పోయిరా బతుకమ్మ

ABN , First Publish Date - 2020-10-25T07:35:19+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు సం బురంగా జరుపుకున్నారు. ములుగు, జయశంకర్‌ భూ పాలపల్లి, మహబూబాబాద్‌, జనగామ

పోయిరా బతుకమ్మ

సాదరంగా సాగనంపిన మహిళలు 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకగా సద్దుల పండుగ  

ఘనంగా ముగిసిన పూల జాతర


వరంగల్‌ కల్చరల్‌, అక్టోబరు 24: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు సం బురంగా జరుపుకున్నారు. ములుగు, జయశంకర్‌ భూ పాలపల్లి, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌ రూర ల్‌ జిల్లాలోని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా హన్మకొండలోని పద్మాక్షి గుట్ట ప్రాంతం సప్తవర్ణ శోభితమైంది. వేలాది మంది మహిళలు బతుకమ్మను మనసారా  కొలిచారు. వివిధ ప్రాంతాల నుంచి బతుకమ్మలతో మహిళలు ప్రవాహంలా తరలివచ్చారు. ఇక వరంగల్‌ పోతన ఆడిటోరియం, దేశాయిపేటలోని చిన్నవడ్డెపెల్లి చెరువు, భద్రకాళి ఆలయ ప్రాంగణం, ఉర్సు కరీమాబాద్‌లోని రంగలీల మైదానం, వరంగల్‌ కోట, కాజీపేటలోని వడ్డెపెల్లి చెరువు కట్ట, రామన్నపేటలోని అ మ్మఒడి ప్రాంగణం, కాశిబుగ్గలోని కోటిలింగాల దేవాల యం, కీర్తినగర్‌లోని కట్టమల్లన్న ఆలయ ప్రాంగణాలు నగరంలోని సద్దుల వేడుకలకు వేదికలుగా నిలిచాయి. 


కరోనా ప్రభావంతో..

గతంలో మహిళలు తమ బతుకమ్మలతో మైదానప్రాంతాలు, ఊరు శివారు ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ సాయంత్రం వరకు బతుకమ్మలను ఆడి చెరువులో నిమజ్జనం చేసేవారు. కానీ కరోనా ప్రభావం వల్ల ఈసారి ప్రతీ వాడ, ప్రతీ అపార్టుమెంట్‌ బతుకమ్మ వేదికలయ్యాయి. ఎక్కడికక్కడ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆట పాటల్లో హుషారు కోసం డీజేలను అమర్చుకున్నారు. మైకుల్లో పాటలు వస్తుండగా దానికి అనుగుణంగా  నృత్యాలు చేస్తూ, ఆడుతూ పాడుతూ బతుకమ్మలను ఆడారు. సంబరాల్లో మునిగి తేలారు. ఇన్నాళ్ళు కరోనా వారిని ఇళ్ళలోనే కట్టిపడేయగా బతుకమ్మ పండుగతో  బంధనాలు తెగినట్టు ఒక్క సారిగా స్వేచ్ఛాప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు భావించారు. అందరి ముఖాల్లో సంతోషం, సంబరమే కనిపించింది. కరోనా భయం ఏ కోశానా కానరాలేదు. ముందు జాగ్రత్తగా ముఖాలకు మాస్క్‌లైతే ధరించారు కానీ.. అది కూడా నామమాత్రంగానే. గుంపులుగా గుమిగూడే అవకాశం ఎక్కువ ఉండే అవకాశమున్నందు వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించినా ఖాతరు చేయలేదు. తొలి రోజు ఎంగిలి బతుకమ్మ వేడుకలు పేలవంగా జరగ్గా సద్దుల బతుకమ్మ మాత్రం జోష్‌గా.. హుషారుగా సాగింది. 


తెలంగాణ సంస్కృతికి ప్రతీక : ఎర్రబెల్లి 

రాయపర్తి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం స ద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఊకల్‌, మైలా రం, పెర్కవేడు, కొత్తూరు గ్రామాల్లో పలుచోట్ల బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నెత్తిన బతుకమ్మను ఎత్తుకుని మహిళలతో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌, ఆకుల సురేందర్‌రావు, మునావత్‌ నర్సింహనాయక్‌, వనజారాణి, సర్పంచ్‌ చిన్నాల తారాశ్రీ తదితరులు పాల్గొన్నారు. 


బతుకమ్మ పేర్చిన మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి: సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం మండలకేంద్రంలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  బతుకమ్మను పేర్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌, మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషాదయాకర్‌రావు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మను తీర్చిదిద్దారు. 


కరోనా తగ్గలేదు జాగ్రత్త.. : మంత్రి ఈటల 

కమలాపూర్‌: కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదని, జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కమలాపూర్‌ మండల కేంద్రంలో శనివారం జరిగిన బతకమ్మ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఆడుకోవాలన్నారు. వచ్చే సద్దులనాటికి కరోనాకు వాక్సిన్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జడ్పీ చైర్మన్‌ కనుమండ్ల విజయ, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కళ్యాణి, సర్పంచ్‌ విజయ, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు ఈటల భద్రయ్య, రమేష్‌, లక్ష్మణ్‌రావు, శ్రీకాంత్‌, సంపత్‌, రాజ్‌కుమార్‌, సమ్మిరెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T07:35:19+05:30 IST