వడ్డీవ్యాపారిని మించిపోయిన బ్యాంకులు

ABN , First Publish Date - 2020-06-18T05:46:42+05:30 IST

కరోనా నేపథ్యంలో బ్యాంకు రుణాల ఈఎంఐ లపై ఆర్బీఐ మొదట 3 నెలలు మారటోరియం విధించింది. తరువాత దాన్ని మరో మూడు నెలలకు పొడిగించింది. కాస్త రిలీఫ్ దొరికిందని సామాన్యుడు సంబరపడ్డాడు కానీ ఆ సంతోషం త్వరలోనే ఆవిరైంది...

వడ్డీవ్యాపారిని మించిపోయిన బ్యాంకులు

కరోనా నేపథ్యంలో బ్యాంకు రుణాల ఈఎంఐ లపై ఆర్బీఐ మొదట 3 నెలలు మారటోరియం విధించింది. తరువాత దాన్ని మరో మూడు నెలలకు పొడిగించింది. కాస్త రిలీఫ్ దొరికిందని సామాన్యుడు సంబరపడ్డాడు కానీ ఆ సంతోషం త్వరలోనే ఆవిరైంది. రిజర్వ్ బ్యాంకు మారటోరియం ప్రకటించినా బ్యాంకులు తమ సొంత అజెండాలు ప్రకటించుకున్నాయి. మారటోరియానికి ఆంక్షలు విధించాయి. ఆ తరువాత రుణ గ్రహీతల ఖాతాల్లో ఉన్న సొమ్మును వాయిదాల చెల్లింపుకు మళ్ళించుకున్నాయి. ఆర్బీఐ ఏదో చెబితే కాదని, తమ రూల్స్ ప్రకారం నడుచుకుంటేనే మారటోరియం విషయాన్ని పరిశీలిస్తామని కొన్ని బ్యాంకులు తేల్చి చెప్పాయి. ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులూ, ఎన్ బీఎఫ్సీలు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలూ అందరిదీ ఒకే బాట. 


మారటోరియం వ్యవధిలోనూ వడ్డీ వసూలుపై సుప్రీంకోర్టులో గజేంద్ర శర్మ పిటిషన్‌ వేశారు. దీనివల్ల రుణగ్రహీతలకు ఉపశమనం లభించకపోగా మరింత భారం పడుతున్నదనీ, లాక్‌డౌన్‌ తన ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రసాదించిన జీవించే హక్కును కోల్పోతున్నానని ఆయన పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, మారటోరియం కాలంలో కూడా రుణాలపై వడ్డీ వసూలు తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో ఈఎంఐ లపై వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులకు సుమారు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆర్బీఐ ఓ అఫిడవిట్‌ ద్వారా కోర్టుకు చెప్పిన విషయాన్నీ న్యాయస్థానం తప్పు పట్టింది. ఓ చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నారనీ, సంక్షోభ కాలంలోనూ లాభనష్టాలు ఆలోచిస్తున్నారా? అనీ ఆర్బీఐపై మండిపడింది. రుణాలపై వడ్డీ చెల్లింపులు ఉండరాదని, వడ్డీలపై వడ్డీలు వసూలు చేయరాదన్న రెండు అంశాలు తమ పరిశీలనలో ఉన్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశాన్ని పూర్తిగా బ్యాంకులకు వదిలిపెట్టడం కాక, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెబుతూ, కేంద్రం, ఆర్బీఐ తమ నిర్ణయాలను సమీక్షించుకొనేందుకు సమయం ఇస్తూ కేసు వాయిదావేసింది. బడా పారిశ్రామికవేత్తలకు ప్రతి ఏటా లక్షల కోట్ల రుణాలను ఉద్దేశ పూర్వకంగా మాఫీ చేయగా లేనిది కష్టకాలంలో సామాన్యుల కొద్ది మొత్తాల వడ్డీని మాఫీ చేస్తే తప్పేమిటి? మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ కుదరదంటున్న బ్యాంకుల వాదననే ఆర్బీఐ న్యాయస్థానంలో వినిపిస్తున్నది. కష్టకాలంలో కూడా వడ్డీమీద వడ్డీ వేసి వ్యాపారం చేస్తామనడం విచారకరం. అసలు రాకపోతే నష్టపోయినట్టు కానీ, అదనపు వడ్డీ కూడా నష్టమేనని వాదించడం సరికాదు. ప్రభుత్వం, ఆర్బీఐ ఇప్పటికైనా తమ వ్యవహారశైలి మార్చుకుంటే మంచిది. 

శ్రీనివాస్ గౌడ్ ముద్దం

Updated Date - 2020-06-18T05:46:42+05:30 IST