Abn logo
Oct 13 2021 @ 00:19AM

బతుకమ్మ తత్వమిది!

సంప్రదాయాల్లోని పరమార్థాన్ని భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో బతుకమ్మ నృత్యంమీద అధ్యయనం సాగించారు కూచిపూడి కళాకారిణి గుమ్మడి ఉజ్వల. ‘‘21రోజులు సాగే బతుకమ్మ తొమ్మిది రోజులకే పరిమితమైంద’’ని ఆమె ఆవేదన చెందుతున్నారు. బతుకమ్మ రూపు వెనకున్న అంతరార్థాన్ని, ఆ వేడుకలోని ఆంతరంగిక భావంతో పాటు మిగతా విశేషాలను యువ పరిశోధకురాలు ఉజ్వల మాటల్లో తెలుసుకుందాం.!


‘‘మారుతున్న కాలంలో నాగరికతతో పాటు కొన్ని సంప్రదాయాలు కొనసాగుతుంటాయి. కానీ వాటి అంతరార్ధం, ఆ సంప్రదాయాలను ఆచరించడం వెనకున్న ప్రధాన కారణాలు మాత్రం కనుమరుగవుతాయి. అవి తెలుసుకోవాలనే తీరిక, ఓపిక కొత్త తరానికి ఉండదు. సంప్రదాయాల్లోని తర్కాన్ని అసలు గుర్తించకుండానే చాలా సందర్భాల్లో వాటిని గుడ్డిగా ఆచరిస్తుంటాం. ప్రతి సంప్రదాయం వెనుక గొప్ప చరిత్ర ఉంటుందని నమ్ముతాను. సాధారణంగా దేవుడిని పూలతో పూజిస్తారు. ఆ పూలనే ఆరాధించే సంస్కృతి ఒక్క బతుకమ్మ పండుగలోనే చూస్తాం. అదొక నృత్య ప్రధానమైన వేడుక. ‘బతుకమ్మ ఆడారా! అంటాం కానీ, చేశారా! చూశారా’ అనం కదా.! అలాంటి అరుదైన సంప్రదాయంలోని పరమార్థాన్ని తెలుసుకోవాలి అనిపించింది. అప్పటికే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్‌ తీసుకున్నాను. తర్వాత బతుకమ్మ మీదే పీహెచ్‌డీ చేద్దామనుకొని నా అధ్యయనం ప్రారంభించాను. ఆ క్రమంలో నృత్యానికి సంబంధించిన చాలా పుస్తకాలు తిరగేశాను. కేవలం ఒకటి లేదా రెండు పుస్తకాల్లోనే బతుకమ్మ నృత్యానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ‘మనం మన నృత్యాలు’ పరిశోధన గ్రంథంలో బతుకమ్మను వినోద ప్రధాన నృత్యంగా నిర్వచించడం చూసి ఒక తెలంగాణ అమ్మాయిగా బాధపడ్డాను. 

21రోజుల బతుకమ్మ...

తెలంగాణలో ఆరు రకాల కళారూపాలున్నాయి. అవన్నీ కూడా సమాజ మార్పు కోసం దోహదపడేవే.! అందులో బతుకమ్మ ఫలసత్వ కళారూపమనవచ్చు. కాకతీయుల కాలంలో బతుకమ్మను నృత్య పూజగా పరిగణించారు. కాలక్రమేణా అది కాస్త నృత్యనోముగా మారింది. బతుకమ్మను దసరాతో కలిపి 21రోజులు ఆడతారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు తొమ్మిది రోజులు బాలికలు, పెళ్లికాని అమ్మాయిలంతా కలిసి బొడ్డెమ్మ ఆడతారు. ఒక చెక్కపీఠ మీద పుట్టమన్నుతో పాటు పూలను కలిపి బొడ్డెమ్మను పేర్చి, పైన మట్టి ప్రమిదలో బియ్యంతో పాటు ఒత్తి వెలిగిస్తారు. పంచభూతాలకు ప్రతిరూపంగా బొడ్డెమ్మను కొలుస్తారు. ఆడపిల్లలంతా చేరి ఒక అమ్మాయి పుట్టింది మొదలు యవ్వన దశ వరకు వాళ్ల జీవితానికి సంబంధించిన పాటలు, కృష్ణలీలలు, రకరకాల ఆటలను వర్ణించే పాటలను పాడుతూ తొమ్మిదో రోజున బావిలోనో, చెరువులో బొడ్డెమ్మను వదిలి వస్తారు. ఆ మరుసటి రోజున ఎంగిలిపూల బతుకమ్మ మొదలవుతుంది.


బతుకమ్మ పుస్తకం కోసం...

తెలంగాణ పల్లెలు తిరిగి, పుస్తకాలు చదివి, అనేక మంది పరిశోధకులతో చర్చించి బతుకమ్మ నృత్యం మీద ఒక సమగ్ర అధ్యయనం అయితే చేయగలిగాను. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పీహెచ్‌డీ చేయలేకపోయాను. బతుకమ్మ మీద నేను రాసిన పుస్తకాన్ని ప్రచురించలేకపోయాను. అది ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది నా కోరిక. బతుకమ్మ మీద పరిశోధన చేస్తున్నానని తెలిసి, ‘అందులో అంతగానం ఏముంది’ అని కొందరు నవ్వారు. ఆడవాళ్ల జీవితానికి కావాల్సిన జ్ఞానమంతా బతుకమ్మలో ఉందని నా అధ్యయనం ద్వారా నిరూపించగలిగాను. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోనూ తెలంగాణ ప్రతినిధిగా బతుకమ్మమీద ప్రత్యేక నాట్య ప్రదర్శనలిచ్చాను.  


