బీసీల ఓట్లే కీలకం

ABN , First Publish Date - 2020-11-22T09:52:36+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలకు బీసీలే కీలకంగా మారారు.

బీసీల ఓట్లే కీలకం

గ్రేటర్‌లో సగం డివిజన్లలో ప్రభావితం... వారికే పెద్దపీట వేసిన ప్రధాన పార్టీలు

జనరల్‌ స్థానాల్లోనూ వారికి అవకాశం

యాదవ, గౌడ, మున్నూరు కాపులకు ఎక్కువ

టికెట్ల కేటాయింపులో అన్ని పార్టీలదీ ఒకే ఫార్ములా


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలకు బీసీలే కీలకంగా మారారు. నగరం మొత్తంలో 150 డివిజన్లు ఉండగా, దాదాపు 60, 70 డివిజన్లలో బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. దాంతో, వారి ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేశాయి. గ్రేటర్‌ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించగా, పలు రాజకీయ పార్టీలు 50 శాతానికి మించి స్థానాలను కేటాయించాయి. పలుచోట్ల జనరల్‌  స్థానాల్లో సైతం బీసీలకు టికెట్లు ఇచ్చాయి. టీఆర్‌ఎస్‌ సగానికి సగం సీట్లు బీసీలకు ఇవ్వగా.. బీజేపీ అంతకుమించి ఇచ్చింది. బీసీ కులాల్లోనూ యాదవ, గౌడ, మున్నూరు కాపు కులాలకే అగ్రతాంబూలం దక్కింది. ఆయా డివిజన్లలో బీసీ రిజర్వేషన్ల ప్రకారం యాదవ సామాజిక వర్గానికి  టీఆర్‌ఎస్‌ 14, బీజేపీ-15, కాంగ్రెస్‌-10, టీడీపీ-8 టికెట్లు ఇచ్చాయి. గౌడ కులస్తులకు టీఆర్‌ఎస్‌-15, బీజేపీ-10, కాంగ్రెస్‌-11, టీడీపీ-12 టికెట్లు కేటాయించాయి. మున్నూరు కాపులకు టీఆర్‌ఎస్‌-12, బీజేపీ-8, కాంగ్రెస్‌-4 ఇచ్చాయి. కాపు (ఓసీ)లకు టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4, కాంగ్రె స్‌-4, టీడీపీ-3; కమ్మ (ఓసీ)లకు టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-4, కాంగ్రెస్‌-2, టీడీపీ-6 కేటాయించాయి.


మైనారిటీలకు టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-1, కాంగ్రెస్‌-10, టీడీపీ-4 టికెట్లు ఇచ్చాయి. అలాగే, ముదిరాజ్‌లకు టీఆర్‌ఎస్‌-5, బీజేపీ-5, కాంగ్రెస్‌-5, టీడీపీ-5, మాదిగ, మాలలకు టీఆర్‌ఎస్‌-7, బీజేపీ-9, కాంగ్రెస్‌-7, టీడీపీ-10 కేటాయించాయి. విశ్వకర్మ, పెరిక, నాయీ బ్రహ్మణ, మార్వాడీ, రజక, లోథీ, గంగపుత్ర, చౌదరి కులాలకు రెండు నుంచి నాలుగు టికెట్లు కేటాయించాయి. చాలావరకూ డివిజన్లలో పార్టీలన్నీ ఒకే ఫార్ములాను అమలు చేశాయి. ఇతర పార్టీలు ఏయే డివిజన్లలో ఏయే సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు కేటాయించాయో.. మిగిలిన పార్టీలు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యమిచ్చాయి.


18 లక్షలకుపైగా బీసీలే

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రస్తుతం 74.04 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 18 లక్షలకుపైగా బీసీలే ఉన్నారు. సుమారు పది నుంచి 12 సర్కిళ్ల పరిధిలో వీరు 30 శాతానికిపైగా ఉన్నారు. గోషామహల్‌, ఖైరతాబాద్‌, కార్వాన్‌, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో బీసీల ప్రాబల్యం అధికంగా ఉంది. ఆయా సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో బీసీలు ఏవైపు మొగ్గు చూపుతారో వారే విజేతలుగా నిలువనున్నారు. పటాన్‌చెరు సర్కిల్‌లో మూడు డివిజన్లు ఉండగా, వాటిలో బీసీలకే ఎక్కువ ప్రాబల్యం ఉంది. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి సర్కిళ్లలోనూ బీసీ ఓటర్లే అధికం. ఆయా డివిజన్లలో వారు గెలుపోటములను నిర్ణయించనున్నారు.


కొన్ని ప్రాంతాల్లో ఇతరుల ప్రభావం

మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గోషామహల్‌ నియోజక వర్గంలోని బేగంబజార్‌, రాంకోఠి ప్రాంతాల్లో వ్యాపారం చేసే మార్వాడీలు, గుజరాతీలు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ, కాపుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. కొన్ని డివిజన్లలో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ఓటర్ల ప్రాబల్యముంది. దాంతో, ప్రధాన పార్టీలు సైతం వారికే టికెట్లను కేటాయించాయి.

Updated Date - 2020-11-22T09:52:36+05:30 IST