా ఈ ఇద్దరినీ ఠాకూర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. వర్షం కారణంగా కాస్త ముందుగానే టీ విరామం ప్రకటించారు.


చివరి సెషన్‌కు ఆటంకం: టీ బ్రేక్‌ సమయానికి 243/7 స్కోరుతో ఉన్న ఆసీస్‌ టెయిలెండర్ల దూకుడుతో మరో 58 బంతుల్లోనే 51 పరుగులు చేసింది. కమిన్స్‌ (28 నాటౌట్‌) తుదికంటా క్రీజులో నిలిచాడు. అయితే జట్టు ఆధిక్యం 300 దాటినా ఆసీస్‌ మాత్రం ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయలేదు. మరోవైపు సిరాజ్‌, ఠాకూర్‌ మధ్య ఐదో వికెట్‌ కోసం పోటీ నెలకొంది. చివరకు 76వ ఓవర్‌లో హాజెల్‌వుడ్‌ క్యాచ్‌ను థర్డ్‌మ్యాన్‌లో ఉన్న ఠాకూర్‌ అందుకోవడంతో సిరాజ్‌కు ఐదో వికెట్‌ దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌ వర్షం కారణంగా 11 బంతులు మాత్రమే ఆడగలిగింది. దీంతో ఈ సెషన్‌ 12 ఓవర్లలోపే ముగిసినట్టయింది.


గాబా మైదానంలో భారత్‌ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా సిరాజ్‌. గతంలో ప్రసన్న (1968), బిషన్‌ సింగ్‌ బేడీ, మదన్‌ లాల్‌ (1977), జహీర్‌ ఖాన్‌ (2003) ఈ ఫీట్‌ సాధించారు.


 గాబా మైదానంలో అత్యధిక లక్ష్య ఛేదన 236 మాత్రమే. 1951లో ఆస్ట్రేలియా జట్టు విండీ్‌సను ఓడించింది. ఇక తమ టెస్టు చరిత్రలో భారత్‌ రెండు సార్లు మాత్రమే 300+ స్కోరును ఛేదించింది. 




స్కోరుబోర్డు

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 369

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 336

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 38; వార్నర్‌ (ఎల్బీ) సుందర్‌ 48; లబుషేన్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 25; స్మిత్‌ (సి) రహానె (బి) సిరాజ్‌ 55; వేడ్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0; గ్రీన్‌ (సి) రోహిత్‌ (బి) శార్దూల్‌ 37; పెయిన్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 27; కమిన్స్‌ (నాటౌట్‌) 28; స్టార్క్‌ (సి) సైనీ (బి) సిరాజ్‌ 1; లియాన్‌ (సి) అగర్వాల్‌ (బి) శార్దూల్‌ 13; హాజెల్‌వుడ్‌ (సి) శార్దూల్‌ (బి) సిరాజ్‌ 9;  ఎక్స్‌ట్రాలు:13 మొత్తం: 75.5 ఓవర్లలో 294 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-89, 2-91, 3-123, 4-123, 5-196, 6-227, 7-242, 8-247, 9-275, 10-294. బౌలింగ్‌: సిరాజ్‌ 19.5-5-73-5; నటరాజన్‌ 14-4-41-0; సుందర్‌ 18-1-80-1; శార్దూల్‌ 19-2-61-4; సైనీ 5-1-32-0.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 4; గిల్‌ (బ్యాటింగ్‌) 0; మొత్తం: 1.5 ఓవర్లలో 4/0. బౌలింగ్‌: స్టార్క్‌ 1-0-4-0; హాజెల్‌వుడ్‌ 0.5-0-0-0.





డ్రా అయితే ఆసీస్‌  ఓడినట్టే!

భారత జట్టు పూర్తిస్థాయి ఆటగాళ్లతో బరిలోకి దిగనందున ఈ సిరీస్‌ డ్రాగా ముగిస్తే అది తమ జట్టు ఓటమిగానే భావించాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. పైగా ఆసీస్‌ జట్టులో స్మిత్‌, వార్నర్‌ కూడా ఉన్నారన్నాడు. మరోవైపు చివరి రోజు ఆటలో భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ మెరుగ్గా ఆడితే ఛేదన కోసం రిషభ్‌ పంత్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందే పంపాలని సూచించాడు.


Updated Date - 2021-01-19T06:33:13+05:30 IST