Advertisement
Advertisement
Abn logo
Advertisement

సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు, మగువ మనసు వారి సహకారంతో శనివారం(అక్టోబర్ 9) రోజున బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా, ధూంధాంగా నిర్వహించారు. ఈ పండుగను సింగపూర్ తెలుగు సమాజం గత 13 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తోంది. కరోనా కోరల్లో నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు వారందరి క్షేమమే ప్రత్యేక ఉద్దేశంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల్ని సామాజిక మాధ్యమాల ద్వారానే జరిపారు. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చిన్న చిన్న బృందాలుగా జూం యాప్ ద్వారా అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో, కోలాటాల విన్యాసాలతో బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొని వేడుక చేసుకొన్నారు. క్లిష్ట సమయంలో సైతం పండుగ శోభ ఏమాత్రం తగ్గకుండా రకరకాల పువ్వులతో అనేక రంగురంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మన తెలుగు అమ్మాయి, మిస్ యూనివర్స్ సింగపూర్ 2021గా ఎన్నికైన కుమారి నందిత బన్న మాట్లాడుతూ కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లోని తెలుగు వారు ఇంత పెద్ద ఎత్తున ఈ పండగ జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ తెలంగాణ గాయని మధుప్రియ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె పాడిన బతుకమ్మ పాటలు మహిళలకు మరింత ఉత్సాహానిచ్చాయి.


సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. మనిషి ప్రకృతితో మమేకమయ్యే పండుగలలో అతి పెద్దదైన ఈ బతుకమ్మ పూల పండుగ ఘనమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. వెయ్యి సంత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్‌లో ఇంత సాంప్రదాయబద్ధంగా పెద్దఎత్తున నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరుపున బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

టాస్-మనం తెలుగు తరుపున అనితా రెడ్డి మాట్లాడారు. ప్రాంతాలు, మాండలికాలు వేరైనా అందరం కలసికట్టుగా, సంసృతి సాంప్రదాయాలతో పాటు బతుకుల బంధాలు తెలిపే పండుగ ఈ బతుకమ్మ అని తెలిపారు. మగువ మనసు తరుపున ఉష వర్రా మాట్లాడుతూ ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున పండగ చేసుకొనే మనం ప్రత్యేక పరిస్ధితులలో జూమ్ ద్వారా కూడా అట్టహాసంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం చేసినట్లు నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి తెలిపారు. ఈవేడుకలో పాల్గొని విజయవంతం చేయడంలో సహకరించిన అందరికీ, వాఖ్యతగా వ్యవహరించిన శ్రీదేవికి, కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్,టాస్-మనం తెలుగు, మగువ మనసు వారికి, స్పాన్సర్లకు కార్యదర్శి సత్యచిర్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement