కీపర్ చేతిలో బంతి.. రెండు పరుగులు తీసిన బ్యాట్స్‌మెన్

ABN , First Publish Date - 2020-10-29T23:42:29+05:30 IST

ప్రస్తుతం జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కీపర్ చేతిలో బంతి ఉండగానే, అతడు చూస్తుండగానే బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు తీశారు.

కీపర్ చేతిలో బంతి.. రెండు పరుగులు తీసిన బ్యాట్స్‌మెన్

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కీపర్ చేతిలో బంతి ఉండగానే, అతడు చూస్తుండగానే బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు తీశారు. దీంతో మ్యాచ్ కాస్తా డ్రా అయింది. పాక్సెలోనా సీసీ-కటలున్యా టైగర్స్ మధ్య జరిగిన టీ10 మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. పాక్సెలోనా సీసీ జట్టు విజయానికి చివరి బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైక్‌లో ఉన్న అదాలత్ అలీ బంతిని బలంగా బాదాడు. అయితే, అది మిస్సై కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయినప్పటికీ అలీ మెరుపు వేగంతో పరుగు తీశాడు. 


మరోవైపు, బంతి అందుకున్న కీపర్ ఇక తాము గెలిచినట్టే భావించి బంతి వికెట్ల పైకి విసరకుండా పట్టుకుని నెమ్మదిగా స్టంప్స్ వద్దకు చేరుకున్నాడు. ఇంకోవైపు, రెండో పరుగు కోసం యత్నించిన అలీ.. నాన్ స్ట్రైకర్‌ అజీమ్ ఆజంని పిలిచాడు. గమనించిన కీపర్ బంతిని పట్టుకుని వికెట్ల వద్ద రెడీగా నిలుచున్నాడు. అయితే, అలీ వచ్చే వరకు క్రీజును విడిచిపెట్టని ఆజం.. అతడు రాగానే పరుగు తీశాడు. దీంతో కీపర్ వెంటనే బంతిని బౌలర్‌కు అందించగా, పిచ్ మధ్యలో ఉన్న అతడు వికెట్ల వైపు విసిరాడు. అది గురితప్పడంతో పాక్సెలోనా జట్టుకు రెండు పరుగులు లభించాయి.


ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. దీంతో మ్యాచ్ ‘గోల్డెన్ బాల్’ రూల్ (యూరోపియన్ సిరీస్‌లో విజేతను ఇలానే నిర్ణయిస్తారు)కు దారి తీసింది. గోల్డెన్ బాల్‌ రూల్‌లో చేజింగ్ జట్టుకు ఒక్క బంతి వేస్తారు. ఆ బంతికి రెండు, అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే విజేతగా పరిగణిస్తారు. పాక్సెలోనా జట్టు ఒకే ఒక్క పరుగు చేయడంతో కటలున్యా టైగర్స్ జట్టు విజయం సాధించింది. 



Updated Date - 2020-10-29T23:42:29+05:30 IST