ఆయుష్మాన్‌ భారత్‌లోకి..323 ఆస్పత్రులు

ABN , First Publish Date - 2021-06-15T08:44:19+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పఽథకం ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది.

ఆయుష్మాన్‌ భారత్‌లోకి..323 ఆస్పత్రులు

  • ఆరోగ్యశ్రీ అనుసంధాన జాబితాలోని దవాఖానాలు ఈ పథకంలోకి..
  • ఎంప్యానెల్‌ అయినవాటితో త్వరలో వైద్య శాఖ సమావేశం..
  •  ఇప్పటికే ఎంవోయూ పూర్తి.. త్వరలోనే అమలు
  • కొత్తగా ఎంప్యానెల్‌ అయ్యేందుకు నిబంధనలు సరళీకృతం..
  • నిరీక్షణ లేకుండా జిల్లా స్థాయిలోనే వెసులుబాటు

హైదరాబాద్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పఽథకం ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారైనట్లు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మరో నెల రోజుల్లో అమలయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ కింద ఉన్న 323 ప్రైవేటు ఆస్పత్రులు.. కేంద్ర ఆరోగ్య పథకం కింద ఎంప్యానెల్‌ జాబితా పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి ముందుగా ఎంప్యానెల్‌ ఆస్పత్రులతో సమావేశం నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కాగా, ఆయుష్మాన్‌ భారత్‌తో.. ఆరోగ్య శ్రీని కలిపి అమలు చేయాలని గత ఏడాది డిసెంబరు 30న రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ ఏడాది మే 18న నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కూడా కుదుర్చుకుంది. 


ఆ తర్వాత అమలు ఎలా అన్నదానిపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులతో కమిటీని కూడా వేశారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్‌ జాబితాలో చేరాలంటే ఇప్పటిదాక నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఏదైనా ఒక ఆస్పత్రిని ఎంప్యానెల్‌ చేయాలంటే ముందుగా ఆరోగ్య శ్రీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశమై చర్చించి అనుమతి ఇవ్వాలి. అయితే, ఆరోగ్య శ్రీ బోర్డు సమావేశం కావడం చాలా అరుదు. దీంతో ఎంప్యానెల్‌ కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇకపై మాత్రం బోర్డే అనుమతి ఇవ్వాలన్న నిబంధన మార్చనున్నట్లు సమాచారం. ఎన్ని ఆస్పత్రులు చేరితే ప్రజలకు అంత మేలు అని భావనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్నవారికి.. నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలుంటే ఎంప్యానెల్‌ అయ్యే అవకాశం ఇవ్వాలనే యోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉంది. అవసరమైతే జిల్లా స్థాయిలోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీలో ఎం ప్యానెల్‌ అయ్యే విధానం తీసుకొచ్చే ఆలోచన ఉందని చెబుతున్నారు.


రెండూ కలిపి అమలు చేయడంపై దృష్టి

ప్రస్తుతం ఆరోగ్య శ్రీ కింద 923 వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో 1,578 వ్యాధులకు చికిత్స పొందే వీలుంది. దీనిప్రకారం రెండు పథకాల్లో ఏమేం వ్యాధులు ఉన్నాయనే వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకోలేని వాటిని ఆయుష్మాన్‌ భారత్‌లోకి తీసుకువస్తారు. రోగులు ఏదో ఒక పథకం కింద చికిత్స తీసుకునేలా రెండింటిని కలిపి అమలు చేయబోతున్నారు. దీనిపై ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేసి కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. కాగా, ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రానికి ఏటా రూ.180 కోట్లు వస్తాయని లెక్క తేల్చారు. 


ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య శ్రీకి రూ.720 కోట్లు కేటాయించింది. పథకం కింద సుమారు కోటి కుటుంబాలున్నాయి. ఇందులో 26.11 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి రానున్నాయి. మిగిలిన 77.19 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీలో ఉంటాయి. ఆయుష్మాన్‌లో ఒక కుటుంబం ఏడాదికి రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సలు చేయించుకునే వీలుంది. ఆరోగ్య శ్రీలో రూ.2 లక్షల వరకే అనుమతి ఉంది. గతంలో ఆయుష్మాన్‌ భారత్‌లో ఎం ప్యానెల్‌ అయ్యేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు మొగ్గు చూపలేదు. ఆ పథకం కింద వర్తింపజేసే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని.. దూది, సూదులకు కూడా సరిపోవని తేల్చి చెప్పాయి. తాజాగా అమలు ప్రక్రియ మొదలుకానుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు ఏ మేరకు సహకరిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.


‘ఆయుష్మాన్‌’ ప్యాకేజీల ధరలు తెలియాల్సి ఉంది

ఆయుష్మాన్‌ భారత్‌లో ప్యాకేజీల ధరలు ఏ విధంగా ఉన్నాయో చూడాల్సి ఉంది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు మాకు అధికారిక సమాచారం రాలేదు. ప్యాకేజీ ధరలు తక్కువగా ఉన్నాయనే భావించే ఆస్పత్రులు ఎం ప్యానెల్‌ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం.

- డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు, తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు

Updated Date - 2021-06-15T08:44:19+05:30 IST