సింధు, ప్రణీత్‌కు సులువు

ABN , First Publish Date - 2021-07-09T08:41:07+05:30 IST

ఒలింపిక్స్‌ డ్రాను బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ గురువారం ప్రకటించింది. రియో గేమ్స్‌ రజత పతక విజేత పీవీ సింధు, సాయిప్రణీత్‌కు లీగ్‌లో సులువైన డ్రా ..

సింధు, ప్రణీత్‌కు సులువు

సాత్విక్‌ జోడీకి క్లిష్టం

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ డ్రా

కౌలాలంపూర్‌: ఒలింపిక్స్‌ డ్రాను బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ గురువారం ప్రకటించింది. రియో గేమ్స్‌ రజత పతక విజేత పీవీ సింధు, సాయిప్రణీత్‌కు లీగ్‌లో సులువైన డ్రా ఎదురుకాగా..వరల్డ్‌ నెం. 10 డబుల్స్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ షెట్టి ఆరంభంలోనే గట్టి ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తోంది. మహిళల సింగిల్స్‌లో ఆరో సీడింగ్‌ పొందిన సింధు గ్రూప్‌ ‘జె’లో బరిలోకి దిగనుంది. లీగ్‌ దశలో ప్రపంచ నెంబర్‌ 34 ఎన్‌గాన్‌ (హాంకాంగ్‌), 58వ ర్యాంకర్‌ పొలకార్పోవా (ఇజ్రాయెల్‌)ను ఢీకొననుంది. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన 14వ సీడ్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌తో సింధు తలపడే అవకాశ ముంది. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘డి’లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ కజౌవ్‌ (నెదర్లాండ్స్‌), 47వ ర్యాంకర్‌ జిల్బర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)తో 13వ సీడ్‌ సాయిప్రణీత్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. గ్రూపులో కనుక ప్రణీత్‌ టాప్‌లో నిలిస్తే గ్రూప్‌ ‘సి’ విజేతను ప్రీక్వార్టర్స్‌లో ఎదుర్కొనే చాన్సుంది. 


పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ ‘ఎ’లో సాత్విక్‌ జోడీ టాప్‌సీడ్‌ ఇండోనేసియా ద్వయం కెవిన్‌ సంజయ-ఫెర్నాల్డీ, ప్రపంచ నెం. 3 చైనీస్‌ తైపీ జంట లీ యాంగ్‌-వాంగ్‌ చీ, 18వ సీడ్‌ ఇంగ్లండ్‌ జంట లేన్‌-సీన్‌ వెన్‌డీ తదితర కఠినమైన ప్రత్యర్థులతో తలపడనుంది. డబుల్స్‌లో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్స్‌కు చేరతాయి. సాత్విక్‌ ద్వయం తమ గ్రూప్‌లో మొదటి స్థానం సాధిస్తే.. గ్రూప్‌ ‘డి’ రన్నరప్‌ జంటను క్వార్టర్స్‌లో ఢీకొంటుంది. ఒకవేళ గ్రూప్‌ రన్నరప్‌గా నిలిస్తే గ్రూప్‌ ‘బి’ విజేతతో భారత్‌ జోడీ తలపడాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-07-09T08:41:07+05:30 IST