నృత్యఖని...

మాది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖని. మా నాన్న గుమ్మడి పెద్దులు సింగరేణి ఉద్యోగి. శాస్త్రీయ నృత్యంమీద ప్రేమతో రోజూ మా ఊరికి ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలోని మంథని వెళ్లి కూచిపూడి నేర్చుకున్నాను. తర్వాత కింగ్‌కోఠిలోని త్యాగరాయ సంగీత, నృత్య కళాశాలలో డిప్లొమా పూర్తిచేశాను. హెచ్‌సీయూలో పీజీ అయిపోయాక, ఒక కార్పొరేట్‌ స్కూల్లో డ్యాన్స్‌ టీచర్‌గా కొన్నాళ్లు పనిచేశాను. కళలు ఖరీదుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రీయ నృత్యాన్ని గ్రామాలకు తీసుకెళ్లాలనుకున్నాను. మా గోదావరి ఖనిలోనే ‘నృత్యఖని’ పేరుతో ఆరేళ్లుగా పిల్లలకు కూచిపూడి నేర్పిస్తున్నాను. ఇప్పటి వరకు సుమారు 300మంది నా వద్ద శిక్షణ పొందారు. రామగుండం మున్సిపాలిటీకి నేను బ్రాండ్‌ అంబాసిడర్ని కూడా.! 

 కె. వెంకటేశ్‌


బొడ్డెమ్మను మరిచాం...

మన అవసరానికి అనుగుణంగా సంప్రదాయాలను మారుస్తూ, వాటి స్ఫూర్తిని భావితరాలకు తెలియకుండా చేస్తున్నాం. అలా బొడ్డెమ్మను దాదాపుగా కనుమరుగయ్యేలా చేశాం. మారుమూల పల్లెల్లోనూ ఎక్కడో ఒకచోట మినహా బొడ్డెమ్మను ఆడటం లేదు. బతుకమ్మ ఆటలోనూ చాలా చోట్ల కోలాటాలు, డీజేలు పెట్టి పిచ్చి గంతులేయడం బాధాకరం. బతుకమ్మ పాటల్లోనూ, నృత్యంలోనూ ఒక రిథమ్‌ ఉంటుంది. అది సమిష్ఠి తత్వానికి ప్రతీక. 


గర్భాశయ ఆకారంలో...

బతుకమ్మ పూర్తిగా మహిళలకు సంబంధించిన పండుగ. అందులో పూజలు, పురస్కారాలకు తావు లేదు. అంటు, ముట్టు పట్టింపు అస్సలే ఉండదు. పేద, ధనిక తేడా లేకుండా ఆడవాళ్లంతా కలిసి తమ జీవితం తాలూకూ పాఠాలను, గుణపాఠాలను పాటలుగా పాడుతూ, ఆడతారు. శ్రావణమాసంలో పెళ్లైన మహిళలు కొందరు పిల్లలు పుట్టాలని, గర్భవతులైన వాళ్లు మరికొందరు సుఖప్రసవం కావాలని కోరుతూ బతుకమ్మలో తప్పనిసరిగా పాల్గొంటారు. బతుకమ్మ రూపు త్రిభుజాకారంలో పేరుస్తారు అంటారు. కానీ నిజానికి బతుకమ్మ గర్భాశయాన్ని పోలి ఉంటుంది. తమను తాము గౌరవించుకుంటూ ఆడవాళ్లంతా నోచుకునే నోము ఇది. బతుకమ్మలోని పువ్వులు పునరుత్పత్తికి ప్రతీకలు. బతుకమ్మ ఆటలో పదేపదే వంగి లేవడం మంచి వ్యాయామం కూడా. చప్పట్లు కొట్టడంతో నరాలు ఉత్తేజితం అవుతాయి. మనలో ఒక పాజిటీవ్‌ వైబ్రేషన్‌ క్రియేట్‌ అవుతుందని నా పరిశోధనలో వివరించారు. 


గౌరమ్మ రూపం ...

బతుకమ్మ శిఖరంలో కూర్చోబెట్టే గౌరమ్మను త్రిభుజాకారంలో చేయడం సరికాదని నా అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. పసుపు ముద్దను నిలబెట్టి, చూపుడు వేలితో మధ్యలో నొక్కుతారు. ఆ రూపం స్త్రీ జననేంద్రియ ఆకారాన్ని ప్రతిబింబిస్తుంది. అలానే ప్రత్యుత్పత్తికి ప్రతిరూపంగా భావిస్తూ, ఆ పక్కనే గుమ్మడి పువ్వును గుచ్చుతారు. వంశాభివృద్ధి ఆకాంక్షతో తెలంగాణలో నూతన దంపతుల చేత గుమ్మడి విత్తనాలు నాటించడం సంప్రదాయం. గుమ్మడి పువ్వునూ దేవతగా ఆరాధించడం బతుకమ్మ వేడుకలో చూస్తాం.